TSPSC: టీఎస్‌పీఎస్సీపై ప్రభుత్వం కొత్త ప్లాన్‌!.. వివిధ కమిషన్లపై అధికారుల అధ్యయనం

ఆరు గ్యారెంటీల అమలు దిశగా కార్యాచరణ రూపొందించిన కాంగ్రెస్‌ ప్రభుత్వం మరో కీలక అంశంపై సీరియస్‌గా దృష్టిపెట్టింది. టీఎస్‌పీఎస్సీ సమూల ప్రక్షాళన దిశగా రేవంత్‌ సర్కారు సిద్ధమవుతోంది. యూపీఎస్సీ సహా పలు కమిషన్ల పనితీరుపై అధికారులు అధ్యయనం చేస్తున్నారు.

TSPSC: తెలంగాణ గ్రూప్‌-4 అభ్యర్థులకు అలర్ట్‌.. లిస్ట్ రిలీజ్!
New Update

TSPSC: ఆరు గ్యారెంటీల అమలు దిశగా కార్యాచరణ రూపొందించిన కాంగ్రెస్‌ ప్రభుత్వం (Congress Govt) మరో కీలక అంశంపై సీరియస్‌గా దృష్టిపెట్టింది. తమ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముఖ్య కారణంగా నిలిచిన నిరుద్యోగుల సమస్యను పరిష్కరించడంపై ఫోకస్‌ పెట్టింది. టీఎస్‌పీఎస్సీ (TSPSC) సమూల ప్రక్షాళన దిశగా రేవంత్‌ సర్కారు సిద్ధమవుతోంది. కమిషన్‌తో సహా ఇతర నియామక పరీక్షలపై సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) సమీక్ష, బోర్డు సభ్యుల రాజీనామా అనంతర పరిణామాలను బట్టి ఇదే విషయం స్పష్టమవుతోంది. సభ్యుల రాజీనామాలు గవర్నరు వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. పేపర్‌లీకేజీ, కమిషన్‌లో అవకతవకల విషయమై న్యాయవిచారణ ఆలోచనలో గవర్నర్‌ ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు యూపీఎస్సీ సహా ఇతర రాష్ట్రాల పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్లపై అధ్యయనానికి ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.

గ్రూప్‌-1 (Group 1), ఇతర పరీక్ష పేపర్‌ లీకేజీలతో (Paper Leak) కమిషన్‌ తీవ్రంగా అప్రతిష్ఠపాలైన టీఎస్‌పీఎస్సీలో సంస్కరణల కోసం, పారదర్శకంగా పరీక్షల నిర్వహణ దిశగా బోర్డులో మార్పుల కోసం ప్రభుత్వం సిద్ధమవుతోంది. అందులో భాగంగానే కమిషన్‌ కార్యదర్శి అనితా రామచంద్రన్‌ కేరళ వెళ్లి అక్కడి పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పనితీరును పరిశీలించారు. శుక్రవారం మరో ఇద్దరు ఐఏఎస్‌ అధికారులు ఢిల్లీ వెళ్లి యూపీఎస్సీ విధానాన్నీ పరిశీలిస్తారు. వారిచ్చే నివేదిక ఆధారంగా బోర్డులో ఆవశ్యకమైన మార్పులు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

జాబ్‌ క్యాలెండర్‌ అమలు దిశగా కార్యాచరణ!

ఉద్యోగ ఖాళీలను భర్తీకి వీలుగా జాబ్‌ క్యాలెండర్ అమలు హామీని ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ యూత్‌ లోకి తీసుకెళ్లిన విషయం తెలిసిందే. ఆ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రకారం ఈ ఫిబ్రవరి నుంచి నియామక ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది. ఇదిలా ఉండగా, కమిషన్‌ గతంలో ప్రారంభించిన నియామక ప్రక్రియపై ఇప్పటికీ స్పష్టత రాలేదు. గ్రూపు-1 సహా ప్రశ్నపత్రాల లీకేజీతో రద్దైన, వాయిదా పడిన పరీక్షలపై స్పష్టత లేక అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంతో మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా జాబ్‌ క్యాలెండర్‌ (Congress Job Calender) అమలుపై ఉద్యోగార్థులు గంపెడాశలు పెట్టుకున్నారు.

కేరళ తరహా విధానం అమలు చేస్తారా?

కమిషన్‌కు కొత్త బోర్డుతో పాటు ఉద్యోగ భర్తీ విధానంలో కూడా మార్పు అంశాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ క్రమంలోనే కార్యదర్శి అనితా రామచంద్రన్‌ కేరళ వెళ్లివచ్చారు. ఆ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొంత భిన్నంగా ఉంటుంది. ఉద్యోగి ఎప్పుడు రిటైర్‌ అవుతారో ముందుగానే గుర్తించి, ఆ సమయానికి కొత్త ఉద్యోగి ఆ స్థానంలో చేరేలా నియామక ప్రక్రియ చేపడుతున్నారు. అయితే, ఈ విధానంలో పోస్టుల సంఖ్య కూడా పరిమితంగానే ఉండడం గమనార్హం. కానీ, భర్తీ ఎప్పటికప్పుడు జరుగుతుంది. దాదాపు ఆరు నెలల ముందుగానే నియామక ప్రక్రియ ఉంటుందన్న విషయాన్ని కార్యదర్శి పరిశీలించారు. పరీక్షల నిర్వహణలో పొరపాట్లకు కూడా ఇందులో అవకాశం తక్కువ. తెలంగాణలో ఈ విధానం అమలు ఇప్పటికిప్పుడు సాధ్యమవుతుందా అన్న అంశాన్ని కూడా చర్చిస్తున్నారు.

యూపీఎస్సీని అనుసరిస్తారా?

ఆలిండియా సర్వీసు ఉద్యోగాలను భర్తీ చేసే యూనియన్‌ పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ ఏటా క్రమం తప్పకుండా, ఎలాంటి వివాదాలూ లేకుండా సజావుగా పరీక్షలు నిర్ణయిస్తున్న విషయం తెలిసిందే. యూపీఎస్సీ విధివిధానాలు, పనితీరును కూడా పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ నెల 5 శుక్రవారం ఐఏఎస్‌ ఆఫీసర్లు వాణీప్రసాద్‌, అహ్మద్‌ నదీమ్‌ ఢిల్లీ వెళ్లి కమిషన్‌ విధానాలను పరిశీలించాలని నిర్ణయించుకున్నారు.

అధికారుల పర్యటన అనంతరం పూర్తి వివరాలు, తెలంగాణలో ఆయా విధానాల సాధ్యాసాధ్యాలపై ప్రభుత్వానికి నివేదికను సమర్పిస్తారు. ఇప్పటికే రద్దయిన, వాయిదా పడి పరీక్షల నిర్వహణతో పాటు, జాబ్‌ క్యాలెండర్‌ అమలు కోసం ఎలాంటి కార్యాచరణ రూపొందించాలన్న అంశంపై కూడా నివేదిక తర్వాత స్పష్టత వచ్చే అవకాశముంది.

Also Read: అయోధ్య రామాలయ ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రిక..వీడియో వైరల్..మీరూ ఓ లుక్కేయ్యండి..!!

#tspsc
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe