చాలా మంది మహిళలు.. పిల్లలు, భర్త , ఇంటి బాధ్యతలు అంటూ బిజీగా గడిపేస్తూ తమ ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేస్తుంటారు. క్రమంగా ఇది ఇలాగే కొనసాగితే ఆరోగ్యం మరింత దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. కావున మహిళలు తమ ఆరోగ్యం విషయంలో ఈ ప్రాథమిక విషయాలను పాటించడం వారి ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెబుతున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
శారీరక శ్రమ
మహిళలకు మాత్రమే కాదు ప్రతి ఒక్కరికి శారీరక శ్రమ చాలా అవసరం. ప్రతి రోజు కొంత సమయం వ్యాయామం చేయడం ద్వారా గుండె జబ్బులు, మధుమేహం, చిత్తవైకల్యం వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. స్త్రీలు శారీరకంగా చురుకుగా ఉండడం వల్ల అనేక సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. ప్రతి స్త్రీ వారానికి 30-60 నిమిషాలు 4-5 రోజులు పాటు మితమైన తీవ్రతతో వ్యాయామం చేయడం ఆరోగ్యానికి మంచిది.
ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం తప్పనిసరి. ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వు, పిండి పదార్ధాలను కలిగి ఉన్న ఆహారాలను డైట్ లో చేర్చుకోవాలి. వీలైనంత వరకు తృణధాన్యాలు తినడానికి ప్రయత్నించండి. ప్యాక్ చేసిన వస్తువులను తినడం మానుకోండి.
హెల్త్ చెకప్
సాధారణంగా అందరు ఆరోగ్యం బాగాలేనప్పుడు మాత్రమే వైద్యుడి దగ్గరకు వెళ్తారు. కానీ నిపుణుల సూచనల ప్రకారం ప్రతీ సంవత్సరం వార్షిక హెల్త్ చెకప్ తప్పనిసరిగా చేయించుకోవాలి. శరీరంలో అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ లెవెల్స్ వంటి ప్రాథమిక విషయాలను తనిఖీ చేస్తూ ఉండాలి.
తగినంత నిద్ర
చాలా మంది మహిళలు రోజూవారి పనుల కారణంగా రాత్రిళ్ళు సరిగ్గా నిద్రపోరు. కానీ ఇది ఆరోగ్యానికి చాలా హానికరం. ఇతర విషయాల వలె నిద్రకు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. సరైన నిద్ర ఉంటే.. ఆ రోజు కూడా అంతే ఉత్పాదకంగా ఉంటుంది. శరీరాన్ని కూడా శక్తివంతంగా ఉంచడంలో సహాయపడుతుంది.
నచ్చిన పని చేయండి
రోజూ కొంత సమయం మనసుకు నచ్చిన పని చేయడం ద్వారా మనసు ప్రశాంతంగా, ఆనందంగా ఉంటుంది. దీని వల్ల శరీరంలో ఆనందానికి సంబంధించిన హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తుంది.