Kandula Durgesh Vs TDP Burugupalli Sesha Rao: తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో టీడీపీ జనసేన రాజకీయాలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి. పొత్తులో భాగంగా నిడదవోలు టికెట్ ను జనసేన కందుల దుర్గేష్ కు కేటాయించిన సంగతి తెలిసిందే. జనసేనకు సీటు కేటాయించడంతో నిడదవోలు టీడీపీ ఇంచార్జి బూరుగుపల్లి శేషారావు వర్గం అసహనం వ్యక్తం చేస్తున్నారు. నిన్న నిడదవోలులో కందుల దుర్గేష్ భారీ ర్యాలీతో ఎంట్రీ ఇచ్చారు. అయితే, కందుల రాకను నిడదవోలు టీడీపీ కేడర్ వ్యతిరేకించారు. దుర్గేష్ ర్యాలీకి ఏ మాత్రం సహకరించలేదు. దీంతో సొంత వర్గంతోనే కందుల ర్యాలీ చేశారు.
Also Read: ముందు మీది మీరు చూసుకోండి.. విదేశీయులకు ఇచ్చిపడేసిన ఇండియా!
అనంతరం టీడీపీ ఇంచార్జి బూరుగుపల్లి శేషారావు ఇంటికెళ్లారు కందుల దుర్గేష్. కానీ, శేషారావు ఇంట్లో లేరని చెప్పడంతో కందుల నిరాశగా వెనుతిరిగారు. నిడదవోలు టికెట్ పై శేషారావు ముందు నుంచి ధీమాగా ఉన్నారు. ఆఖరి నిమిషంలో నిడదవోలు టికెట్ జనసేనకు మార్చడంతో ఆయన సహించలేనట్లుగా తెలుస్తోంది. టికెట్ రాకపోవడంతో శేషారావు అయోమయంలో పడ్డారు. సీటు ప్రకటించిన తరువాత కూడా అధిష్టానం నుంచి పిలుపు రాలేదని అలకబూనారని వార్తలు వినిపిస్తున్నాయి.
రానున్న ఎన్నికల్లో కలిసి పోరాడాల్సింది ఉండగా.. నిడదవోలులో మాత్రం టీడీపీ వర్సెస్ జనసేన అన్నట్టుగా ఉంది. తాజాగా జరుగుతున్న రాజకీయాలపై నియోజకవర్గంలో తీవ్రస్థాయిలో చర్చ నడుస్తోంది. అధిష్టానం శేషారావు కు నచ్చజెప్పి ముందుకు నడిపిస్తుందా లేదంటే చూసిచూడనట్లుగా ఉంటుందా అనేది తెలియాలి..ఒకవేళ హైకమాండ్ ఏ మాత్రం స్పంధించలేదంటే శేషారావు పార్టీ మారినా ఆశ్చర్యపోనవసరం లేదు.