EVM Vandalize: మాచర్లలో అసలేం జరిగింది?.. ఆన్సర్ లేని ఆ ఎనిమిది ప్రశ్నలివే!

మాచర్లలో ఈవీఎం ధ్వంసం విషయంలో ప్రజల్లో అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తప్పించుకున్నారా? తప్పించారా? అని అందరూ అనుమానిస్తున్నారు. ఈవీఎం ధ్వంసం వ్యవహారంలో వస్తున్న సందేహాలు ఏమిటనేది వివరంగా ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు

EVM Vandalize: మాచర్లలో అసలేం జరిగింది?.. ఆన్సర్ లేని ఆ ఎనిమిది ప్రశ్నలివే!
New Update

EVM Vandalize: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు.. ఎన్నడూ చూడని సంఘటనలకు వేదికగా మారాయి. ఆధునిక ఎన్నికల విధానం మొదలైన తరువాత చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పోలింగ్ అనంతరం హింస.. పోలింగ్ సమయంలో నేతలు చేసిన అప్రజాస్వామిక కార్యకలాపాలు.. గందరగోళం సృష్టిస్తున్నాయి. ఇక రెండురోజులుగా మాచర్ల నియోజకవర్గంలో పాల్వాయి గేటు పోలింగ్ బూత్ లో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసిన కేసు సంచలనంగా మారింది. ఈ ఘటనపై అనేక ప్రశ్నలు అందరిలోనూ తలెత్తుతున్నాయి. ముందు అవేమిటో చూద్దాం. 

1.ఎన్నికలు జరిగింది మే 13వ తేదీన. ఆరోజు ఈవీఎం ధ్వంసం చేశారు. అయితే, ఆ సంఘటనపై ఆరోజు ఎటువంటి వార్తలు బయటకు రాలేదు.. ఎందుకు?

2. వారం రోజుల తరువాత ఈసీ ఈ సంఘటన గురించి వెల్లడించింది. వారం రోజుల వరకూ ఈసీకి కూడా ఈవిషయం తెలియలేదా?

3. ఈవీఎం ధ్వంసం చేస్తున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. అసలు ఆ వీడియో బయటకు ఎలా వచ్చింది? ఎవరు దానిని సర్క్యులేట్ అయ్యేలా చేశారు? 

4.ఈసీ చెప్పినదాని ప్రకారం.. ఇటువంటి సంఘటనలు అంటే ఈవీఎం ధ్వంసం చేసిన సంఘటనలు ఏడెనిమిది జరిగాయి. వాటి విషయంలో ఏవిధమైన వార్తలు వెల్లడికాలేదు. కానీ, ఈ ఘటన మాత్రం బాగా ట్రెండింగ్ అవుతోంది. ఇలా ఎందుకు జరుగుతోంది?

5.సంఘటన జరిగిన రోజు అక్కడ పోలింగ్ బూత్ లో ఉన్న సిబ్బంది ఈ విషయంపై చర్యలు ఎందుకు తీసుకోలేదు? ఆరోజు ఎందుకు వారు ఈసీకి ఈ విషయం చెప్పలేదు? అక్కడ ఉండే పోలీసు సిబ్బంది కూడా ఎందుకు సంఘటన విషయంలో తమ పై అధికారులకు వివరాలు చెప్పలేదు? 

6. ఒకవేళ పై అధికారులకు అక్కడి విషయాన్ని ఆ పోలింగ్ కేంద్ర సిబ్బంది.. పోలీసులు చెప్పినా.. చర్యలు తీసుకోలేదా?

7. ఈవీఓం ధ్వసం చేసిన తర్వాత అక్కడ ఉన్న అధికారులు ఎందుకు అడ్డుకోలేదు? కేవలం భయంతోనే అడ్డుకోలేదా? ఇంకా ఏదైనా కారణం ఉందా? వెంటనే పిన్నెల్లిని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయలేదు?

అధికారులు భయపడ్డారా?

EVM Vandalize: ఎమ్మెల్యే ఈవీఎంను ధ్వసం చేస్తున్న వీడియోను పరిశీలిస్తే.. ఒక లుంగీ కట్టుకున్న వ్యక్తి (తెలుగుదేశం ఏజెంట్ అని అంటున్నారు) ఒక్కడే వారిని అడ్డుకున్నాడు. అయితే, అతనిని ఎమ్మెల్యే అనుచరులు ఆపు చేస్తుండగా.. ఎమ్మెల్యే చేయి చూపిస్తూ బెదిరిస్తున్నట్టుగా వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. అంటే, భయపడి ఈవీఎం ధ్వంసం విషయాన్ని బయట పెట్టకుండా అధికారులు ఊరుకున్నారా? అనే సందేహాలు కూడా అందరికీ వస్తున్నాయి. 

