Tollywood Strike: టాలీవుడ్‌లో సమ్మె సెగలు.. రిలీజ్ సినిమాల పరిస్థితేంటి..?

టాలీవుడ్‌లో కార్మిక సంఘాలు పెండింగ్ సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాయి. గడువులోగా స్పందించకపోతే మార్చి 1 నుంచి సమ్మె చేస్తామని హెచ్చరించాయి. షూటింగ్స్, రిలీజ్‌లపై ప్రభావం పడే అవకాశం ఉందని నిర్మాతలు ఆందోళన చెందుతున్నారు.

New Update
Tollywood Strike

Tollywood Strike

Tollywood Strike: టాలీవుడ్‌లో మరోసారి సమ్మె పరిస్థితులు కనిపిస్తున్నాయి. సమ్మర్‌, ఆ తర్వాతి సీజన్‌లో సినిమాలు విడుదల చేయాలని భావిస్తున్న నిర్మాతలకు ఇది పెద్ద ఆందోళనగా మారే అవకాశం ఉంది. పరిశ్రమలో జరుగుతున్న పరిణామాలు చూస్తే పరిస్థితి సీరియస్‌గా మారుతుందేమో అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఇప్పటికే నిర్మాతలు, యూనియన్లు, ప్రభుత్వం మధ్య గతంలో చర్చలు జరిగాయి. ఆ సమయంలో కార్మికుల వేతనాల పెంపు, కాల్షీట్లు, పని పరిస్థితులు వంటి అంశాలపై ఒక అవగాహనకు వచ్చారు. ఆ నిర్ణయాలను అమలు చేయడానికి ప్రభుత్వం ఒక కమిటీ కూడా ఏర్పాటు చేసింది. అయితే ఆ నిర్ణయాలు పూర్తిగా అమలుకాలేదని యూనియన్లు చెబుతున్నాయి.

చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను ఈ నెలాఖరులోగా పరిష్కరించాలని కొన్ని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ విషయంపై ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షుడికి లేఖలు కూడా పంపినట్లు సమాచారం. నిర్ణీత గడువులోగా సమస్యలు పరిష్కరించకపోతే మార్చి 1 నుండి సమ్మె ప్రారంభిస్తామని హెచ్చరించారని తెలుస్తోంది.

లేఖ రాసిన యూనియన్లలో తెలుగు సినీ స్టూడియోస్ వర్కర్స్ యూనియన్, ప్రొడక్షన్ సెట్ అసిస్టెంట్స్ యూనియన్ ఉన్నాయని సమాచారం. తమ నిరసన వల్ల నిర్మాతలకు నష్టం జరిగినా తాము బాధ్యత వహించబోమని కూడా వారు లేఖలో పేర్కొన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇవే కాకుండా మరికొన్ని యూనియన్లు కూడా సమ్మె ఆలోచనలో ఉన్నాయని తెలుస్తోంది. అందరూ కలిసి వచ్చే నెల 1 నుండి పనులు నిలిపివేయాలని భావిస్తున్నారట. అలా జరిగితే సమ్మర్‌లో విడుదలకు సిద్ధమైన సినిమాలపై నేరుగా ప్రభావం పడే అవకాశం ఉంది. షూటింగ్స్ ఆగిపోతే రిలీజ్ డేట్లు మారే పరిస్థితి రావచ్చు.

కొన్ని నెలల క్రితం కూడా ఇలాంటి సమ్మె జరిగింది. ఆ సమయంలో నిర్మాతలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొందరు ఇతర రాష్ట్రాల నుండి కార్మికులను తీసుకువచ్చి షూటింగ్స్ కొనసాగించాలని ప్రయత్నించారు. దీంతో వివాదాలు చెలరేగాయి. చివరకు పరిశ్రమ పెద్దలు, ప్రభుత్వ ప్రతినిధులు మధ్యలోకి వచ్చి సమస్యను తాత్కాలికంగా పరిష్కరించారు.

ఇప్పుడు మళ్లీ సమ్మె పరిస్థితి వస్తే టాలీవుడ్‌కు మరోసారి కష్టకాలం రావచ్చు. సమస్యలు చర్చల ద్వారా త్వరగా పరిష్కారమవుతాయా? లేక సమ్మె తప్పదా? అన్నది త్వరలో స్పష్టమవుతుంది.

Advertisment
తాజా కథనాలు