Anantapuram: పాత పింఛను విధానాన్ని పునరుద్ధరిస్తామన్న హామీని జగన్ ప్రభుత్వం నిలబెట్టుకోలేకపోయిందంటూ ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు బలవన్మరణానికి ప్రయత్నించారు. ఉపాధ్యాయులపై ప్రభుత్వం అనుచితంగా వ్యవహరిస్తోందంటూ ఐదు పేజీల లేఖను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఆయన ఆత్మహత్యకు యత్నించారు.
ఇది కూడా చదవండి: దారుణం.. కూతురుతో కలిసి దంపతుల ఆత్మహత్య.. కారణం ఇదే..
అనంతరంపురం జిల్లా ఉరవకొండ మండలం చిన్నముష్టూరు గ్రామానికి చెందిన బోయ మల్లేశ్ విడపనకల్లు మండలం పాల్తూరు ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. సీపీఎస్ సమస్యతో పాటు ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఆయన తన లేఖలో పేర్కొన్నారు. జీతాలు కూడా ఆలస్యమవుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. పీఆర్సీ, డీఏలు కూడా ఇవ్వకపోవడం బాధించిందన్న ఆయన అనంతపురం పెన్నఅహోబిలం వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. గమనించిన స్థానికులు, బంధువులు హుటాహుటిన హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం మల్లేశ్‌కు వైద్యం అందిస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉందని, ఒక రోజు గడిస్తే గానీ ఆయన ఆరోగ్య పరిస్థితిని కచ్చితంగా చెప్పలేమని వైద్యులు తెలిపారు. అయితే మల్లేశ్ రాసిన లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన హామీలను వెంటనే నిలబెట్టుకోవాలన్న డిమాండ్లు విస్తృతంగా వ్యక్తమవుతున్నాయి.
ఇది కూడా చదవండి: డబ్బులే.. డబ్బులు.. ఆ ఎంపీ ఇంట్లో దొరికిన సొమ్ము తెలిస్తే అవాక్కవుతారు!
చాలా రోజులుగా ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఉద్యోగులు పాత పింఛను విధానాన్ని తిరిగి అవలంభించాలని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఎన్నికల సంద్భంలో కూడా సీఎం జగన్ ఈ అంశంపై ఉద్యోగులకు హామీ ఇచ్చారు. ప్రభుత్వం తమపై నిర్లక్ష్య వైఖరి అనుసరిస్తోందంటూ మల్లేశ్ బలవన్మరణానికి యత్నించిన ఘటన ఉపాధ్యాయ వర్గాల్లో ఆవేదనకు కారణమైంది.