కేంద్ర ప్రభుత్వం 2017లో జీఎస్టీ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. పన్ను ఎగవేతలను అరికట్టేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే నేటికీ చాలా చోట్ల జీఎస్టీ ఎగవేత, నకిలీ బిల్లుల ఉదంతాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. జీఎస్టీ మోసాల్లో ఎక్కువ భాగం ఫేక్ ఇన్వాయిస్ల ద్వారానే జరుగుతున్నాయి. కనుక వినియోగదారులు ఈ నకిలీ జీఎస్టీ బిల్లుల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. అందుకే ఇప్పుడు ఫేక్ జీఎస్టీ బిల్లులను ఎలా గుర్తించాలో తెలుసుకుందాం.
మొదట జీఎస్టీ ఇన్‌వాయిస్ అంటే ఏమిటో తెలుసుకోవడం ముఖ్యం. జీఎస్టీ ఇన్‌వాయిస్ అనేది ఒక రకమైన బిల్లు. ఉదాహరణకు, మీరు వస్తువులను కొనుగోలు చేసినా లేదా సేవలను పొందినా, సదరు ప్రొడక్ట్స్ లేదా సర్వీసెస్ అందించిన వ్యక్తికి లేదా సంస్థకు బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. సదరు బిల్లులో సరఫరాదారు పేరు, ఉత్పత్తి సమాచారం, కొనుగోలు తేదీ, డిస్కౌంట్, ప్రభుత్వానికి కట్టాల్సిన పన్ను వివరాలు ఉంటాయి.అయితే జీఎస్టీ పేరుతో వినియోగదారులకు నకిలీ బిల్లులు ఇస్తున్న ఉదంతాలు అనేకం వెలుగులోకి వస్తున్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, కొంతమంది వ్యాపారులు తమ బిల్లులపై GSTIN అంటే GST గుర్తింపు సంఖ్యకు బదులుగా VAT/TIN, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ నంబర్‌లను చూపిస్తున్నారు. మరికొందరు ప్రభుత్వానికి ఎలాంటి ట్యాక్స్ కట్టకుండానే, ఫేక్ జీఎస్టీ బిల్లులు చూపించి వినియోగదారుల నుంచి అక్రమ పద్ధతిలో డబ్బులు వసూలు చేస్తున్నారు.
నకిలీ జీఎస్టీని గుర్తించడం ఎలా? వస్తు, సేవలు అందించే వ్యక్తులకు లేదా సంస్థలకు ప్రత్యేకమైన 15 అంకెల GSTINను కేటాయిస్తారు. ఇందులో మొదటి రెండు అంకెలు రాష్ట్ర కోడ్, తర్వాత 10 అంకెలు విక్రేత లేదా సరఫదారుని పాన్ నంబర్ (PAN) ప్రత్యేక రిజిస్ట్రేషన్ నంబర్ ఉంటాయి. 13వ అంకె పాన్ హోల్డర్ యూనిట్ నంబర్, 14వ అంకె జెడ్ అక్షరంతో, చివరిగా 'చెక్‌సమ్ అంకె' ఉంటుంది. కనుక మీకు సప్లయిర్ బిల్లు ఇచ్చిన వెంటనే, అందులోని GSTIN (వస్తు, సేవల పన్ను గుర్తింపు సంఖ్య)ని చెక్ చేయాలి. జీఎస్టీ పోర్టల్‌లో దానిని ఎంటర్ చేయాలి. ఒక వేళ సదరు GSTIN సరైనదే అయితే, జీఎస్టీ పోర్టల్‌లో పన్ను చెల్లింపుదారు రకం, రిజిస్ట్రేషన్ తేదీ, రిజిస్ట్రేషన్ స్థానం (రాష్ట్రం), చట్టపరమైన పేరు, వ్యాపారం, వాణిజ్యం పేరు, UIN లేదా GSTIN స్టేటస్ కనిపిస్తాయి. మీకు ఇచ్చిన బిల్లులోని ఇన్‌వాయిస్ నంబర్, తేదీలను కూడా చెక్ చేయాలి. ఈ ఇన్‌వాయిస్ నంబర్ యూనిక్‌గా, వరుస క్రమంలో ఉండాలి. మరీ ముఖ్యంగా మీరు వస్తు, సేవలు కొన్న నిర్ణీత సమయం (టైమ్) కూడా దానిలో నమోదై ఉండాలి.