Iran President Death: ఇరాన్ అధ్యక్షుని మరణం.. మరో యుద్ధం ప్రారంభం అయ్యే అవకాశం ఉందా?

ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మరణంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. మూడు హెలికాఫ్టర్ల కాన్వాయ్ లో రెండు సురక్షితంగా ఉండడం.. రైసీ ఉన్న హెలికాప్టర్ మాత్రమే ప్రమాదానికి గురికావడంతో.. దీని వెనుక ఇజ్రాయేల్ హస్తం ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి 

Iran President Death: ఇరాన్‌ అధ్యక్షుడి మరణం వెనుక ఆ దేశ పెద్దల హస్తం ఉందా? 
New Update

Iran President Death: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఈ హెలికాప్టర్‌లో విదేశాంగ మంత్రితో సహా మొత్తం 9 మంది ప్రయాణిస్తున్నారు. ఈ ప్రమాదం జరిగినప్పుడు, రైసీ అజర్‌బైజాన్ సరిహద్దు ప్రాంతం నుండి తిరిగి వస్తున్నారు. ఈయన కాన్వాయ్‌లో మొత్తం మూడు హెలికాప్టర్లు ఉన్నాయి. అయితే, మిగిలిన రెండు హెలికాప్టర్లు సురక్షితంగా ఉండగా, రైసీ హెలికాప్టర్ పూర్తిగా ధ్వంసమైంది. రెస్క్యూ టీమ్ పర్వత ప్రాంతం నుండి శిధిలాలను కనుగొంది.  ఇరాన్ నుండి మరణం గురించి అధికారిక ప్రకటన కూడా వచ్చింది.  అయితే, వారి మరణాల వెనుక కుట్ర కోణం ఉండచ్చనే అనుమానాలు తలెత్తుతున్నాయి. 

Iran President Death: అజర్‌బైజాన్ సరిహద్దులో డ్యామ్‌ను ప్రారంభించి తిరిగి వస్తున్న ఇరాన్ అధ్యక్షుడి కాన్వాయ్‌లో మూడు హెలికాప్టర్లు ఉన్నాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం, వాతావరణం సరిగా లేకపోవడం,  పొగమంచు కారణంగా వాయువ్య ప్రాంతంలోని అజర్‌బైజాన్ సరిహద్దులోని జోల్ఫా నగరం సమీపంలో రైసీ హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. కాన్వాయ్‌లోని మరో రెండు హెలికాప్టర్లు సురక్షితంగా తిరిగొచ్చాయి. కానీ, అధ్యక్షుడు ఉన్న హెలికాప్టర్ మాత్రమే ఎందుకు ప్రమాదానికి గురైంది అనే అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ప్రమాదానికి గురైందని చెబుతున్నహెలికాప్టర్ మంచి కండిషన్ లోనే ఉన్నట్టు ఇరాన్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు  ఉన్న సమయంలో ఈ సంఘటన జరిగింది. దీంతో ఈ ప్రమాదానికి ఇజ్రాయేల్ తో సంబంధం ఉంది ఉండవచ్చని.. అలా అనుమానించడంలో పెద్దగా ఆశ్చర్యం లేదనీ ఇరాన్ అధికారులు చెబుతున్నారు. 

అజర్‌బైజాన్‌లో మొస్సాద్..?
Iran President Death: అజర్‌బైజాన్‌ అంటే ఈ సంఘటన జరిగిన ప్రాంతానికి పక్కనే ఉన్న దేశం. దీనికి-ఇజ్రాయేల్ కి మధ్య సాన్నిహిత్యం ఎక్కువే. ఇక్కడ ఇజ్రాయేల్ గూఢాచార సంస్థ మొస్సాద్ కార్యకలాపాలు ఎక్కువగా ఉంటాయని చెబుతారు. మొస్సాద్ ద్వారా ఇజ్రాయేల్ తరచుగా విదేశాల్లో తమ శత్రువులను చంపడానికి కుట్రలు చేస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడి మరణం వెనుక మొస్సాద్ ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అంతేకాకుండా, 2012లో, 'ది లండన్ టైమ్స్' వార్తాపత్రికలో ప్రచురించబడిన ఒక కథనం ఇరాన్‌పై నిఘా ఉంచడానికి అజర్‌బైజాన్ భూమిని మొస్సాద్ ఉపయోగిస్తోందని పేర్కొంది. మొస్సాద్ ఏజెంట్ నుంచి అందిన సమాచారం ఆధారంగా 'ది లండన్ టైమ్స్' ఈ కథనాన్ని ప్రచురించింది. ఏది ఏమైనప్పటికీ, ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ (IRGC) ఇజ్రాయెల్ ఏజెంట్ల కంటే అజర్‌బైజాన్‌లో ఎక్కువ చురుకుగా ఉంది అనేది కూడా కూడా వాస్తవం. 

Iran President Death: సోవియట్ రష్యా నుంచి విడిపోయిన తరువాత 1991లో అజర్‌బైజాన్ గుర్తించిన రెండో దేశం ఇజ్రాయెల్. టర్కీయే మొదటగా ఈ దేశాన్ని గుర్తించింది. దశాబ్దాలుగా అజర్‌బైజాన్ తో ఇజ్రాయేల్ సత్సంబంధాలు కలిగి ఉంది. అయితే, అజర్‌బైజాన్ - ఇరాన్ మధ్య సంబంధాలు సాధారణంగానే ఉన్నాయి. కానీ, ఇజ్రాయేల్ జోక్యంతో అప్పుడప్పుడు ఇవి క్షీణిస్తూ ఉంటాయి. దీంతో ఈ దేశాల మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకుంటూ ఉంటాయి. 

