'ది లెజెండ్ రిటర్న్స్'..
హీరో బైక్స్ అంటే దేశంలో ఎక్కువ మందికి ఎంతో ఇష్టం. బడ్జెట్‌తో పాటు కంఫర్ట్, మైలేజ్ ఎక్కువగా ఉండటంతో ఈ బైక్స్‌కు ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు. ఇక స్పోర్ట్స్ బైక్స్ కేటగిరిలో కరిజ్మా బైక్‌కు ఉండే క్రేజే వేరే లెవల్. 20ఏళ్ల క్రితం కరిజ్మా బైక్ మీద వెళ్తుంటే ఓ రేంజ్ ఉండేది. హీరో కరిజ్మా ఆర్, హీరో కరిజ్మా జెడ్‌ఎంఆర్ పేరుతో వచ్చిన మోడళ్లు యూత్ నుంచి విపరీతమైన క్రేజ్‌ను దక్కించుకున్నాయి. ఈ బైక్స్ వేసుకుని రోడ్ల మీద తిరుగుతుంటే హీరోలా చూసేవారు. అంతలా అభిమానులను ఆకట్టుకుంది ఈ మోడల్. అయితే కొంతకాల క్రితం ఈ బైక్ మోడల్ ఆగిపోవడంతో నిరాశలో ఉన్న అభిమానులకు సూపర్ న్యూస్ అందించింది హీరో కంపెనీ. ఆగస్ట్ 29న కరిజ్మా 210 XMR పేరుతో రీలాంఛ్ చేయనుంది. ఈ మేరకు అధికారికంగా ట్వీట్ చేసింది. 'ది లెజెండ్ రిటర్న్స్'గా రోజుకొక టీజర్ విడుదల చేస్తుంది.
బ్రాండ్ అంబాసిడర్‌గా హృతిక్..
ఇందులో సిక్స్ స్పీడ్ గేర్‌బాక్స్ ఏర్పాటు చేశారు. గరిష్ఠంగా 143 కిలోమీటర్ల వేగంతో.. సిగ్నేచర్ సిల్హౌట్, డ్యుయల్ ఏబీఎస్, డిస్క్ బ్రేక్స్, బ్లూటూత్ కనెక్టివిటీ ఆప్షన్లు ఈ బైక్‌లో ఇచ్చారు. ఈ బైక్ 210 సీసీ లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌తో పని చేస్తుంది. అంతేకాకుండా 25 బీహెచ్‌సీ, 30 ఎన్‌ఎం గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే బైక్ ముందు టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుకవైపు మోనోషాక్‌తో పాటు డ్యూయల్-ఛానల్ ఏబీఎస్‌తో పనిచేస్తుంది. కరిజ్మా 210 XMR ధర సుమారు రూ. 1.8 లక్షల ధర ఉంటుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అయితే ఈనెల 29న అధికారికంగా దీని ధర వెల్లడించనుంది హీరో కంపెనీ. ఈ బైక్ ప్రమోషన్ కోసం బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంది. గతంలోనూ కరిజ్మాకు బ్రాండ్ అంబాసిడర్‌గా హృతిక్ వ్యవహరించిన సంగతి తెలిసిందే.
నిలిచిపోయిన ప్యాషన్ ప్రో బైక్ ఉత్పత్తి..
మరోవైపు మధ్యతరగతి ప్రజలు ఇష్టపడే ప్యాషన్ ప్రో బైక్ ఉత్పత్తిని ఇటీవల హీరో కంపెనీ నిలిపివేసింది. అయితే తాత్కాలికంగా? లేదా శాశ్వతంగా? అందుబాటులో ఉండదనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు. దీని స్థానంలో ప్యాషన్ ఎక్స్ టెక్, ప్యాషన్ ప్లస్ బైక్స్ కొనుగోలుదారులకు అందుబాటులోనే ఉన్నాయి.