ఖైరతాబాద్ 63 అడుగుల మహాగణపతి నిమజ్జనం ప్రశాంతంగా పూర్తయింది. హుస్సేన్ సాగర్ క్రేన్ నంబర్.4 వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం నిమజ్జనం నిర్వహించారు. మహాగణపతి నిమజ్జనాన్ని స్వయంగా తిలకించడం కోసం ట్యాంక్ బండ్ వద్దకు భారీగా భక్తులు తరలివచ్చారు. డ్యాన్స్, కేరింతలతో ఖైరతాబాద్ గణేశుడికి ఘనంగా వీడ్కోలు పలికారు. భక్తుల బై బై గణేశా నినాదాలతో ట్యాంక్ బండ్ ప్రాంతం మర్మోగింది. మధ్యాహ్నం 1 గంట లోగా మహాగణపతి నిమజ్జనం పూర్తి చేస్తామని ముందుగా ప్రకటించిన అధికారులు.. ఆ మేరకు విజయవంతంగా పూర్తి చేశారు. అనుకున్న విధంగా.. మహాగణేశుడి నిమజ్జనం ప్రశాంతంగా ముగియడంతో పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. దీంతో ఇతర విగ్రహాల నిమజ్జనంపై వారు దృష్టి సారించారు.
హైదరాబాద్ మహానగరంలో గణేశ్ విగ్రహాల నిమజ్జనం సాగుతున్న తీరును నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అధికారులకు సూచనలు ఇస్తున్నారు. గణేశ్ నిమజ్జనం ప్రశాంతంగా సాగుతోందని ఆయన ప్రకటించారు. రేపు ఉదయం వరకు కూడా నిమజ్జనం కొనసాగుతుందని తెలిపారు. 20 వేలకు పైగా సీసీ కెమెరాలతో కమాండ్ కంట్రోల్ నుంచి నిమజ్జనాన్ని పరిశీలిస్తున్నారు ఉన్నతాధికారులు. బందోబస్తు కోసం 40 వేల మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. బాలాపూర్ గణేశ్ శోభాయాత్ర హైదరాబాద్ నగరంలోకి ప్రవేశించింది. భారీగా తరలివచ్చిన భక్తజన సందోహం కేరింతల నడుమ బాలాపూర్ గణేశ్ శోభాయాత్ర వైభవంగా సాగుతోంది.