Palnadu Ragging: పల్నాడు లో ర్యాగింగ్ కలకలం.. కర్రలతో కొడుతూ.. కరెంట్ షాక్ పెడుతూ! వీడియో వైరల్

పల్నాడు జిల్లాలో ర్యాగింగ్ కలకలం రేపింది. దాచేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ పేరుతో తమను దారుణంగా కొడుతున్నారని జూనియర్స్ ఆందోళనకు దిగారు.

New Update

Palnadu Ragging: కాలేజీల్లో ర్యాగింగ్ అరికట్టేందుకు విద్యాసంస్థలు  కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ విద్యార్థుల తీరు మారడం లేదు. ర్యాగింగ్ పేరుతో జూనియర్ విద్యార్థుల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారు సీనియర్లు. ర్యాగింగ్ తట్టుకోలేక విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు కూడా ఉన్నాయి. అయితే తాజాగా మరోసారి ర్యాగింగ్ కలకలం రేపింది. పల్నాడు జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని విద్యార్థులు ర్యాగింగ్ పేరుతో సీనియర్లు  తమను దారుణంగా కొడుతున్నారని ఆందోళనకు దిగారు. హాస్టల్ కి తీసుకెళ్లి కొడుతూ.. కరెంట్ షాక్ కి గురిచేస్తూ చిత్రహింసలు పెడుతున్నారని వాపోయారు. అంతేకాదు ఆ దృశ్యాలను వీడియోలు తీస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బయటకు చెబితే చంపుతామని బెదిరింపులకు గురిచేసినట్లు తెలిపారు. ఈ విషయం గురించి  పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదని బాధిత తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. 

గతంలో ర్యాగింగ్ ఘటనలు 

ఇది మాత్రమే కాదు గతంలో కూడా అనేక యూనివర్సిటీలు, విద్యాసంస్థల్లో ర్యాగింగ్ ఘటనలు వెలుగు చూశాయి. ఈ ఏడాది మార్చిలో నాగర్‌కర్నూల్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ముగ్గురు సీనియర్లు జూనియర్ విద్యార్ధి పట్ల అమానుషంగా ప్రవర్తించారు. మొదటి సంవత్సరం విద్యార్థిని రూమ్ లోకి పిలిచి బెల్టుతో కొట్టారు. అంతేకాదు అతడి ఫోన్ లాక్కొని పర్సనల్ ఫొటోలు, వీడియోలు చూస్తూ అవమానించారు. సీనియర్ల వేధింపులు తట్టుకోలేక బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. అలాగే కళాశాల యాజమాన్యం పై కూడా కఠిన చర్యలు తీసుకున్నారు. 

నల్గొండలోని ప్రభుత్వ వైద్య కళాశాల

ఇదిలా ఉంటే గతేడాది నవంబర్ లో నల్గొండలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఐదుగురు జూనియర్ విద్యార్థులను సీనియర్లు ర్యాగింగ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. బాధితులు కేరళకు చెందినవారిగా తెలిసింది. అయితే వీరి చేత బలవంతంగా రికార్డులు రాయించడం, వేధించడంతో కళాశాల యజమాన్యునికి ఫిర్యాదు చేశారు. దీంతో ఆ ఐదుగురు సీనియర్లను ఆరు నెలలు  సస్పెండ్ చేసినట్లు సమాచారం.  

మంగళగిరి AIIMS

మరోసారి మంగళగిరిలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)లో కూడా ర్యాగింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. సీనియర్ల వేధింపులు భరించలేక ఫస్ట్ ఇయర్  విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేసినట్లు  వార్తలు వచ్చాయి. అయితే తోటి విద్యార్థులు గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటనపై విచారణ జరిపిన అధికారులు..  13 మంది సీనియర్ విద్యార్థులను సస్పెండ్ చేశారు.

ప్రభుత్వాలు, కళాశాలల చర్యలు

కాలేజీ, యూనివర్సిటీస్ లో ర్యాగింగ్ ఘటనలను అరికట్టేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కఠిన చట్టాలను అమలు చేస్తున్నాయి. యూజీసీ (UGC) మార్గదర్శకాల ప్రకారం, ప్రతి విద్యాసంస్థ  యాంటీ-ర్యాగింగ్ కమిటీలను ఏర్పాటు చేసింది. విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ర్యాగింగ్ నిరోధక కార్యక్రమాలు చేస్తున్నారు. బాధితుల కోసం హెల్ప్ లైన్ నెంబర్లను కూడా అందుబాటులో ఉంచుతున్నారు. అయినప్పటికీ కొందరి విద్యార్థులు తీరు మారడం లేదు. ఈ నేపధ్య్మలో దీనిపై మరింత పటిష్టమైన చర్యలు తీసుకోవడం అవసరమని నెటిజన్లు భావిస్తున్నారు. 

Also Read:Kayadu Lohar: బ్లాక్ డ్రెస్‌లో అందాలు ఆరబోస్తున్న డ్రాగన్ బ్యూటీ.. ఒక్క ఫొటో చూస్తే కుర్రాళ్లు ఫ్లాటే!

Advertisment
తాజా కథనాలు