/rtv/media/media_files/2025/05/19/Ce7CwLVXcObcA6BiaHyH.jpg)
Health Risks of Ivy Gourd Curry
Health Risks of Ivy Gourd Curry: దొండకాయను ఆరోగ్యానికి మంచిదని అంటారు. ఇందులో ఎన్నో పోషకాలు ఉంటాయి - ముఖ్యంగా ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. వీటి వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు లభిస్తాయి.. అయితే, కొందరికి మాత్రం దొండకాయ పడదు. కొన్ని ఆరోగ్య పరిస్థితుల్లో దొండకాయ తినడం వలన ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. అలాంటి సందర్భాల్లో దొండకాయను తినకపోవడమే చాలా మంచిది.. ఈ కూరగాయలో విటమిన్ బి కాంప్లెక్స్, సి విటమిన్, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం వంటి పుష్కల పోషకాలు ఉన్నా, మన ఆరోగ్య పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకుని దొండకాయ తినేప్పుడు జాగ్రత్త వహించడం అవసరం.
ఈ సమస్యలతో బాధపడేవారు దొండకాయకు దూరంగా ఉండాలి:
1. 'లో' బీపీ ఉన్నవారు
దొండకాయ సహజంగా రక్తపోటును తగ్గించే గుణంతో ఉంటుంది. అధిక రక్తపోటు ఉన్నవారికి ఇది మేలు చేస్తుంది. కానీ, లో బీపీ ఉన్నవారికి ఇది చాలా ప్రమాదకరం. దొండకాయ తిన్న తర్వాత రక్తపోటు మరింతగా పడిపోయే ప్రమాదం ఉంది. తలనొప్పి, అలసట, మూర్ఛ వంటి సమస్యలు రావచ్చు. అందుకే, లో బీపీ ఉన్నవారు దొండకాయను తక్కువ మోతాదులో లేదా పూర్తిగా మానేయడం మంచిది..
2. అలెర్జీకి గురయ్యే వారు
కొంతమందికి కూరగాయల పట్ల అలెర్జీలు ఉండొచ్చు. ముఖ్యంగా శ్వాస సంబంధిత లేదా చర్మ సంబంధిత అలెర్జీలు ఉన్నవారికి దొండకాయ తినడం వలన వికారం, వాంతులు, చర్మంపై దద్దుర్లు, వాపు వంటి సమస్యలు తలెత్తవచ్చు. తీవ్రమైన అలెర్జీ ఉన్నవారికి శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బందులు ఏర్పడవచ్చు. అలాంటి వారు ముందస్తుగా టెస్టులు చేయించుకుని, డాక్టర్ సూచనల మేరకు దొండకాయను తినాలి.
3. శస్త్రచికిత్సకు సిద్ధమవుతున్నవారు
ఆపరేషన్‌కు ముందు, తర్వాత కొన్ని ఆహార పదార్థాలను తినకుండా ఉండాల్సి ఉంటుంది. దొండకాయ కూడా ఆ లిస్ట్ లోకే వస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడం వల్ల, శస్త్రచికిత్స సమయంలో అది సమస్యలకు దారి తీసే అవకాశం ఉంది. అందుకే, ఆపరేషన్‌కు కనీసం వారం లేదా పది రోజుల ముందు దొండకాయను మానేయమని వైద్యులు సూచిస్తారు.
4. గర్భిణీ మహిళలు, పాలిచ్చే తల్లులు
గర్భిణీ స్త్రీలు, శిశువు కు పాలిచ్చే తల్లులు ఆహార ఎంపికల్లో మరింత జాగ్రత్తగా ఉండాలి. కొందరు నిపుణుల ప్రకారం, పరిమితంగా తింటే దొండకాయ నుండి లాభాలు పొందవచ్చు. కానీ, అధికంగా తీసుకుంటే జీర్ణ సమస్యలు రావొచ్చు. ముఖ్యంగా శిశువులకు వాంతులు వంటి ఇబ్బందులు కలగొచ్చు. అందుకే ఇలాంటి వారు దొండకాయ తీసుకునే ముందు వైద్యుల సలహా తప్పనిసరి తీసుకోవాలి..
5. తక్కువ షుగర్ ఉన్న డయాబెటిక్ పేషెంట్లు
డయాబెటిస్ ఉన్నవారు రోజువారీ డైట్ విషయంలో బాగా జాగ్రత్త పడాలి. దొండకాయ రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గిస్తుంది. ఇది షుగర్ లెవల్స్ అధికంగా ఉన్నవారికి మేలు చేస్తుంది. కానీ, హైపోగ్లైసేమియా (తక్కువ చక్కెర స్థాయి) ఉన్నవారికి మాత్రం ఇది ప్రమాదకరం. శరీరానికి కావలసిన చక్కెర అందకపోవడం వలన కంటి చూపు సమస్యలు, బలహీనత, ఫోకస్ లోపం వంటి లక్షణాలు ఏర్పడవచ్చు. అందువల్ల, డయాబెటిక్ పేషెంట్లు తమ గ్లూకోజ్ స్థాయిలను తెలుసుకొని దొండకాయ తినాలా వద్దా అన్నది నిర్ణయించాలి.
దొండకాయ ఆరోగ్యానికి మంచిదే. అయితే ప్రతి ఆహార పదార్థం అందరికీ ఒకేలా పనిచేయదు. మన ఆరోగ్య పరిస్థితిని బట్టి, దాని ప్రభావాన్ని ముందుగానే అంచనా వేసుకుని, అవసరమైతే వైద్యుల సలహాతో తీసుకోవడం మంచిది. పై లిస్టులో చెప్పిన సమస్యలు ఏవైన మీకు ఉంటే, దొండకాయను తినే ముందు ఒకసారి ఆలోచించండి.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.