Nayan Sarika: రాజమౌళి సినిమాలో హీరోయిన్ గా నటించడమే నా టార్గెట్: నయన్ సారిక

నయన్ సారిక ‘విష్ణు విన్యాసం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నయన్ మాట్లాడుతూ కథల ఎంపికే తన విజయానికి కారణమని, శ్రీవిష్ణుతో పనిచేయడం ఆనందంగా ఉందని, భవిష్యత్తులో రాజమౌళి సినిమాలో నటించడం తన కల అని వెల్లడించింది.

author-image
By Lok Prakash
New Update
Nayan Sarika

Nayan Sarika

Nayan Sarika: చిన్న సినిమాలతోనే మంచి పేరు తెచ్చుకుని విజయాలకు చిరునామాగా మారుతున్న హీరోయిన్ నయన్ సారిక. ‘గం గం గణేశా’తో తెలుగు తెరకు పరిచయమైన ఆమె, తరువాత ‘క’, ‘ఆయ్’ సినిమాలతో ప్రేక్షకులకు మరింత చేరువైంది. తెలుగమ్మాయిలా కనిపిస్తూ, చక్కగా తెలుగు మాట్లాడటం కూడా ఆమెకు ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. తాజాగా శ్రీవిష్ణుతో కలిసి ‘విష్ణు విన్యాసం’ సినిమాలో నటించింది. ఈ సినిమా ఈ శుక్రవారం విడుదల కానున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడింది.

‘విష్ణు విన్యాసం’ ఎలా ఉంటుంది?

ఈ సినిమా పూర్తి వినోదాత్మకంగా ఉంటుందని నయన్ సారిక చెప్పింది. కథ విన్నప్పుడే చాలా నవ్వు వచ్చిందని తెలిపింది. ఇద్దరు లెక్చరర్ల మధ్య జరిగే ప్రేమకథ ఇది. ముఖ్యంగా విద్యార్థులు, యువత ఈ కథకు బాగా కనెక్ట్ అవుతారని ఆమె నమ్మకం వ్యక్తం చేసింది.

కాలేజీ జ్ఞాపకాలు గుర్తొచ్చాయి..

ఈ సినిమాలో నటిస్తున్నప్పుడు తన కాలేజీ రోజులు గుర్తొచ్చాయని చెప్పింది. స్కూల్, కాలేజీల్లో ఇద్దరు టీచర్లు మంచి జోడీలా కనిపిస్తే వాళ్ల గురించి విద్యార్థులు మాట్లాడుకునే విషయం తెలిసిందే అని నవ్వుతూ చెప్పింది. సినిమాలో తాను, శ్రీవిష్ణు అలాంటి జంటగా కనిపిస్తామని తెలిపింది. మనీషా పాత్రలో నటిస్తున్నప్పుడు తన ఇంగ్లీష్ టీచర్ గుర్తుకొచ్చిందని చెప్పింది.

నవ్వించడం చాలా కష్టమని, అలాగే భావోద్వేగాలను చూపించడం కూడా సులభం కాదని ఆమె చెప్పింది. మంచి కథ, బలమైన పాత్ర, సహనటుల టైమింగ్ ఉంటేనే అది సక్సెస్ అవుతుందని తెలిపింది. శ్రీవిష్ణు బయటికి కొంచెం సీరియస్‌గా కనిపించినా, వ్యక్తిగతంగా చాలా సరదాగా ఉంటారని చెప్పింది. ఆయన కామెడీ టైమింగ్ సహజంగా ఉంటుందని తెలిపింది. దర్శకుడు యదునాథ్ మారుతీరావు కథ చెప్పే విధానం చాలా బాగుందని, రధన్ సంగీతం సినిమాకు పెద్ద బలమని చెప్పింది.

తన విజయాలకు ముఖ్య కారణం కథల ఎంపికేనని నయన్ సారిక స్పష్టం చేసింది. అదృష్టం కూడా కొంతవరకు ప్రభావం చూపుతుందని చెప్పింది. ప్రతి కథను తానే విని, కొత్తదనం ఉంటేనే ఒప్పుకుంటానని తెలిపింది. “నయన్ సారిక సినిమాలో ఉందంటే ఏదో ప్రత్యేకం ఉంటుంది” అనే నమ్మకం ప్రేక్షకుల్లో రావాలనేదే తన కోరిక అని చెప్పింది.

తెలుగు సినిమాల్లో నటిస్తూ భాష నేర్చుకున్నానని, ప్రస్తుతం కన్నడలో ఒక సినిమా చేస్తున్నానని తెలిపింది. అయినా తన మొదటి ప్రాధాన్యం తెలుగు సినిమాలేనని స్పష్టం చేసింది. ‘గం గం గణేశా’ సినిమాకు ఉత్తమ తొలి కథానాయికగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు రావడం తనకు చాలా ఆనందం ఇచ్చిందని చెప్పింది. ‘విష్ణు విన్యాసం’ తర్వాత ‘రాకాస’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. అన్ని రకాల కథల్లో నటించాలని ఉందని, ముఖ్యంగా రాజమౌళి దర్శకత్వంలో హీరోయిన్ గా నటించడం తన కల అని తెలిపింది.

ట్రైలర్‌లో తన పాత్ర కొంచెం బోల్డ్‌గా కనిపించినా, అందులో మంచి అర్థం ఉంటుందని చెప్పింది. మనీషా అనే యువతిగా తాను కనిపిస్తానని, ఆ పాత్రకు ఎన్నో కోణాలు ఉంటాయని తెలిపింది. జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్న అమ్మాయి పాత్ర అది. గత సినిమాలతో పోలిస్తే ఈ పాత్ర భిన్నంగా ఉంటుందని, ఈ సినిమా తనను మంచి స్థాయికి తీసుకెళ్తుందని నయన్ సారిక తెలిపింది.

Advertisment
తాజా కథనాలు