Ram Temple: 21 ఏళ్ల తర్వాత తెరుచుకున్న రాముడి గుడి!

New Update
Ram Temple: 21 ఏళ్ల తర్వాత తెరుచుకున్న రాముడి గుడి!

నక్సల్స్​ ప్రభావం అధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఛత్తీస్​గఢ్ ఒకటి. ఇక్కడి సుక్మా జిల్లాలోని లఖాపాల్​​, కేరళపెండా గ్రామాల సమీపంలో 1970లో బిహారీ మహారాజు ఓ రామాలయాన్ని నిర్మించారు. అయితే గుడిలో ఎలాంటి పూజలు చేయకూడదని 2003లో నక్సల్స్​ ఈ ఆలయాన్ని మూసివేశారు. దీంతో వారు బెదిరింపుల కారణంగా అప్పటి నుంచి ఇప్పటివరకూ(21ఏళ్లు) ఏ ఒక్కరూ రాముడి గుడి తలుపులను తెరిచేందుకు సాహసించలేదు.

ఇదిలాఉంటే సీఆర్​పీఎఫ్​ 74వ బెటాలియన్​ కోసం ఓ శిబిరాన్ని(లఖాపాల్​ క్యాంప్​) కేరళపెండా గ్రామానికి సమీపంలో గతేడాది మార్చిలో ఏర్పాటు చేశారు అధికారులు. ఈ క్రమంలో తమ గ్రామంలో ఉన్న పురాతనమైన రామాలయం గురించిన వాస్తవాలను సీఆర్​పీఎఫ్​ సిబ్బందికి తెలియజేశారు గ్రామస్థులు. ఇది తెలుసుకున్న రక్షణ దళం అధికారులు ఎలాగైనా ఆలయాన్ని తిరిగి తెరిపించి ఎప్పటిలాగే పూజలు జరుపుకునేలా చర్యలు తీసుకున్నారు. ఇలాగైనా మారుమూల ప్రాంతంలో ఉన్న ఈ గ్రామప్రజలు జనజీవన స్రవంతిలో కలుస్తారని భావించారు. ఆ మేరకు తాజాగా తాళం వేసి ఉన్న మందిరం తలుపులను తెరిచి ఆలయ పరిసరాలను శుభ్రపరిచారు. అనంతరం సదరు గ్రామ ప్రజల సాయంతో సంప్రదాయబద్ధంగా పూజాకార్యక్రమాలు నిర్వహించారు. ఆ తర్వాత గుడిని బాధిత గ్రామ పెద్దలకు అప్పగించారు.

అయితే ఆలయ నిర్మాణానికి అవసరమైన సామగ్రిని సమకూర్చేందుకు గ్రామస్థులు అప్పట్లో సుమారు 80 కిలోమీటర్ల దూరం కాలినడకన ప్రయాణించారని సీఆర్​పీఎఫ్​ 74వ బెటాలియన్ కమాండెంట్ హిమాన్షు పాండే తెలిపారు. ఆ సమయంలో సరైన రహదారి, రవాణా సౌకర్యాలు కూడా లేని ఈ ప్రాంతానికి పదుల కిలో మీటర్లు నడిచి ఆలయ నిర్మాణంలో భాగమైన గ్రామస్థులను మెచ్చుకున్నారు. కాగా, ఇదంతా ఆ శ్రీరాముడిపై భక్తితోనే చేశామని చెబుతున్నారు కేరళపెండా గ్రామప్రజలు.

గుడిని అసలెందుకు ముసేశారు?
ఆలయాన్ని నిర్మించిన తర్వాత గ్రామస్థుల్లో చాలామంది వరకు మాంసం, మద్యానికి దూరంగా ఉన్నారట. గ్రామంలోని ప్రజలందరూ తమ మత విశ్వాసాలు, అలవాట్ల కారణంగా హింసకు ఆమడ దూరంలో ఉండేవారట. దీంతో గ్రామం నుంచి తమకు కావాల్సిన సహాయసహకారాలను పొందలేకపోయేవారు నక్సల్స్​. ఇలా ప్రజల మద్దతు కరువవ్వడం వల్ల ఆగ్రహం తెచ్చుకున్న నక్సలైట్లు 2003లో గ్రామంలోని రాముడి గుడికి తాళం వేశారు. పూజలు చేయడాన్ని నిషేధించారు.

ఆలయం నిర్మించిన కొత్తలో గ్రామంలో పెద్ద ఎత్తున జాతరను కూడా నిర్వహించేవారటు ప్రజలు. ఈ జాతరకు వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చేవారు. కానీ, నక్సల్స్ బెడద కారణంగా చివరకు ఆ జాతరకు కూడా బ్రేక్​ పడిందని చెబుతున్నారు ఇక్కడి ప్రజలు. ఇక రెండు దశాబ్దాలుగా మూతపడ్డ తమ గుడిని సీఆర్​పీఎఫ్​​ అధికారుల చొరవ చూపి తెరిపించడం వల్ల వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు కేరళపెండా గ్రామస్థులు.

Advertisment
తాజా కథనాలు