/rtv/media/media_files/2026/02/12/sreeleela-2026-02-12-10-02-45.jpg)
Sreeleela
Sreeleela: టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల ఇప్పుడు అధికారికంగా డాక్టర్ అయ్యారు. సినిమాల్లో బిజీగా ఉంటూనే ఆమె వైద్య విద్యను కూడా పూర్తి చేశారు. ఇటీవల ముంబయిలోని డీవై పాటిల్ యూనివర్సిటీలో జరిగిన స్నాతకోత్సవ వేడుకలో ఆమె ఎంబీబీఎస్ డిగ్రీ అందుకున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో అభిమానులు “డాక్టర్ శ్రీలీల” అంటూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
కన్వొకేషన్ వేడుకలో మరూన్ కలర్ గౌన్ ధరించి స్టేజ్‌పై డిగ్రీ తీసుకుంటున్న శ్రీలీల ఫొటో చాలా మందిని ఆకట్టుకుంది. మరో వీడియోలో ఆమె పేరు పిలిచిన తర్వాత స్టేజ్‌పైకి వెళ్లి డిగ్రీ తీసుకుని కుటుంబ సభ్యులను ఆలింగనం చేసుకున్న దృశ్యాలు కనిపించాయి. అలాగే 2020 బ్యాచ్ విద్యార్థులతో కలిసి ఆనందంగా నవ్వుతూ కనిపించిన వీడియో కూడా వైరల్ అయింది.
DOCTOR SREELEELA
Actress @Sreeleela14 is now "DOCTOR SREELEELA", she has successfully completed her MBBS and graduated. pic.twitter.com/jFDehGxB14
— Filmy Tollywood (@FilmyTwoodOffl) February 11, 2026
సినిమాలతో పాటు మెడిసిన్ చదవడం ఎంత కష్టం అనే విషయం అందరికీ తెలిసిందే. ఆరు సంవత్సరాల పాటు చదివి ఇప్పుడు ఎంబీబీఎస్ పూర్తి చేయడం పట్ల అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. “బ్యూటీ విత్ బ్రెయిన్”, “ఇది చిన్న విషయం కాదు” అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ప్రైవేట్ మెడికల్ కాలేజీ అయినా కూడా కోర్సు కష్టం ఒకటే అని కొందరు అభిమానులు ఆమె కష్టాన్ని మెచ్చుకుంటున్నారు.
శ్రీలీల ఒక సందర్భంలో “ఒకసారి మా అమ్మమ్మ పడిపోయినప్పుడు ఏం చేయాలో నాకు తెలియలేదు. నా అన్నయ్య చిన్న చికిత్స చేసి ఆమెను మామూలు స్థితికి తీసుకువచ్చాడు. అప్పుడు నేనూ డాక్టర్ అవ్వాలని నిర్ణయించుకున్నాను” అని ఆమె చెప్పిన సంగతి తెలిసిందే.
2001లో అమెరికాలోని డెట్రాయిట్‌లో తెలుగు కుటుంబంలో జన్మించిన శ్రీలీల బెంగళూరులో పెరిగారు. ఆమె తల్లి స్వర్ణలత బెంగళూరులో గైనకాలజిస్ట్‌గా పని చేస్తున్నారు. చిన్నప్పటి నుంచే చదువులోనూ, కళలలోనూ ఆసక్తి చూపిన శ్రీలీల ఇప్పుడు రెండు రంగాల్లోనూ రాణిస్తున్నారు.
సినిమా విషయానికి వస్తే, ఆమె తొలిసారి 2017లో వచ్చిన తెలుగు చిత్రం ‘చిత్రాంగద’లో చిన్న పాత్రలో కనిపించారు. అయితే హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న మొదటి చిత్రం 2019లో వచ్చిన కన్నడ సినిమా ‘కిస్’. అదే ఏడాది ‘భరాటే’లో కూడా నటించారు. ఇటీవల ‘పుష్ప 2’లో వచ్చిన ‘కిస్సిక్’ పాటతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు.
ఇటీవల ఆమె నటించిన తమిళ చిత్రం ‘పరాశక్తి’ జనవరి 10, 2026న విడుదలైంది. ఇందులో ఆమె శివకార్తికేయన్ సరసన నటించారు. ఇక తెలుగులో పవన్ కళ్యాణ్‌తో కలిసి ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్‌లో కార్తిక్ ఆర్యన్‌తో ఓ సినిమాతో హిందీలో కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారు.
మొత్తానికి, నటిగా బిజీ షెడ్యూల్ మధ్యలోనే వైద్య విద్య పూర్తి చేసి డాక్టర్‌గా నిలిచిన శ్రీలీల ఇప్పుడు చాలా మందికి ప్రేరణగా మారారు..
Follow Us