/rtv/media/media_files/2025/10/28/sonal-chauhan-2025-10-28-12-55-58.jpg)
Sonal Chauhan
Sonal Chauhan: తెలుగు ప్రేక్షకులకు లెజెండ్, పండగ చేస్కో, సైజ్ జీరో వంటి సినిమాల ద్వారా బాగా తెలిసిన అందాల భామ సోనాల్ చౌహాన్ మళ్లీ వార్తల్లోకి వచ్చింది. ఈసారి ఆమె బాలీవుడ్‌లో ఓ భారీ ప్రాజెక్ట్‌లో కీలక పాత్రలో నటించబోతుంది. అమెజాన్ ప్రైమ్‌లో సంచలనం సృష్టించిన మీర్జాపూర్ వెబ్ సిరీస్ ఇప్పుడు సినిమాగా రూపుదిద్దుకుంటుండగా, అందులో సోనాల్ ముఖ్య పాత్రలో నటించనున్నారు.
ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. అయితే సోనాల్ కూడా తన సోషల్ మీడియాలో ఈ విషయాన్నీ పంచుకున్నారు. “ఇంత పెద్ద ప్రాజెక్ట్‌లో భాగమవడం నాకు చాలా సంతోషంగా ఉంది. మీర్జాపూర్: ది ఫిల్మ్ నా కెరీర్‌లో ఒక కొత్త మైలురాయి అవుతుంది. ఈ అవకాశాన్ని ఇచ్చిన దర్శకుడు, నిర్మాతలకు నా ధన్యవాదాలు” అంటూ ఆమె పేర్కొన్నారు.
ఈ సినిమాకు గుర్మీత్ సింగ్ దర్శకత్వం వహిస్తుండగా, ఫర్హాన్ అక్తర్, రితేశ్ సిధ్వానీ సంయుక్తంగా ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తున్నారు. ఇప్పటికే మూడు సీజన్లుగా అద్భుత విజయాన్ని సాధించిన మీర్జాపూర్ సిరీస్‌ను ఇప్పుడు పెద్ద తెరపై మరింత శక్తివంతంగా చూపించబోతున్నారు.
సిరీస్‌లో పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, దివ్యేందు, శ్వేతా త్రిపాఠి లాంటి నటులు చేసిన పాత్రలు ప్రేక్షకుల మనసుల్లో బలమైన గుర్తింపును పొందాయి. సినిమాగా తెరకెక్కుతున్న ఈ కొత్త వెర్షన్‌లో పాత తారాగణంతో పాటు జితేంద్ర కుమార్, రవి కిషన్, అలాగే సోనాల్ చౌహాన్ వంటి కొత్త నటులు కూడా చేరుతున్నారు.
ఈ చిత్రం కథ మీర్జాపూర్ ప్రాంతంలో జరిగే అధికార పోరాటాలు, గ్యాంగ్‌ల మధ్య జరిగే ప్రతీకార యుద్ధాలు, అండర్‌వర్ల్డ్ రాజకీయాల చుట్టూ తిరగనుందని సమాచారం. క్రైమ్, యాక్షన్, ఎమోషన్‌ల మేళవింపుతో ఈ సినిమా మరింత ఉత్కంఠభరితంగా తెరకెక్కుతోంది.
వచ్చే ఏడాదిలో థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతున్న మీర్జాపూర్: ది ఫిల్మ్ అభిమానులకు మరొక భారీ సర్‌ప్రైజ్ కానుంది. ఇక సోనాల్ చౌహాన్‌కి ఇది బోల్డ్, పవర్‌ఫుల్ రీ-ఎంట్రీగా నిలుస్తుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Follow Us