Jaya Prada : చాలారోజులుగా సమన్లు అందినా స్పందించకుండా తప్పించుకుంటూ వస్తున్నా బీజేపీ(BJP) మాజీ ఎంపీ సినీనటి జయప్రద(Ex. MP Jaya Prada) కోర్టులో ఎట్టకేలకు లొంగిపోయారు. దీంతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా జయప్రద పోటీ చేశారు. ఆ సమయంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఆమె ఉల్లంఘించారని ఆరోపణలు వచ్చాయి. దీంతో పోలీసులు ఆమెపై కేసులు నమోదు చేశారు. జయప్రదపై రాంపూర్‌లో రెండు కేసులు నమోదైనట్లు సమాచారం. ఈ కేసుల విషయంలో జయప్రదకు కోర్టు చాలాసార్లు నోటీసులు జారీ చేసింది. అయితే, ఆమె విచారణకు హాజరుకాలేదు. దీంతో రాంపూర్ కోర్టు ఆమె పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో జయప్రదపై కోర్ట్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అప్పటి నుంచి జయప్రద పరారీలో ఉన్నారు. జయప్రద పై కోర్టు మొత్తం ఏడు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. వాటికి జయప్రద నుంచి స్పందన లేకపోవడంతో నటి జయప్రద పరారీలో ఉన్నారని ఫిబ్రవరి 27న రాంపూర్ కోర్టు ప్రకటించింది.
CrPC సెక్షన్ 82 కింద ఆమెపై చర్యలు తీసుకున్నారు. ఎస్పీ నేతృత్వంలో ఒక బృందాన్ని ఆమెను అదుపులోకి తీసుకోవడానికి ఏర్పాటు చేశారు. ఎట్టిపరిస్థితిలోనూ 6వ తేదీలోగా జయప్రద ను కోర్టు ముందు హాజరుపరచాలని రాంపూర్ పోలీసులను గట్టిగా ఆదేశించింది. ఈ క్రమంలో సోమవారం జయప్రద కోర్టులో లొంగిపోయారు.
Also Read : నా కేసుల వివరాలు తెలపండి.. డీజీపీ, సీఐడీ, ఏసీబీలకు చంద్రబాబు లేఖ
జయప్రద జీవితం ఇదీ..
జయప్రద 1976లో వచ్చిన భూమి పాద చిత్రంలో మూడు నిమిషాల నిడివి గల పాటతో సినీ రంగ ప్రవేశం చేశారు. ఆమె సినీ రంగ ప్రస్తానం మూడు దశాబ్దాల పాటు కొనసాగింది. 2005 వరకు ఆరు భాషల్లో ఆమె నటిస్తూ వచ్చారు. జయప్రద తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ - బెంగాలీ భాషలలో 300 కంటే ఎక్కువ చిత్రాలలో నటించారు. ఆమె జూన్ 22, 1986న సినీ నిర్మాత శ్రీకాంత్ నహతాను వివాహం చేసుకున్నారు. అక్టోబర్ 10, 1994న ఆమె తెలుగుదేశం పార్టీలో చేరి రాజకీయ రంగ ప్రవేశం చేయడం జరిగింది. ఏప్రిల్ 1996లో తెలుగుదేశం పార్టీ తరపున రాజ్యసభకు ఎన్నికయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో విభేదాల నేపథ్యంలో ఆమె టీడీపీని వీడి సమాజ్‌వాదీ పార్టీలో చేరారు . ఆమె 2004 సార్వత్రిక ఎన్నికల సమయంలో UPలోని రాంపూర్ పార్లమెంటరీ నియోజకవర్గం నుండి పోటీ చేసి 85000 కంటే ఎక్కువ ఓట్ల తేడాతో ఎన్నికయ్యారు. 2009లో ఆమె లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా , రాంపూర్‌లోని స్వర్ ప్రాంతంలో మహిళలకు బిందెలు పంపిణీ చేయడం ద్వారా ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు ఆమెకు ఎన్నికల సంఘం నోటీసు జారీ చేసింది. తరువాత ఆమె(Jaya Prada) సమాజ్ వాదీ పార్టీలో వచ్చిన చీలికల మధ్య అమర్ సింగ్ తో కలిసి వెళ్లారు. దీంతో ఆమెను పార్టీ నుంచి తొలగించారు. ఈ క్రమంలో అమర్ సింగ్ తో కలిసి జయప్రద సొంతంగా రాష్ట్రీయ లోక్ మంచ్‌ని స్థాపించారు. ఈ పార్టీ 2012లో మొత్తం అన్ని అసెంబ్లీ స్థానాల్లోనూ పోటీ చేసింది. కానీ, ఒక్కచోట కూడా గెలవలేదు. తరువాత 2019లో జయప్రద బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.