Who Is Santiago Martin Highest Electoral Bonds Donor : ఎలక్టోరల్ బాండ్స్(Electoral Bonds) వివరాలు రిలీజ్ అయ్యాక దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా మార్టిన్ శాంటియాగో గురించే చర్చ. ఆయన కంపెనీ పేరు ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్(Future Gaming & .Hotel Services Private Limited) ఎలక్టోరల్ బాండ్లలో ఈ కంపెనీనే టాప్. రాజకీయ పార్టీల(Political Parties) కు అత్యధికంగా విరాళాలు ప్రకటించిన సంస్థ ఇదే. అయితే ఈ సంస్థపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED) నిఘా ఉందని మీకు తెలుసా? లాటరీ చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించారన్న ఆరోపణలు ఈ సంస్థపై ఉన్నాయని తెలుసా? అసలు ఎవరీ మార్టిన్ శాంటియాగో ఎవరు?
కాంగ్రెస్, బీజేపీ మధ్యలో శాంటియాగో:
రూ. 1,368 కోట్లతో మార్టిన్ సంస్థ 2019-2024 మధ్య ఎలక్టోరల్ బాండ్లను ఉపయోగించి రాజకీయ పార్టీలకు అత్యధికంగా విరాళాలు ఇచ్చింది. అయితే ఇక్కడ ఓ ట్విస్ట్ ఉంది. లాటరీ చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించడం ద్వారా అక్రమ ద్రవ్య లాభాలను పొందినట్లు ఈడీ విచారణను ఎదుర్కొన్న సంస్థ ఇదే. దీంతో మార్టిన్ శాంటియాగో సంస్థ విరాళాలపై రాజకీయపరంగా పెద్ద ఎత్తున దుమారం చెలరేగుతోంది. బీజేపీ(BJP) టార్గెట్‌గా కాంగ్రెస్(Congress) ఫైర్ అవుతోంది. అయితే శాంటియాగో సంస్థ ఏ పార్టీకి ఎంత విరాళం ఇచ్చిందో తెలియదు.. ఓవరాల్‌గా ఎంత ఇచ్చిందో మాత్రమే ఉంది. నిజానికి అందరి డీటెయిల్స్ అలానే రిలీజ్ అయ్యాయి. అయితే దేశంలో అధికారంలో ఉన్నది బీజేపీనే కావడం.. అత్యధికంగా విరాళాలు వచ్చిన పార్టీ కూడా కాషాయ పార్టీనే కావడంతో కాంగ్రెస్ మోదీ పార్టీపై విమర్శల బాణాలు ఎక్కుపెట్టింది.
మార్టిన్ శాంటియాగో ఎవరు?
మార్టిన్ శాంటియాగో(Martin Santiago) 13 సంవత్సరాల వయస్సులో ట్రేడింగ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆయన కెరీర్ మియన్మార్‌లోని యాంగాన్‌లో కార్మికుడిగా ప్రారంభమైంది. 1988లో భారత్‌కు తిరిగి వచ్చి తమిళనాడుకు వచ్చిన తర్వాత లాటరీ వ్యాపారం ప్రారంభించాడు. ఆ తర్వాత దేశవ్యాప్తంగా లాటరీ ట్రేడింగ్ నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేశాడు. ఆయన వ్యాపారం దేశం అంతటా ముఖ్యంగా దక్షిణాదిలో విస్తరించి ఉంది. ఏళ్లు గడుస్తున్న తర్వాత తన వ్యాపారాలను సిక్కిం, పశ్చిమ బెంగాల్, పంజాబ్, మహారాష్ట్రతో పాటు మియన్మార్‌లకు కూడా విస్తరించాడు. డిసెంబర్ 1991లో ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌ను స్థాపించారు. కోయంబత్తూరు ఇది స్టార్ట్ చేశారు. లాటరీ ట్రేడింగ్ బిజినేస్ కాకుండా శాంటియాగోకు రియల్ ఎస్టేట్, నిర్మాణం, అల్టర్‌నేటివ్ ఎనర్జీ, విజువల్ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్, టెక్స్‌టైల్స్,ఆరోగ్య సంరక్షణ, విద్య, సాఫ్ట్‌వేర్, టెక్నాలజీ, ఆస్తి అభివృద్ధి, వ్యవసాయం, ఆన్‌లైన్ గేమింగ్, క్యాసినోతో పాటు నిర్మాణ సామగ్రి రంగాలలోనూ వ్యాపారాలు ఉన్నాయి. దేశంలోనే అత్యధిక వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుగా సంవత్సరానికి రూ. 100 కోట్ల వరకు పన్ను చెల్లించిన వ్యక్తి మార్టిన్ శాంటియాగో. తన సిల్వర్ జూబ్లీ వివాహ వార్షికోత్సవం సందర్భంగా శాంటియాగో, ఆయన కుటుంబం పోప్ బెనెడిక్ట్ XVI నుంచి వ్యక్తిగతంగా అపోస్టోలిక్ ఆశీర్వాదం పొందారట. ఈ విషయాలన్ని ఏ వార్త సంస్థో రాసినది కాదు.. స్వయంగా శాంటియాగో వెబ్‌సైట్‌లో పేర్కొన్న విషయాలు!
