AP Tragedy : ఏపీ సీఎం వైఎస్ జగన్ నిర్వహించిన బహిరంగ సభలో అపశ్రుతి చోటుచేసుకుంది. సభకు వచ్చి తిరిగి వెళ్తుండగా జరిగిన తొక్కిసలాటలో వైసీపీ కార్యకర్త ఒకరు మరణించారు. ఆదివారం బాపట్లజిల్లా మేదరమెట్లలో వైసీపీ సిద్ధం పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహించారు. సాయంత్రం 4గంటలకు ప్రారంభమైన సభ 6గంటల వరకు కొనసాగింది. సీఎం జగన్ ప్రసంగం తర్వాత జనాలు సభాస్థలం నుంచి బయటకు వెళ్తుండగా గేట్ దగ్గర తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ తొక్కిసలాటలో వైసీపీ కార్యకర్త ఒకరు మరణించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే మృతుడికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు.
కాగా ప్రకాశం జిల్లాలో సీఎం జగన్ పర్యటించారు. మేదరమెట్ల వద్ద వైసీపీ సిద్ధం సభలో ప్రసంగించారు. మరో ఐదేళ్లు తనను ఆశీర్వదించేందుకు వచ్చిన ప్రజా సైన్యానికి సెల్యూట్ చేస్తున్నా అంటూ ప్రసంగం మొదలు పెట్టారు. సిద్ధం అంటే ప్రజలు చేసే యుద్ధం అని, సిద్ధం అంటే ప్రజా సముద్రం అని కామెంట్స్ చేశారు. ఇప్పటికే ఉత్తరాంధ్ర, ఉత్తర కోస్తా, రాయలసీమ సిద్ధం అయ్యాయని, ఇప్పుడు దక్షిణ కోస్తా కూడా సిద్ధం అయిందన్నారు. ఈసారి ఎన్నికలు కురుక్షేత్ర యుద్ధం వంటివని, ప్రజలే శ్రీకృష్ణుడు అయితే, తాను అర్జునుడ్ని అని సీఎం జగన్ అభివర్ణించారు.
చంద్రబాబు మాదిరిగా తనకు నటించే పొలిటికల్ స్టార్ క్యాంపెయినర్లు ఎవరూ లేరన్నారు. మీ బిడ్డకు రకరకాల పొత్తులు లేవని.. ఎన్నికలకు మీ బిడ్డ ఒంటరిగానే వెళుతున్నాడని పేర్కొన్నారు. నక్షత్రాలు ఎన్ని ఉన్నాయో.. తనకు అంతమంది పేదింటి స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారని వ్యాఖ్యానించారు. ఇసుక వేస్తే రాలనంతగా ఉన్న మీరందరూ కూడా స్టార్ క్యాంపెయినర్లేనని కామెంట్స్ చేశారు. ఎన్నికలు సమీపిస్తుంటే జగన్ పేరు వింటేనే చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని కౌంటర్లు వేశారు. మీ బిడ్డ ఇంటింటికీ చేసిన అభివృద్ధిని చూసి చంద్రబాబు భయపడుతున్నాడని.. మనలను నేరుగా ఎదుర్కొనలేక ఢిల్లీకి వెళ్లి పొత్తులు పెట్టుకున్నారని విమర్శలు గుప్పించారు. మన ఎమ్మెల్యేలు గడపగడపకు తిరుగుతుంటే, చంద్రబాబు మాత్రం ఢిల్లీలో ఇతర పార్టీల గడపలకు తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు.
ఇది కూడా చదవండి: సముద్ర అలలపై తొలి బంగారు నౌక.. కళ్లు చెదిరే సౌకర్యాలు!