వారం రోజులు ఎందుకు బయటకు రాలేదు?

ఎన్నికలు ముగిసిన వారం రోజుల తరువాత ఈ సంఘటన బయటకు వచ్చింది. ఎందుకు అన్నిరోజులు దీనిని దాచిపెట్టారు అనేది కూడా పెద్ద సందేహాస్పదంగానే ఉంది. అన్నట్టు.. ఈసీ ఎప్పటికప్పుడు విషయాలన్నీ వివరిస్తూ వస్తుంది. కోడ్ అమలులోకి వచ్చిన తరువాత దాదాపుగా ప్రతిరోజూ ప్రెస్ మీట్ పెట్టి ఎన్నికల విషయాలు ఎప్పటికప్పుడు తెలియచెప్పే ఎన్నికల కమిషన్.. పోలింగ్ శాతాలు.. పోలింగ్ ఎలా జరిగింది చెప్పిన సందర్భంలో ఎప్పుడూ కూడా ఈ విషయాన్ని బయటకు చెప్పలేదు. అది కూడా అందరిలోనూ ఎన్నో అనుమానాలు రేకెత్తిస్తుంది. 

తెలుగుదేశం పార్టీపై దుమ్మెత్తి పోస్తున్న వైసీపీ.. 

అసలు అక్కడ ఏదీ జరగలేదన్నట్టు.. టీడీపీ రాజకీయం చేస్తోంది అంటూ వైసీపీ నేతలు చెప్పుకొస్తున్నారు. వారు చెబుతున్నది ఒకటే.. అక్కడ ఏమి జరిగింది అనేది తెలియకుండా.. కేవలం ఎమ్మెల్యే ఈవీఎం ధ్వంసం చేసిన ఘటన అంటూ వీడియో ట్రెండ్ చేస్తున్నారు. నిజానికి దానికి ముందు వెనుక చాలా సంఘటనలు జరిగాయి. అవి చూపించడం లేదు అని వాదిస్తున్నారు. ఎన్నికల కమిషన్ వైసీపీ నేతల ప్రశ్నలకు సమాధానం చెప్పి.. వారి సందేహాలను సైతం నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది.

Also Read: మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి లొంగుబాటు?

తప్పించుకుపోయారా? తప్పించారా? 
సంఘటన జరిగింది.. కేసులు నమోదు చేశారు. వీడియో సాక్ష్యం చూపిస్తున్నారు. కానీ, పిన్నేల్లిని ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారు? పైగా ఎన్నికల తరువాత ఉద్రిక్త సంఘటనల నేపథ్యంలో అక్కడి నాయకులందరినీ గృహ నిర్బంధంలో ఉంచినట్టు పోలీసులు చెప్పారు. కానీ, ఇప్పుడు పిన్నెల్లి తప్పించుకుపోయారని చెబుతున్నారు.  గృహ నిర్బంధంలో ఉంటే.. అరెస్ట్ చేయడానికి పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు. కానీ, పిన్నెల్లి సోదరులు కారుల్లో హైదరాబాద్ పారిపోయారు. అక్కడ వాహనాలు వదిలి పరారైపోయారు అని పోలీసులు చెబుతున్నారు. దీనిపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎవరైనా కావాలనే వారిని తప్పించారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.

ఇలాంటి సంఘటనలు జరగడానికి, నిందుతుల పేర్లు సరిగా బయలకు రాకపోవడానికి అక్కడి అధికారుల నిర్లక్ష్యం కారాణమన్న విమర్శలు స్థానికుల నుంచి వెల్లువెత్తుతున్నాయి. వారు కఠినంగా, నిష్పక్షపాతంగా వ్యవహరిస్తే ఇలా జరిగేది కాదన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఘటన జరిగిన తర్వాత కూడా వారు నిర్లక్ష్యంగా ఉన్నారన్న అనుమానాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. ఎన్నికల సమయంలో,  ఆ తర్వాత మాచర్లలో ఏం జరిగింది? ఎవరెవరు ఏ తప్పులు చేశారు? వారిని సపోర్ట్ చేసిన అధికారులెవరు? అన్న అంశంపై సమగ్ర విచారణ చేసి అసలు విషయాలు బయటపెట్టాలన్న డిమాండ్ సర్వత్రా వ్యక్తం అవుతోంది.

#pinnelli-ramakrishna-reddy #macharla
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి