Jarkhand Politics: జార్ఖండ్‌ పాలిటిక్స్‌ @హోటల్‌ ఎల్లా.. హైదరాబాద్‌కు ఎమ్మెల్యేలు.. వీడని ఉత్కంఠ

జార్ఖండ్‌ రాజకీయాలకు హైదరాబాద్‌కు వేదికైంది. భాగ్యనగరంలోని హోటల్‌ ఎల్లాలో క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. ఇండియా కూటమి ఎమ్మెల్యేల్లో అందుబాటులో ఉన్న 35 మంది కాంగ్రెస్, జేఎంఎం ఎమ్మెల్యేలను హుటాహుటిన హైదరాబాద్ తరలించారు. మరోవైపు ఉత్కంఠ కొనసాగుతోంది.

New Update
Jarkhand Politics: జార్ఖండ్‌ పాలిటిక్స్‌ @హోటల్‌ ఎల్లా.. హైదరాబాద్‌కు ఎమ్మెల్యేలు.. వీడని ఉత్కంఠ

Jarkhand Politics: అనిశ్చితికి పెట్టింది పేరైన జార్ఖండ్‌ రాజకీయాలు ఇప్పుడు హైదరాబాద్‌కు చేరుకున్నాయి. భాగ్యనగరంలోని హోటల్‌ ఎల్లా వేదికగా ఆ రాష్ట్ర రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. సీఎంగా ఉన్న హేమంత్‌ సోరెన్‌ అరెస్టు నేపథ్యంలో జార్ఖండ్‌ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు, ట్విస్టుల మీద ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. అరెస్టుతో అప్రమత్తమైన కాంగ్రెస్ తన ఎమ్మెల్యేలను హైదరాబాద్ తరలించింది. ప్రత్యేక విమానంలో ఇండియా కూటమికి చెందిన 35 మంది ఎమ్మెల్యేలు బేగంపేట విమానాశ్రయానికి చేరుకోగా, అక్కడినుంచి గచ్చిబౌలిలోని హోటల్ ఎల్లాకు తరలించి అక్కడ వారికి వసతి కల్పించారు.

ఇది కూడా చదవండి: సీఎం తొలి బహిరంగ సభ అక్కడే.. పార్లమెంటు ఎన్నికలకు రేవంత్‌ శంఖారావం

జార్ఖండ్‌ రాజకీయ సంక్షోభం నేపథ్యంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సీఎం పదవికి హేమంత్ సొరెన్ రాజీనామా చేయగా.. శాసనసభాపక్షనేతగా జేఎంఎం సీనియర్‌ నేత, రవాణా మంత్రి చంపయ్‌ సోరెన్‌ను వారు ప్రకటించారు. ఇది జరిగి గంటలు గడుస్తున్నా గవర్నర్‌ వారిని ప్రభుత్వ ఏర్పాటుకు ఇంకా ఆహ్వానించలేదు. దీంతో అలర్ట్‌ అయిన కాంగ్రెస్‌ హై కమాండ్ ఎమ్మెల్యేలు చేజారకుండా ఉండేందుకు క్యాంపు రాజకీయాలు మొదలుపెట్టింది. ఇండియా కూటమి ఎమ్మెల్యేల్లో అందుబాటులో ఉన్న 35 మంది కాంగ్రెస్, జేఎంఎం ఎమ్మెల్యేలను హైదరాబాద్ తరలించారు. జార్ఖండ్‌ అసెంబ్లీలో మొత్తం 81 స్థానాలుండగా, ప్రభుత్వం ఏర్పాటు కోసం 41 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం.

ఇదిలా ఉంటే, చంపయ్‌ సోరెన్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశమే లేదని బీజేపీ ఘంటాపథంగా చెప్తోంది. తగినంత మద్ధతు లేకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం లేదని వాదిస్తోంది. మరోవైపు, జేఎంఎం మిత్రపక్షం ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ బీజేపీపై విమర్శలు కురిపించారు. ఓ గిరిజన ముఖ్యమంత్రిని ఈడీని అడ్డుపెట్టుకుని బీజేపీ వేధిస్తోందన్నారు. తమ మద్దతు హేమంత్‌కే అని స్పష్టంచేశారు. ఇదిలా కొనసాగుతుండగా; హేమంత్‌ సోరెన్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు