తెలంగాణలో రాజకీయ పరిణామాలు (Telangana Politics) వేగంగా మారుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ (Congress) ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపడంతో ఇప్పటికే ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరిన విషయం తెలిసిందే. వీరి బాటలోనే మరికొంత మంది ఉంటారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఈ రోజు మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ ఎన్నికల సన్నాహక సమావేశానికి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు హాజరయ్యారు. ఈ రోజు లోక్‌సభ ఇన్‌ఛార్జిగా మంత్రి తుమ్మల ఆధ్వర్యంలో తొలి మీటింగ్ జరిగింది.
ఇది కూడా చదవండి: Telangana: కేసీఆర్ అన్న కొడుకు కల్వకుంట్ల కన్నా రావు అరెస్ట్
ఈ మీటింగ్ కు భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే డా.తెల్లం వెంకట్రావ్ రావడం ఆసక్తికరంగా మారింది. దీంతో ఆయన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం పని చేసే అవకాశం ఉందని స్పష్టం అవుతోంది. పార్టీ కండువా కప్పుకోకుండానే కాంగ్రెస్‌కు ఆయన మద్దతు ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. దీంతో తెల్లం వెంకట్రావు తీరు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. తెల్లం వెంకట్రావు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.
పొంగులేటితోనే బీఆర్ఎస్ ను వీడిన తెల్లం వెంకట్రావు.. ఎన్నికలకు కొన్ని రోజుల ముందు బీఆర్ఎస్ లో చేరారు. ఆయనకు భద్రాచలం టికెట్ ను ఆ పార్టీ కేటాయించింది. గత ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మొత్తం 10 సీట్లకు గాను.. 9 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపొందింది. కేవలం భద్రాచలంలో మాత్రమే బీఆర్ఎస్ అభ్యర్థి తెల్లం వెంకట్రావు విజయం సాధించారు.