Sobhita: మోడల్ గా కెరీర్ మొదలు పెట్టిన శోభిత.. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే నటిగా గుర్తింపు తెచ్చుకుంది. 'గూఢచారి', 'కురుప్', 'మేజర్', 'పొన్నియిన్ సెల్వన్', 'లవ్సితార', 'ద నైట్ మేనేజర్' వంటి చిత్రాలు శోభితకు మంచి పేరును తెచ్చి పెట్టాయి. ఇటీవలే 'మంకీ మ్యాన్' మూవీతో హాలీవుడ్ లోనూ సత్తా చాటింది.
అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న శోభిత తన కెరీర్ కు సంబంధించి పలు విషయాలను పంచుకున్నారు. చిన్నప్పుడు తాను రాష్ట్రపతి దగ్గర చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్‌గా పనిచేయాలని కలలు కన్నానని. కానీ మిస్ ఇండియా పోటీల్లో పాల్గొన్నాక.. మోడలింగ్ ప్రయత్నించానని. అప్పుడు తాను తెల్లగా లేదని ఎందరో విమర్శించారని తెలిపింది. ఆడిషన్ కి వెళితే బ్యాక్ గ్రౌండ్ మోడల్ గా కూడా పనికిరావు అన్నారు. దాదాపు 100 ఆడిషన్ల తర్వాత 2016లో అనురాగ్ కశ్యప్ ‘రామన్ రాఘవ్ 2.0’లో అవకాశం వచ్చింది. దాంతో పాటు ఒకప్పుడు తనను రిజెక్ట్ చేసిన షాంపూ కంపెనీ.. తమ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండమని అడిగింది అంటూ తన కెరీర్ ప్రారంభ రోజులను గుర్తుచేసుకున్నారు శోభిత.
చెల్లి సమంత 'నా సోల్ మేట్'
అలాగే శోభిత తన చెల్లి సమంతతో తనకున్న అనుబంధం గురించి తెలియజేశారు. శోభిత మాట్లాడుతూ.. మా చెల్లి సమంత నా సోల్ మేట్.. ఈ మధ్యనే తన పెళ్లి కూడా అయ్యింది. పెళ్ళిలో అందంగా ముస్తాబై కూర్చున్న సమంతను చూసినప్పుడు నా కళ్ళు ఆనందంతో చెమ్మగిల్లాయి. నా జీవితంలోని కొన్ని మధుర క్షణాల్లో అదీ ఒకటి అంటూ చెల్లి సమంత పై తన ప్రేమను వ్యక్తపరిచారు. ఇది ఇలా ఉంటే త్వరలో శోభిత అక్కినేని నాగచైతన్యతో ఏడడుగులు వేయబోతున్నారు. ఇటీవలే కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య చైతన్య, శోభిత నిశ్చితార్థం చేసుకున్నారు. సమంతతో విడిపోయిన మూడు సంవత్సరాల తర్వాత చైతన్య శోభితను పెళ్లి చేసుకోబోతున్నారు.
Also Read: కోమాలో ఉన్నప్పుడు పీరియడ్స్ వస్తాయా? షాకింగ్ విషయాలు