హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం, శోభాయాత్ర సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ (TSRTC) అధికారులు కీలక ప్రకటన చేశారు. జిల్లాల నుంచి ట్యాంక్ బండ్ మీదుగా ఎంజీబీఎస్ వచ్చే బస్సులను దారి మళ్లిస్తున్నట్లు తెలిపారు. కరీంనగర్ వైపు నుంచి వచ్చే బస్సులను JBS, YMCA, సంగీత్ క్రాస్ రోడ్స్, తార్నాక, జామై ఉస్మానియా, నింబోలి అడ్డా, చాదర్ ఘట్ మీదుగా MGBSకు దారి మళ్లిస్తున్నట్లు ప్రకటించారు. బెంగళూర్ వైపు నుంచి వచ్చే బస్సులను ఆరంఘర్ క్రాస్ రోడ్స్, చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్స్, IS సదన్, నల్గొండ క్రాస్ రోడ్స్, చాదర్ ఘట్ మీదుగా నడుపుతున్నట్లు ప్రకటనలో పేర్కొంది ఆర్టీసీ. ముంబై వైపు నుంచి వచ్చే బస్సులను గోద్రెజ్ వై జంక్షన్, నర్సాపూర్ క్రాస్ రోడ్స్, బోయిన్ పల్లి, JBS, సంగీత్ క్రాస్ రోడ్స్, తార్నాక, జమై ఉస్మానియా, నింబోలి అడ్డా మీదుగా వెళ్తాయని ఆర్టీసీ ప్రకటించింది.
గురువారం ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల వరకు మాత్రమే పైన పేర్కొన్న రూట్లో బస్సుల దారి మళ్లింపు ఉంటుందని ఆర్టీసీ స్పష్టం చేసింది. ఆ తర్వాత యథావిధిగా పాత రూట్లలోనే బస్సులు నడుస్తాయన్నారు. గణేష్ నిమజ్జనం, శోభాయాత్ర నేపథ్యంలో ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టింది ఆర్టీసీ.
ఇదిలా ఉంటే గణేశ్ నిమజ్జనం నేపథ్యంలో గ్రేటర్ లో ఆర్టీసీ ఈరోజు 535 ప్రత్యేక బస్సులను TSRTC ఏర్పాటు చేసింది. రద్దీ ప్రాంతాల్లో సంబంధిత డిపో మేనేజర్లు అందుబాటులో ఉండాలని తెలిపింది. ఈ మేరకు పోలీస్ అధికారులతో సమన్వయం చేసుకోవాలని డీఎంలను ఆదేశించారు ఆర్టీసీ అధికారులు.
ఇది కూడా చదవండి:
Viral Video: డీజే టిల్లూ పాటకు పోలీసుల దుమ్ములేపే డ్యాన్స్.. ఈసారి నిమజ్జనంలో హైలెట్ ఇదే!