ఇంటర్నేషనల్ బ్లైండ్ స్పోర్ట్స్ ఫెడరేషన్(IBSA)వరల్డ్ గేమ్స్‌లో భారత్ అమ్మాయిలు చరిత్ర సృష్టించారు. తొలి ఎడిషన్‌లోనే స్వర్ణం గెలిచి రికార్డు నెలకొల్పారు. ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించారు. కేవలం 3.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించిన మన అమ్మాయిలు సరికొత్త చరిత్రకు నాంది పలికారు. అయితే టీ20 ఫార్మాట్‌లో జరిగిన ఈ టోర్నీలో మన అమ్మాయిలు ఒక మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్ చేరడం విశేషం.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 114 పరుగులకే పరిమితమైంది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఆసీస్ జట్టు పరుగులు చేయడానికి చెమటోడ్చింది. దీంతో పవర్‌ప్లేలో కేవలం 29 పరుగులే చేసింది. 39 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియాను లూయిస్, వెబెక్ ఆదుకున్నారు. అనంతరం భారత్ బౌలర్లు పుంజుకోవడంతో 16 పరుగుల వ్యవధిలోనే కంగారులు 5 వికెట్లు కోల్పోయింది. అయితే వరుణుడు ఆటంకం కలిగించడంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో 42 పరుగుల లక్ష్యాన్ని ఇండియాకు టార్గెట్‌గా నిర్ణయించగా.. కేవలం 3.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించారు.
ఇక మరోసారి భారత్-పాక్ క్రికెట్ జట్ల మధ్య తుది పోరు జరగనుంది. దాయాది దేశాల మధ్య ఆదివారం జరిగే ఈ మ్యాచ్ కోసం అందరు ఎదురు చూస్తున్నారు. అదేంటి? ఆసియా కప్ టోర్నీకి ఇంకా టైం ఉంది కదా.. ఇప్పుడు ఇరు జట్ల మధ్య మ్యాచ్ ఏంటి అనుకుంటున్నారా? అయితే ఈ మ్యాచ్ జరిగేది పురుషుల అంధుల క్రికెట్ జట్ల మధ్య. IBSA వరల్డ్ గేమ్స్‌లోపురుషుల అంధుల క్రికెట్‌లోనూ భారత్ జట్టు ఫైనల్ చేరింది. దీంతో చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్థాన్ మధ్య తుది పోరు జరగనుంది.