ఆయనపై ఉన్న అవినీతి ఆరోపణలు ఏంటి?
ఫ్యూచర్ గేమింగ్ సంస్థపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED), ఇన్‌కమ్ ట్యాక్స్(IT) డిపార్ట్‌మెంట్‌తో సహా పలు కేంద్ర ఏజెన్సీలు విచారణ జరుపుతున్నాయి. అయితే మార్టిన్ శాంటియాగోపై 2007 నుంచి సీబీఐ కేసులు ఉన్నట్లు సమాచారం. 2015 నాటికి కర్ణాటక, తమిళనాడు, కేరళ, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, మహారాష్ట్రలల్లో మార్టిన్ శాంటియాగో లాటరీ బిజినెస్ విస్తరించి ఉంది. అయితే ఈ బిజినెస్ అంతా స్కామ్‌ల్లో చిక్కుకోని ఉందని సమాచారం. పలు లాటరీ స్కామ్‌లలో మార్టిన్ నిందితుడిగా ఉన్నారని 'ది న్యూస్ మినిట్(The News Minute)' నివేదించింది. ఇక మార్టిన్ శాంటియాగోకు తమిళ పార్టీ ద్రవిడ మున్నేట్ర కజఘం (DMK)లో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయన ఓ సినిమా కూడా నిర్మించినట్టు సమాచారం. 2011లో తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి జీవితంపై వచ్చిన ఓ సినిమాకు శాంటియాగో నిర్మించారట. జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భూకబ్జా కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న శాంటియాగో 2011 ఆగస్టులో తమిళనాడులో అరెస్టయ్యారు.
ఇన్ని కోట్లు ఎలా సంపాదించాడు:
2019లో సిక్కింలో విక్రయించబడని లాటరీ టిక్కెట్‌లను అక్రమంగా నిలుపుకోవడానికి మార్టిన్ శాంటియాగో ప్రయత్నిచారన్న ఆరోపణలు ఉన్నాయి. ని వల్ల సిక్కిం ₹910 కోట్ల నష్టాన్ని చవిచూసింది. ఈ కేసులోనే ఈడీ(ED) మనీలాండరింగ్ విచారణకు దిగింది. ఈ విచారణలో భాగంగా ఈడీకి దిమ్మదిరిగే విషయాలు తెలిసి వచ్చాయి. ఏప్రిల్ 2022లో రూ.409.92 కోట్ల విలువైన ఆస్తులను, 2022 జూలైలో రూ.173 కోట్ల విలువైన ఆస్తులను, మే 2023లో రూ.457 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అధికారులు అటాచ్ చేశారు. గతేడాది( 2023) అక్టోబర్‌లో ఆదాయపు పన్ను శాఖ కోయంబత్తూరులోని మార్టిన్ శాంటియాగో ఆస్తులపై దాడులు చేసింది. మార్టిన్, ఆయన అల్లుడు ఆధవ్ అర్జున్ ఆస్తులపై దాడులు చేసింది. ఇక ఈ ఏడాది(2024) మార్చి 9న తమిళనాడులో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని ఆరోపించిన కేసులో ED 10 ప్రదేశాలలో ఆధవ్ అర్జున్ ఆస్తులపై దాడి చేసింది. ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయం ఉంది. ఈ ఫిబ్రవరి 2024లో అర్జున్ దళిత రాజకీయ సంస్థ విడుతలై చిరుతైగల్ కట్చి (VCK)కి ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఇలా తమిళనాట రాజకీయపరంగా.. దేశవ్యాప్తంగా లాటరీ బిజినెస్‌పరంగా ఎన్నో వివాదాల్లో ఉన్న మార్టిన్ శాంటియాగో కుటుంబం రాజకీయ పార్టీలకు అత్యధికంగా విరాళాలు ఇచ్చిన సంస్థగా నిలవడం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
Also Read: ఎలక్టోరల్ బాండ్స్‌లో మేఘా సంస్థ రికార్డు.. రూ. 1588 కోట్లతో సెకండ్ ప్లేస్!