షియా దేశం అయినప్పటికీ..
Iran President Death: నిజానికి అజర్‌బైజాన్ లో షియా ముస్లిం మెజార్టీ వర్గంగా ఉన్న దేశం. ఇక్కడ 55 శాతం షియా ముస్లింలు మరియు 40 శాతం సున్నీ ముస్లింలు ఉంటారు. షియా మెజారిటీ కారణంగా, అజర్‌బైజాన్ ప్రజలు ఎప్పుడూ ఇరాన్ వైపు మొగ్గు చూపుతున్నారు. కానీ అజర్‌బైజాన్ ప్రభుత్వానికి అమెరికా మరియు ఇజ్రాయెల్‌తో లోతైన సంబంధాలు ఉన్నాయి. అజర్‌బైజాన్ ఒక ప్రధాన ఇంధన ఉత్పత్తి దేశం. ఇది  ఇజ్రాయెల్‌కు చమురును ఎగుమతి చేస్తుంది.  బదులుగా ఇజ్రాయెల్ నుండి ఆయుధాలు- సైనిక హార్డ్‌వేర్‌లను తీసుకుంటుంది. 

Also Read: ఎవరీ ఇబ్రహీం రైసీ? ఆయన్ను ఇరాన్‌లోని ఓ వర్గం ఎందుకు వ్యతిరేకిస్తుంది?

శత్రువుకు శత్రువు.. మనకు మిత్రుడే..
Iran President Death: షియా దేశమైనప్పటికీ అజర్‌బైజాన్ ఇజ్రాయెల్‌తో ఎందుకు స్నేహంగా ఉంది? అనే ప్రశ్న తలెత్తడం సహజం. “శత్రువుకి శత్రువు మిత్రుడే” అన్న సామెతలా దీన్ని అర్థం చేసుకోవడం చాలా సులభం. వాస్తవానికి, అజర్‌బైజాన్ ఆర్మేనియాతో దీర్ఘకాల జాతి - ప్రాంతీయ సంఘర్షణను కలిగి ఉంది. ఇరాన్ అర్మేనియాతో తన సరిహద్దును కూడా పంచుకుంటుంది.  క్రైస్తవ దేశం అర్మేనియాతో లోతైన సంబంధాలను కలిగి ఉంది.  రెండు దేశాలు ఈ ప్రాంతంలో వ్యూహాత్మక - వాణిజ్య భాగస్వాములు. 'ది నేషనల్ ఇంట్రెస్ట్' నివేదిక ప్రకారం, 2021 సంవత్సరంలో రెండు దేశాల మధ్య వాణిజ్యం 471 మిలియన్ డాలర్లు. అజర్‌బైజాన్ - అర్మేనియా మధ్య 2020 యుద్ధం తరువాత, అజర్‌బైజాన్ నాగోర్నో-కరాబాఖ్ ప్రాంతాలను, కొన్ని భాగాలను తిరిగి స్వాధీనం చేసుకుంది. ఇజ్రాయెల్, పాకిస్తాన్, టర్కీ ఈ యుద్ధంలో అజర్‌బైజాన్ కు బహిరంగంగా మద్దతు ఇచ్చాయి. అయితే ఈ ప్రాంతంలో ఎలాంటి భౌగోళిక మార్పులనైనా ఇరాన్ వ్యతిరేకిస్తోంది. యుద్ధంలో విజయం తర్వాత, అజర్‌బైజాన్ వీధుల్లో ఇజ్రాయెల్ జెండాలు కూడా రెపరెపలాడాయి.

Iran President Death: ఇదంతా.. ఇరాన్-ఇజ్రాయేల్ మధ్య శత్రుత్వానికి సంబంధించి క్లియర్ పిక్చర్ ఇస్తుంది. ఈ నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ క్రాష్ వెనుక ఇజ్రాయేల్ హస్తం ఉండవచ్చనే అనుమానాలు గట్టిగానే వినిపిస్తున్నాయి. అందుకే, ఇప్పుడు ఇదే కనుక నిజం అయితే, ఏం జరగవచ్చనే ఆందోళనలు ప్రారంభం అయ్యాయి. ఒకవేళ ఇరాన్ అధ్యక్షుడి మరణం వెనుక ఇజ్రాయేల్ ఉంది అనే అనుమానాలు వాస్తవ రూపం దాలిస్తే మాత్రం పరిస్థితి పెద్ద గందరగోళానికి దారి తీస్తుంది. ఇప్పటికే ఇజ్రాయేల్-గాజా యుద్ధంతో ఈ ప్రాంతంలో పరిస్థితి దారుణంగా ఉంది. ఇప్పుడు ఇజ్రాయేల్ సంబంధం నిజమైతే.. అజర్‌బైజాన్ - ఇరాన్ మధ్య యుద్ధం తప్పదనే భయం ప్రారంభం అయింది. అదే జరిగితే.. పరిస్థితులు మరింత క్షీణిస్తాయి. ఈరెండు దేశాల మధ్య యుద్ధం వస్తే అది చమురు, బంగారం వంటి ఉత్పత్తుల ధరలు పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

#iran-president
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe