పాయకరావుపేటలో టిడిపి జనసేన తొలి ఆత్మీయ సమావేశం రఘుపతి కన్వెన్షన్ హల్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిడిపి మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత, పాయకరావుపేట నియోజకవర్గ పరిశీలకుడు, యనమల కృష్ణుడు, అలాగే జనసేన పాయకరావుపేట ఇంచార్జ్ గెడ్డం బుజ్జి, జనసేన స్టేట్ సెక్రెటరీ బోడపాటి శివధత్, మాజీ ఎమ్మెల్సీ అంగూరి లక్ష్మీ శివకుమారి ఇరు పార్టీ మండల అధ్యక్షులు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Also read: పాలకొల్లులో హై టెన్షన్..ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అరెస్టు.!
ఈ కార్యక్రమంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే అనిత మాట్లాడుతూ.. టిడిపి జనసేన ఇరు పార్టీలు కలిసి తొలి సమన్వయ కమిటీ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని అన్నారు. ఏపీ వైసీపీ విముక్త రాష్ట్రం కావాలని ఇరు పార్టీలు కలిసి పనిచేయడం ఎంతో అవసరమని వ్యాఖ్యనించారు. పాయకరావుపేట ఎమ్మెల్యే టికెట్ ఎవరికీ వచ్చిన అందరం కలిసి పని చేయాల్సిన అవసరం ఎంతో ఉందని స్పష్టం చేశారు. అలాగే జనసేన పార్టీ పాయకరావుపేట ఇంచార్జి గెడ్డం బుజ్జి మాట్లాడుతూ.. మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ ఏ నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయానికి కట్టుబడి మేమంతా కలిసి పని చేస్తామని అన్నారు.
రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ, జనసేన నాయకులు ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. భవిష్యత్తులో ఉమ్మడిగా చేపట్టబోయే కార్యక్రమాలపై ఇరు పార్టీల నాయకులు చర్చించారు. ముఖ్యంగా ‘భవిష్యత్తుకు గ్యారెంటీ’ నినాదంతో ఈ నెల 17వ తేదీ నుంచి ఇంటింటా ప్రచార కార్యక్రమాన్ని రెండు పార్టీల నాయకులు కలిసి నిర్వహించనున్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ బూత్‌ల వారీగా ఓటర్ల జాబితాలను క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ప్రతి నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యేల అసమర్థత, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తారు. జిల్లాలో నెలకొన్న కరువు పరిస్థితులు, నిరుద్యోగం, ఇంకా పలు సమస్యలపై కలిసి పనిచేసే విధంగా కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తారు.