GOVT School Building wall collapsed: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లా బనగానపల్లె మండల హుసేనాపురం గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది. బుధవారం మధ్యాహ్నం తరగతి గోడ ఒకటి కూలిపోయింది. అయితే ఆ సమయంలో భోజన విరామ సమయం కావడంతో విద్యార్థులు అందరూ బయటకు వెళ్లారు. అప్పుడు అక్కడ విద్యార్థులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పెద్ద శబ్దంతో తరగతి గది గోడ కూలింది. పెద్ద పెద్ద బండరాళ్లు విద్యార్థులు ఉంచిన బ్యాగులపై పడ్డాయి.
ప్రాథమిక పాఠశాలలో మొత్తం 38 మంది పిల్లలున్నారు. పాఠశాల భవనం మరమ్మత్తు చేసేందుకు నాడు నేడు కింద రూ.12.5 లక్షలు మంజూరయ్యాయి. అయినప్పటికీ పనులు మాత్రం జరగడం లేదు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. గోడ కూలిన సమయంలో అక్కడ పిల్లలు ఎవరూ లేరు కాబట్టి ప్రాణం నష్టం జరగలేదని.. లేదంటే పరిస్థితి ఎలా ఉండేదో తలుచుకుంటే భయంగా ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై గ్రామ సర్పంచ్ వరలక్ష్మి, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు.. పైఅధికారులకు ఫిర్యాదు చేశారు.
ఆ స్కూల్ పరిస్థితి చూస్తుంటే గోడలు పాచిపట్టి రంగు వెలిసిపోయి పురాతన భవనం తలపించేలా ఉన్నాయి. వానకు నానిపోయి కూలడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆ గోడల మధ్యలోనే ఎందరో పిల్లలు చదువుకుంటున్నారు. ప్రభుత్వ పాఠశాల కావడంతో ఉపాధ్యాయులు కూడా విద్యార్ధులకు అక్కడే పాఠాలు చెబుతున్నారు. గోడ కూలిన సమయంలో పిల్లలు ఉండి ఉంటే.. ఆ దృశ్యం తలచుకుంటేనే వెన్నులో వణుకుపుట్టేలా ఉంది.