TDP-JSP: కాకినాడ జిల్లా జగ్గంపేటలో జనసేన టిడిపి ఆత్మీయ సమావేశం రసభాసగా జరిగింది. జనసేన - టిడిపి నాయకులు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ప్రశాంతంగా జరగాల్సిన ఆత్మీయ సమావేశం ఆందోళనతోనే ముగిసింది. అసలేం జరిగిందంటే..రెండు రోజుల క్రితం గోకవరంలో జనసేన టిడిపి వర్గాల మధ్య గొడవ జరిగింది. ఆ గొడవలో జనసేన కార్యకర్తకు కాలు విరిగింది. దీంతో జనసేన కార్యకర్తకు క్షమాపణ చెప్పాలంటూ ఆందోళనకు దిగారు జనసేన నియోజకవర్గ ఇంచార్జ్ సూర్యచంద్ర. దీంతో, టిడిపి జనసేన నాయకుల మధ్య తోపులాట జరిగింది. ఇరు పార్టీ నేతల అరుపులతో ఆత్మీయ సమావేశం కాస్తా హై టెన్షన్ గా మారింది.
Also Read: వారికి న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు..తేల్చి చెప్పిన నిమ్మల రామానాయుడు.!
గొడవకు సంబంధించిన వాళ్ళు ఒకే కుటుంబానికి చెందిన వారని..వాళ్ళని కూర్చోబెట్టి తర్వాత మాట్లాడదాం అని టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ ఎంత సర్ధి చెప్పిన ఆయన మాటను ఏ మాత్రం లెక్కచేయలేదు. టిడిపి నాయకులతో వాగ్వాదానికి దిగాడు ఇంచార్జ్ పాఠం శెట్టి సూర్యచంద్ర. క్షమాపణ చెప్పి తీరాల్సిందేనని పట్టుబట్టాడు. సమావేశాన్ని బహిష్కరించి బయటకు వెళ్లి జనసైనికులతో ఆందోళన చేపట్టారు.
This browser does not support the video element.
జరిగిన ఘటనపై నెహ్రూ మాట్లాడుతూ..నేను నా రాజకీయ జీవితంలో చాలా మీటింగ్లు పెట్టాను..కానీ, ఈ రోజు జరిగినట్టుగా ఎప్పుడూ ఏ మీటింగ్ జరగలేదని అన్నారు. రెండు కుటుంబాల మధ్య గొడవని కావాలనే రాజకీయం చేశారన్నారు. వచ్చే ఎన్నికల్లో జగ్గంపేట టిక్కెట్ జనసేన, టీడీపీ నుంచి ఎవరికి ఇచ్చిన నా బుజస్కందాల మీద మోసుకుని నెగ్గించుకుంటానని గతంలోనే చెప్పానని ..అయితే, ఇప్పుడు జనసేన ఇన్చార్జ్ పాఠంశెట్టి సూర్యచంద్రకు టిక్కెట్ ఇస్తే తను సపోర్ట్ చేయనని తేల్చి చెప్పారు. జనసేన నుండి సామాన్య కార్యకర్తకు సీటు ఇచ్చిన నా సంపూర్ణ మద్దతు ఉంటుంది.. ఇది నా ప్రతిజ్ఞ అని ఖరకండిగా చెప్పేశారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు మద్దతు నాకు ఉంది.. జగ్గంపేటలో కచ్చితంగా నేనే పోటీ చేస్తానని నెహ్రూ అన్నారు.
Also Read: అందుకే.. జగన్ వై నాట్ 175 అని అంటున్నారు: బోండా ఉమా
కాగా, జ్యోతుల నెహ్రూ వ్యాఖ్యలను వక్రీకరించారు సూర్యచంద్ర. జనసేనకు మద్దతు తెలుపను అని నెహ్రూ అన్నారంటూ.. టీడీపీ - జనసేన పార్టీల మధ్య విభేదాలు సృష్టించేలా వ్యాఖ్యలు చేస్తున్నారని కామెంట్స్ చేశారు.
ఇదిలా ఉండగా.. మరోవైపు ఎన్టీఆర్ జిల్లా నందిగామలో టీడీపీ- జనసేన మొదటి సమావేశం లో స్వల్ప రసాభాస జరిగింది. తమకు సరైన గౌరవం ఇవ్వడం లేదని అసహనం వ్యక్తం చేశారు జనసేన కృష్ణా జిల్లా ఉపాధ్యక్షుడు బోల్దిశెట్టి శ్రీకాంత్. మొదటి సమావేశం లోనే తమకు టీడీపీ నాయకులు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని స్టేజి పైకి వెళ్ళేందుకు నిరాకరించారు. అయితే, టీడీపీ నేతల బుజ్జగింపుతో మళ్లీ స్టేజి పైకి వెళ్ళారు. అనంతరం టీడీపీ జనసేన సమన్వయ కమిటీ సమావేశం సాఫీగా కొనసాగింది. ఇలా పలుచోట్ల ఘర్షణ వాతవరణంతో టీడీపీ- జనసేన ఆత్మీయ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇది చూసిన పార్టీ పెద్దలు చిన్న చిన్న విషయాలకే గొడవలు పడుతుండడంతో ఆందోళన చెందుతున్నారు..