Pithapuram: కాకినాడ జిల్లా పిఠాపురం నియోజవకర్గంలో కూటమి నేతల మధ్య వివాదం ముదురుతోంది. గొల్లప్రోలు మండలం తాటిపర్తి గ్రామంలో ఆధిపత్యం కోసం జనసేన, టీడీపీ నాయకులు పోటీపడుతున్నారు. శ్రీ అపర్ణ సమేత నాగేశ్వర స్వామి ఆలయ కమిటీ కోసం కూటమి పార్టీ నేతలు కస్సు బుస్సు మంటున్నారు. నెల రోజుల క్రితం మొదలైన ఈ వివాదం ఇంకా చల్లారడం లేదు. ఆలయ కమిటీ నియమించడంలో గతం నుండి టీడీపీ, జనసేన నాయకుల మధ్య కుమ్ములాట కొనసాగింది.
Also Read: ఉపఎన్నికలలో బీజేపీకి షాక్.. ఇండియా కూటమి హవా
నియోజకవర్గంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ ఆలయ కమిటీ బాధ్యతలు చేపట్టడం గ్రామంలో ఆనవాయితీ. జనసేన పార్టీ పిఠాపురం నియోజవర్గంలో అధికారంలోకి రావడంతో గ్రామంలో జనసేన నాయకులకు కమిటీ బాధ్యతలు, ఆలయ తాళాలు అప్పగించారు వైసీపీ పార్టీ నాయకులు. కానీ, టీడీపీ నాయకులు అభ్యంతరం చెప్పడంతో పోలీసులకు విఆర్వోకి తాళాలు అప్పగించారు. గత నాలుగు రోజుల క్రితం కమిటీ ఫామ్ చేశామని పోలీసులకు చెప్పడంతో వారు జనసేన నేతలకు తాళాలు అప్పగించారు.
Also Read: అంబానీ పెళ్ళి వేడుకల్లో 160 ఏళ్ల నాటి చీరలో మెరిసిన ఆలియా.. లుక్ వైరల్
అయితే, టీడీపీకి చెందిన నాయకులను ఆలయ కమిటీలో వెయ్యలేదని జనసేన నాయకులనే కమిటీ చైర్మన్ గా పెట్టారని టీడీపీ నాయకులు మండిపడుతున్నారు. దీనిపై గత నాలుగు రోజులుగా ఆలయం ఎదుట టెంట్ వేసి దీక్ష చేపట్టారు. జనసేన నేతలు వాళ్ళ ఇష్టానుసారంగా కమిటీ వేసుకున్నారని అభ్యంతరం తెలుపుతూ టీడీపీ నాయకులు దీక్ష చేపట్టారు. పిఠాపురం నియోజకవర్గ స్థానిక ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్, టీడీపీ ఇన్చార్జ్ వర్మ మాకు న్యాయం చేయాలని కోరుతూ దీక్ష కొనసాగిస్తున్నారు.