కర్వా చౌత్ వేడుకను జరుపుకునే సంప్రదాయం ఎక్కువగా గుజరాత్, మహారాష్ట్ర, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో ప్రధానంగా కనిపిస్తుంది. ఈ ఏడాది కర్వా చౌత్ అక్టోబరు 20న ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ వేడుక ప్రాముఖ్యత? ఎప్పుడు జరుపుకోవాలి? ఎందుకు జరుపుకుంటారు? సరైన ముహూర్తం ఏంటి? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం...
వివాహిత మహిళలు తమ భర్తల దీర్ఘాయువు కోసం కర్వా చౌత్ ఉపవాసాన్ని చేస్తారు. వివాహిత మహిళతో పాటు అమ్మాయిలు కూడా కాబోయే జీవిత భాగస్వాముల కోసం కూడా ఈ ఉపవాసాన్ని పాటిస్తారు. ఈ ఉపవాస సమయంలో మహిళలు శివుడు, పార్వతి దేవి, కార్తికేయ, వినాయకుడు, పార్వతీ దేవిని పూజిస్తారు.
కర్వా చౌత్ రోజున మహిళలు ఉదయం నుంచి చంద్రుడు కనిపించే వరకు ఏమీ తినకుండా, త్రాగకుండా ఉపవాసం ఉంటారు. సాయంకాలం చంద్రుని దర్శనం తర్వాత భర్త మొహాన్ని జల్లెడలో చూసి.. భర్త చేతుల మీదుగా స్త్రీలు ఉపవాసాన్ని విరమిస్తారు.
కర్వా చౌత్ ఎప్పుడు?
జ్యోతిష్య నిపుణుల ప్రకారం.. కార్తీక కృష్ణ చతుర్థి తిథి ప్రారంభం: అక్టోబర్ 20న ఉదయం 6:46 గంటలకు కార్తీక కృష్ణ చతుర్థి తిథి ముగింపు: అక్టోబర్ 21 ఉదయం 4:16 గంటలకు కర్వా చౌత్ ఉపవాస సమయం: ఉదయం 6:25 నుంచి 7:54 వరకు కర్వా చౌత్ పూజ ముహూర్తం: సాయంత్రం 5:46 నుంచి 7:02 వరకు కర్వా చౌత్ రోజున చంద్రోదయ సమయం: సాయంత్రం 7:54 pm.
కర్వా చౌత్ ప్రాముఖ్యత
కర్వా చౌత్ వేడుక భార్యాభర్తల ప్రేమ, వైవాహిక జీవితానికి సంబంధించినది. భర్త క్షేమం, ఆయు ఆరోగ్యాల కోసం స్త్రీలు ఈ ఉపవాసాన్ని పాటిస్తారు. ఇతిహాసాల ప్రకారం సావిత్రి తన భర్త యొక్క ఆత్మ కోసం మృత్యుదేవత అయిన యముడిని ఈ ఉపవాస దీక్షతో వేడుకుంటుంది.
వివాహిత స్త్రీలు భర్తల శ్రేయస్సు, దీర్ఘాయువు కోసం కఠినమైన ఉపవాసాన్ని పాటించడమే కర్వా చౌత్ ముఖ్య ఉద్దేశం. ఉత్తర భారతదేశంలో, మరికొన్ని ప్రాంతాలలో కూడా ఈ వేడుకకు ప్రాముఖ్యత ఉంటుంది.