/rtv/media/media_files/2025/11/13/al-falah-university-2025-11-13-10-33-19.jpg)
AL FALAH UNIVERSITY
AL FALAH UNIVERSITY: దేశవ్యాప్తంగా చర్చకు కారణమైన పేరు అల్ ఫలాహ్ యూనివర్సిటీ. ఒకప్పుడు విద్యా ప్రమాణాలకు ప్రసిద్ధి పొందిన ఈ విశ్వవిద్యాలయం ఇప్పుడు తీవ్ర విమర్శలకు గురవుతోంది. కారణం తాజాగా ఢిల్లీలో జరిగిన బాంబు పేలుళ్ల(Delhi Bomb Blast) కేసు ఈ యూనివర్సిటీతో సంబంధం కలిగి ఉండటమే.
పోలీసుల దర్యాప్తు ప్రకారం, ఫరీదాబాద్ లోని ఈ యూనివర్సిటీకి చెందిన పలువురు వైద్యులు ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు తేలింది. ముఖ్య నిందితుడు డాక్టర్ ఉమర్ నబీ, ఈ యూనివర్సిటీలో అధ్యాపకుడిగా పనిచేశాడు. నవంబర్ 10న ఢిల్లీ రెడ్‌ఫోర్ట్ సమీపంలో హ్యుందాయ్ i20 కారులో జరిగిన పేలుడుకి ఆయన పేరు సంబంధం కలిగినట్టు దర్యాప్తు అధికారులు ఇప్పటికే తెలిపారు.
2,900 కిలోల అమోనియం నైట్రేట్ స్వాధీనం
ఇంతకుముందు, ఈ యూనివర్సిటీకి చెందిన మరొక అధ్యాపకుడు డాక్టర్ ముజమ్మిల్ షకీల్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఆయన గదిలో దాదాపు 2,900 కిలోల అమోనియం నైట్రేట్ పేలుడు పదార్థం స్వాధీనం చేసుకున్నారు. అంతేకాక, అదే యూనివర్సిటీలో పనిచేసిన డాక్టర్ షాహీన్ షాహిద్ కూడా జైషే మొహమ్మద్ సంస్థ మహిళా విభాగంతో సంబంధాలు కలిగి ఉన్నట్లు ఇంటెలిజెన్స్ సమాచారం తెలుపుతోంది.
దీంతో జాతీయ దర్యాప్తు సంస్థలు (NIA), ఈ యూనివర్సిటీలోని సిబ్బంది, విద్యార్థులను ప్రశ్నించాయి. ఇప్పటివరకు 52 మందిని విచారించి, 6 మందిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.
అల్ ఫలాహ్ యూనివర్సిటీ హర్యానా రాష్ట్రంలోని ఫరీదాబాద్ జిల్లా ధౌజ్ గ్రామంలో 70 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. 1997లో ఇంజినీరింగ్ కళాశాలగా ప్రారంభమైన ఈ సంస్థకు 2014లో హర్యానా ప్రభుత్వం విశ్వవిద్యాలయ హోదా ఇచ్చింది. ఇక్కడ మెడికల్, ఇంజినీరింగ్, మేనేజ్‌మెంట్ వంటి విభాగాలు ఉన్నాయి.
ఈ విశ్వవిద్యాలయాన్ని అల్ ఫలాహ్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తోంది. ఈ ట్రస్ట్ 1995లో స్థాపించారు. ఒకప్పుడు అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ, జామియా మిలియా ఇస్లామియా వలె మైనారిటీ విద్యార్థులకు ప్రత్యామ్నాయంగా ఈ యూనివర్సిటీ పేరు నిలిచింది.
‘అల్ ఫలాహ్’ అనేది అరబిక్ పదం, దాని అర్థం విజయము లేదా విముక్తి. కానీ ప్రస్తుతం ఈ పేరు దేశవ్యాప్తంగా ఉగ్రవాదం కారణంగా చెడ్డ పేరుకి గురవుతోంది. విద్య, విజ్ఞానం ఇచ్చే స్థలం ఇప్పుడు ఉగ్రవాద కార్యకలాపాలకు అడ్డాగా మారడం దేశానికి ఆందోళన కలిగించే విషయం.
ఒకప్పుడు టాప్ స్థాయి విద్యాసంస్థగా నిలిచిన అల్ ఫలాహ్ యూనివర్సిటీ, ఇప్పుడు ఉగ్రవాదంతో చర్చనీయాంశమైంది. దర్యాప్తు సంస్థలు దీని వెనుక దాగిన వాస్తవాలను వెలికితీయడానికి ప్రయత్నిస్తున్నాయి.
Follow Us