El Mencho : మెక్సికో డ్రగ్ మాఫియా డాన్ ఎల్ మెంచో మృతి

ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన డ్రగ్స్ స్మగ్లర్, మెక్సికో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఎల్ మెంచో సైనిక ఆపరేషన్‌లో మరణించాడు. గత దశాబ్ద కాలంగా మెక్సికోను వణికించిన జాలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్ (CJNG) బాస్ మరణంతో ఆ దేశం అల్లకల్లోలంగా మారింది.

New Update
el mencho

ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన డ్రగ్స్ స్మగ్లర్, మెక్సికో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఎల్ మెంచో సైనిక ఆపరేషన్‌లో మరణించాడు. గత దశాబ్ద కాలంగా మెక్సికోను వణికించిన జాలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్ (CJNG) బాస్ మరణంతో ఆ దేశం అల్లకల్లోలంగా మారింది. అతని మరణ వార్త తెలిసిన వెంటనే గ్యాంగ్‌స్టర్లు రోడ్లపైకి వచ్చి వాహనాలను తగులబెట్టడం, హైవేలను దిగ్బంధించడంతో మెక్సికోలోని సగానికి పైగా రాష్ట్రాలు హింసతో అట్టుడుకుతున్నాయి.

పశ్చిమ మెక్సికోలోని జాలిస్కో రాష్ట్రంలో జరిగిన ఒక భారీ సైనిక దాడిలో ఎల్ మెంచో తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స కోసం అతడిని మెక్సికో సిటీకి విమానంలో తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయినట్లు మెక్సికో రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అమెరికాకు భారీగా కొకైన్, ఫెంటానిల్ వంటి ప్రాణాంతక డ్రగ్స్ సరఫరా చేస్తున్న ప్రధాన ముఠాకు ఇతనే నాయకుడు. ఇతడి ఆచూకీ తెలిపిన వారికి అమెరికా గతంలోనే 15 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 125 కోట్లు) భారీ రివార్డును కూడా ప్రకటించింది.

ఎల్ మెంచో మరణించాడనే వార్తతో అతని అనుచరులు రెచ్చిపోయారు. జాలిస్కో, గ్వాడలజారా వంటి నగరాల్లో కార్లను తగులబెట్టి రోడ్లకు అడ్డంగా వేశారు. పర్యాటక ప్రాంతమైన ప్యూర్టో వల్లార్టాలో ఆకాశమంతా నల్లటి పొగ అలుముకోగా, ఎయిర్‌పోర్టుల్లో జనం ప్రాణభయంతో పరుగులు తీస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు ప్రజలెవరూ బయటకు రావొద్దని జాలిస్కో గవర్నర్ పాబ్లో లెమస్ నవారో హెచ్చరించారు.

మరోవైపు అమెరికా ప్రభుత్వం ఎల్ మెంచో మరణాన్ని ఒక గొప్ప పరిణామంగా అభివర్ణించింది. డ్రగ్ మాఫియాపై ఉక్కుపాదం మోపాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడి చేస్తున్న తరుణంలో ఈ ఆపరేషన్ సక్సెస్ కావడం గమనార్హం. ప్రస్తుతం మెక్సికోలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా, అమెరికా, కెనడా దేశాలు తమ పౌరులను అప్రమత్తం చేశాయి. జాలిస్కోతో పాటు పలు రాష్ట్రాల్లో ఉన్న పౌరులు సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని ట్రావెల్ అడ్వైజరీ జారీ చేశాయి.

ఎల్ మెంచో మెక్సికోలో అత్యంత శక్తివంతమైన నేరగాళ్ల ముఠా అయిన జాలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్ (CJNG) కు నాయకత్వం వహించాడు. ఇతని నాయకత్వంలో ఈ కార్టెల్ ఒక ప్రాంతీయ ముఠా స్థాయి నుండి అంతర్జాతీయ డ్రగ్ స్మగ్లింగ్ నెట్‌వర్క్‌గా ఎదిగింది. భారీ ఆయుధాలు, మిలిటరీ తరహా కాన్వాయ్‌లు, ప్రత్యర్థులను భయపెట్టడానికి అత్యంత క్రూరమైన హింసాకాండను ప్రదర్శించడం ఇతని ప్రత్యేకత.

లో ప్రొఫైల్ మెయింటెయిన్ చేస్తూ

ఇతర డ్రగ్ మాఫియా డాన్లలాగా ఎల్ మెంచో ఆడంబరంగా కనిపించడానికి ఇష్టపడేవాడు కాదు. ఎప్పుడూ లో ప్రొఫైల్ మెయింటెయిన్ చేస్తూ, పోలీసులకు చిక్కకుండా అడవుల్లో, పర్వత ప్రాంతాల్లో తలదాచుకునేవాడు. తనకున్న అనారోగ్య సమస్యల చికిత్స కోసం ఏకంగా ఒక అడవి ప్రాంతంలో తన కోసమే ప్రత్యేకంగా ఒక ప్రైవేట్ ఆస్పత్రిని కట్టించుకున్నాడు.

Advertisment
తాజా కథనాలు