Karumuri Sunil Kumar Yadav: ఏలూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ RTVతో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడారు. నిన్న తణుకులో జరిగిన ప్రజాగళం కూటమి సభలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆధారాలు లేని ఆరోపణలు చేశారని విమర్శలు గుప్పించారు. తమకు తెలంగాణలో స్టీల్ ఫ్యాక్టరీలు ఉన్నాయని అంటున్నారని అయితే, అవి ఎక్కడ ఉన్నాయో చెబితే వాళ్ళకే గిఫ్ట్ గా ఇచ్చేస్తామని పేర్కొన్నారు. తాను అవినీతికి పాల్పడ్డానని నిరూపిస్తూ రాజకీయాల నుండి తప్పుకుంటానని సవాల్ చేశారు.
ఓటమి తప్పదు..
తమ లాంటి యువ నాయకత్వంపై ఇలాంటి ఆరోపణలు చేయడం బాధేస్తుందన్నారు. మమ్మల్ని ఇంటికి పంపడం కాదు.. ముందు పవన్ కళ్యాణ్ ను గెలవమనండని కౌంటర్లు వేశారు. నోటికొచ్చినట్లుగా మాట్లాడితే ప్రజలు నమ్మరన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా కూటమికి ఓటమి తప్పదని.. వైసీపీ విజయం ఆగదని ధీమా వ్యక్తం చేశారు.
గొంతు కోశారు..
అసలు యువకులకు జనసేనలో స్థానం ఏంటి? ఎంత మంది యువకులకు సీట్లు ఇచ్చారని ప్రశ్నించారు. తణుకులో విడివాడ రామచంద్రరావుకు సీటు ఇస్తామని చెప్పి అతని గొంతు కోశారని ఆరోపించారు. ఇలాంటి రాజకీయాలు చేస్తూ యువతకు ఏం మెసేజ్ ఇస్తారని ప్రశ్నించారు. పవన్ కోసం బట్టలు చించుకొని కష్టపడిన వారినే ముంచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు తణుకు వచ్చిన నాలుగుసార్లు ఆ సభలు అట్టర్ ప్లాప్ అయ్యాయని.. అందుకే పవన్ ను అడ్డం పెట్టుకొని సభలు పెట్టారని పేర్కొన్నారు.
మళ్ళీ మళ్ళీ అదే
రైతులతో మాట్లాడుతున్నప్పుడు ఎవరో ఓ తాగుబోతుని ఎర్రిపప్పా అని తిడితే రైతుల్ని తిట్టినట్టు ప్రొజెక్టు చేస్తున్నారన్నారు. దానిపై ఎన్నోసార్లు వివరణలు ఇచ్చినా మళ్ళీ మళ్ళీ అదే పాట పాడుతున్నారన్నారు. తాము ఎప్పుడూ రైతులకు అండగానే ఉంటామన్నారు. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ విలువలతో కూడిన రాజకీయాలు చేయాలని సూచించారు. పవన్ కళ్యాణ్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఇక్కడెవరూ గాజులు తొడుక్కొని లేరని హెచ్చరించారు.