/rtv/media/media_files/2026/01/17/machado-trump-2026-01-17-09-16-13.jpg)
Machado - Trump
Machado - Trump: వెనిజువెలా(Venezuelan) ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరినా మచాడో చేసిన ఒక చర్య ఇప్పుడు అంతర్జాతీయంగా పెద్ద చర్చకు దారి తీసింది. ఆమె తనకు లభించిన నోబెల్ శాంతి బహుమతి పతకాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు అందించడం తీవ్ర విమర్శలకు కారణమైంది. ఈ ఘటనపై నార్వేలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇటీవల వైట్ హౌస్‌లో ట్రంప్‌ను కలిసిన మచాడో, తన నోబెల్ పతకాన్ని ఆయన చేతుల్లో పెట్టారు. వెనిజువెలా స్వేచ్ఛ కోసం ట్రంప్ చేసిన కృషికి గుర్తుగా ఈ గౌరవాన్ని అందిస్తున్నానని ఆమె తెలిపారు. తర్వాత ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, “ట్రంప్ దీనికి అర్హుడు. ఆ క్షణం చాలా భావోద్వేగంగా అనిపించింది” అని మచాడో చెప్పారు.
Machado Presents Nobel Peace Prize Medal to Trump
President Donald J. Trump meets with María Corina Machado of Venezuela in the Oval Office, during which she presented the President with her Nobel Peace Prize in recognition and honor.🕊️ pic.twitter.com/v7pYHjVNVO
— The White House (@WhiteHouse) January 16, 2026
ట్రంప్ కూడా ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ప్రస్తావించారు. మచాడో తన నోబెల్ పతకాన్ని తన వద్ద ఉంచాలని కోరిందని, ఇది పరస్పర గౌరవానికి గుర్తు అని వ్యాఖ్యానించారు. వైట్ హౌస్‌లో ఇద్దరూ కలిసి నోబెల్ పతకంతో ఫొటోలకు కూడా పోజ్ ఇచ్చారు.
అయితే ఈ ఘటనపై నోబెల్ కమిటీ వెంటనే స్పష్టత ఇచ్చింది. ఒకసారి నోబెల్ శాంతి బహుమతి ఎవరికైనా ఇచ్చిన తర్వాత, దాన్ని మరో వ్యక్తికి బదిలీ చేయడం, పంచడం లేదా మార్చడం సాధ్యం కాదని తెలిపింది. ఇది నోబెల్ ఫౌండేషన్ నిబంధనలలో స్పష్టంగా ఉందని పేర్కొంది. పతకం భౌతికంగా ఎవరి దగ్గర ఉన్నా, నోబెల్ విజేత హోదా మాత్రం ఎప్పటికీ అవార్డు పొందిన వ్యక్తికే చెందుతుందని వివరించింది. అందువల్ల మచాడోనే అధికారిక నోబెల్ శాంతి బహుమతి విజేత, ట్రంప్ కాదని స్పష్టం చేసింది.
మచాడోకు 2025 నోబెల్ శాంతి బహుమతి వెనిజువెలా ప్రజల ప్రజాస్వామ్య హక్కుల కోసం చేసిన పోరాటానికి గాను లభించింది. నియంత పాలన నుంచి దేశాన్ని ప్రజాస్వామ్య దిశగా నడిపించేందుకు ఆమె చేసిన కృషిని నోబెల్ కమిటీ గుర్తించింది. అవార్డు ప్రకటించిన సమయంలో ఆమె ఈ గౌరవాన్ని వెనిజువెలా ప్రజలకు, ట్రంప్‌కు అంకితం చేశారు.
ఈ ఘటనపై నార్వేలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. నార్వే పార్లమెంట్ సభ్యుడు ట్రిగ్వే వెడుమ్, ఇతరుల కష్టంతో వచ్చిన గౌరవాలను ట్రంప్ తనదిగా చూపించుకుంటున్నారని వ్యాఖ్యానించారు. మరో మాజీ మంత్రి జానే మాట్లారీ, ఇది నోబెల్ బహుమతికి అవమానమని, ఇలాంటి ఘటన ఎప్పుడూ జరగలేదని అన్నారు. నోబెల్ శాంతి బహుమతికి ఇది చాలా చెడ్డ పరిణామమని పలువురు అభిప్రాయపడ్డారు.
సోషల్ మీడియాలో కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. “ఇతరుల నోబెల్‌ను తీసుకోవడానికి ట్రంప్‌కు అసలు సిగ్గు లేదా?” అని పలువురు ప్రశ్నించారు. మరికొందరు “నోబెల్ బహుమతిని ఇలాగే ఇచ్చేస్తే, అది బహుమతి కాదు జోక్ అవుతుంది” అంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. అయితే కొందరు మచాడోను సమర్థిస్తూ, ఇది ఆమె మంచితనాన్ని చూపిస్తుందని అన్నారు.
ఈ పరిణామాల మధ్య వెనిజువెలా భవిష్యత్ మరింత అనిశ్చితంగా మారింది. ట్రంప్ ఇప్పటికే మచాడోకు దేశంలో సరైన మద్దతు లేదని వ్యాఖ్యానించారు. ఆమె స్థానంలో వెనిజువెలా తాత్కాలిక అధ్యక్షురాలిగా ఉన్న డెల్సీ రోడ్రిగెజ్ కు ట్రంప్ మద్దతు ఇస్తున్నట్టు తెలుస్తోంది. అమెరికా-వెనిజువేలా మధ్య చమురు, వాణిజ్యం, భద్రత అంశాలపై చర్చలు కొనసాగుతున్నాయి.
మచాడో నోబెల్ పతకాన్ని ట్రంప్‌కు ఇచ్చినప్పటికీ. చట్టపరంగా, చారిత్రకంగా నోబెల్ శాంతి బహుమతి మాత్రం ఆమెకే చెందుతుంది. మొత్తానికి ఈ ఘటన నోబెల్ బహుమతి విలువ, రాజకీయాల ప్రభావం గురించి ప్రపంచవ్యాప్తంగా కొత్త చర్చను తెరపైకి తెచ్చింది.
Follow Us