Khammam Floods: ఆకాశానికి చిల్లు పడిందన్నట్టు కురిసిన వాన.. నేలంతా నాదే అన్నట్టు పరవళ్లు తొక్కిన వరద.. గుక్కెడు నీరైతే ప్రాణాలు పోస్తుంది. పట్టలేనంత నీరైతే ప్రాణాలను ముంచేస్తుంది. ఇది ఎవరూ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఖమ్మంలో మున్నేరుకు వచ్చిన వరద చూస్తే.. స్పష్టంగా ఇది అర్ధం అవుతుంది. ఇక్కడ తప్పు ఎవరిది అని ప్రశ్నిస్తే కచ్చితంగా పాలకులదే అని చెప్పొచ్చు. దశాబ్దాలుగా మున్నేరుకు దాదాపుగా ప్రతిఏటా వర్షాకాలంలో వరద రావడం.. రెండేళ్ల కోసారి ఎదో ఒక ప్రాంతంలో వరద ముంచెత్తడం జరుగుతూనే వస్తోంది. అలా వరద వచ్చినపుడు సహాయం చేయడం లేదా రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు బురద జల్లుకోవడం.. ఎన్నికల సమయంలో మున్నేరు వరదల నుంచి రక్షణ చర్యలు తీసుకుంటామని హామీలు ఇవ్వడం.. ఇలా కాలం గడిచిపోతోంది.
గడిచిపోతున్న కాలంతో పాటు సమస్య కూడా పెద్దది అవుతూ వస్తోంది. ముఖ్యంగా ఖమ్మం పట్టణానికి మున్నేరు ముప్పు ఉందనేది చాలాకాలంగా ఊహిస్తూ ఉన్నదే. గత సంవత్సరం జూన్ నెలలో కూడా మున్నేరుకు వరద వచ్చింది. అప్పుడు కూడా చాలా కాలనీలు జలమయమయ్యాయి. కానీ, దీనికి శాశ్వత పరిష్కారం తీసుకున్న దాఖలాలు లేవు. కర్ణుడి చావుకు కారణాలు అనేకం అన్నట్టు మున్నేరు వరద ఖమ్మంలో బీభత్సం సృష్టించడానికి కూడా చెప్పలేనన్ని కారణాలు ఉన్నాయి. వాటిలో మొదటిది మున్నేరు పరివాహక ప్రాంతంలో అక్రమ కట్టడాలు. వందలాదిగా అక్రమ కట్టడాలు ఎడా.. పెడా మున్నేరు బఫర్ జోన్ లో నిర్మించేశారు. దీంతో మున్నేరుకు వరద వస్తే ఆ నీరు ఎటూ పోయే అవకాశం లేక ఊరిమీద పడుతోంది. మరో ముఖ్యమైన కారణం ఖమ్మంలో కాల్వల నిర్మాణం సరిగా జరగకపోవడం. పట్టణం పెరిగిపోతున్నా.. ఇప్పటికీ మురుగునీటి పారుదల వ్యవస్థ సరిగా లేకపోవడంతో నీరు బయటకు పోయే మార్గం లేక వరద వచ్చినపుడు కాలనీలు మునిగిపోతున్నాయి. అలాగే రిటైనింగ్ వాల్ నిర్మాణం జరగకపోవడం కూడా పెద్ద సమస్య. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కారణాలు మున్నేరు ఖమ్మం పట్టణాన్ని ముంచేయడానికి కారణాలుగా చెప్పుకోవచ్చు.
Khammam Floods: ఇక ఇప్పటి వరదలకు ఖమ్మంలో బీభత్సమే జరిగింది. దాదాపుగా 25కు పైగా కాలనీలు మునిగిపోయాయి. ప్రజలు దారుణమైన ఇబ్బందుల్లో పడిపోయారు. నిజానికి వరద వచ్చే అవకాశం ఉందని ముందుగా తెలిసినప్పటికీ అధికారులు ప్రజలను అప్రమత్తం చేయడంలో విఫలం అయ్యారు. భారీ వర్షాలు మూడురోజులుగా కురుస్తున్నా.. మున్నేరు వాగుకు నీరు వచ్చే ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నా.. వాతావరణ శాఖ ప్రమాదం పొంచి ఉందని చెప్పినా.. అధికారులు ప్రజలను అప్రమత్తం చేయలేదు. అకస్మాత్తుగా ఆదివారం తెల్లవారుజామున వరద ప్రమాదం ఖమ్మం పట్టణాన్ని తాకింది. తెలవారుతుండడంతో ప్రజలు తప్పించుకోగలిగారు. వరద వచ్చి పడుతున్న సమయంలో హెచ్చరికలు జరీ చేశారు అధికారులు. ఈ వరద తెల్లవారుజామున రావడంతో ప్రజలు అప్రమత్తం కాగలిగారు.
అదే వరద కొన్ని గంటల ముందు అంటే అర్ధరాత్రి వచ్చి ఉంటె పరిస్థితి ఎలా ఉండేదో ఊహించడం కూడా కష్టమే. వేలాదిమంది ప్రాణాలను కోల్పోయే పరిస్థితి వచ్చి ఉండేదని అక్కడి స్థానికులు చెబుతున్నారు. మున్నేరుకు వరద వస్తున్న విషయాన్ని ప్రజలకు వివరించడంలో.. వరద బారిన పడే అవకాశం ఉన్న వారిని తరలించడంలో అధికారులు పూర్తిగా వైఫల్యం చెందారని వారంటున్నారు. వరద వచ్చి పడుతుండడంతో కట్టు బట్టలతో ఇళ్ళు వదిలి పరుగులు పెట్టారు. ఎక్కడి వస్తువులు అక్కడే వదిలేశారు.
కట్టుబట్టలతో..
అధికారుల నిర్వాకానికి తాము జాగ్రత్త పడలేకపోయామని వరద బాధితులు వాపోతున్నారు. వేగంగా ముంచుకొస్తున్న వరద ముప్పు నుంచి ప్రాణాలు కాపాడుకోవడానికి రక్షిత ప్రాంతాలకు కట్టుబట్టలతో వెళ్లాల్సి వచ్చిందని చెబుతున్నారు. దీంతో ఇళ్లలో ఉన్న విలువైన వస్తువులు.. డబ్బు అలానే వదిలివేయాల్సి వచ్చిందని అంటున్నారు. కొంచెం ముందుగా అధికారులు సమాచారం ఇచ్చి ఉంటే బావుండేదని బాధితులు చెబుతున్నారు.