Actress Sharada: సీనియర్ నటి శారదకు ప్రతిష్ఠాత్మక అవార్డు

ప్రముఖ నటి శారదకు మలయాళ చిత్ర పరిశ్రమకు చేసిన సేవలకు గాను కేరళ ప్రభుత్వ అత్యున్నత సినీ పురస్కారం జేసీ డేనియల్ అవార్డు-2024 లభించింది. జనవరి 25న ఈ అవార్డును సీఎం పినరయి విజయన్ ఆమెకు అందజేస్తారు.

New Update
Actress Sharada

Actress Sharada

Actress Sharada: ప్రముఖ నటి శారదకు కేరళ ప్రభుత్వం అరుదైన గౌరవాన్ని ప్రకటించింది. మలయాళ చిత్ర పరిశ్రమకు ఆమె చేసిన దీర్ఘకాల సేవలను గుర్తిస్తూ, కేరళ ప్రభుత్వ అత్యున్నత సినీ పురస్కారమైన జేసీ డేనియల్ అవార్డు(JC Daniel Award)-2024కు ఆమెను ఎంపిక చేశారు. ఈ విషయాన్ని కేరళ సాంస్కృతిక వ్యవహారాల శాఖ అధికారికంగా వెల్లడించింది.

జేసీ డేనియల్ అవార్డు కేరళలో సినిమారంగంలో అత్యంత గౌరవంగా భావించే అవార్డు. ఈ పురస్కారం కింద శారదకు రూ.5 లక్షల నగదు బహుమతి, ప్రశంసా పత్రం, జ్ఞాపిక అందజేయనున్నారు. జనవరి 25న తిరువనంతపురంలో జరిగే కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ చేతుల మీదుగా ఈ అవార్డును శారద స్వీకరించనున్నారు.

ఈ అవార్డు కోసం ఎంపిక చేసిన కమిటీలో ప్రముఖ నటి ఊర్వశి, నిర్మాత బాలు కిరియత్ సభ్యులుగా ఉన్నారు. కేరళ రాష్ట్ర చలనచిత్ర అకాడమీ కార్యదర్శి సి. అజోయ్ ఈ కమిటీకి కన్వీనర్‌గా వ్యవహరించారు.

శారద ఆంధ్రప్రదేశ్‌లోని తెనాలి పట్టణంలో 1945 జూన్ 25న జన్మించారు. ఆమె తండ్రి వెంకటేశ్వరరావు, తల్లి సత్యవాణి దేవి. శారద అసలు పేరు సరస్వతీ దేవి. చిన్న వయసులోనే నటనపై ఆసక్తి పెంచుకున్న ఆమె, తెలుగు సినిమా ‘ఇద్దరు మిత్రులు’ చిత్రంతో సినీ రంగంలో అడుగుపెట్టారు. ఆ తర్వాత తన పేరు సరస్వతీ దేవి నుంచి శారదగా మార్చుకున్నారు.

1965లో విడుదలైన ‘ఇణప్రావుకళ్’ సినిమా ద్వారా ఆమె మలయాళ చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించారు. ఆ తర్వాత అనేక గొప్ప సినిమాల్లో నటించి ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు. ముఖ్యంగా ‘తులాభారం’ (1968) సినిమా ఆమెకు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చింది. ఈ చిత్రానికి ఆమె జాతీయ ఉత్తమ నటి అవార్డును అందుకున్నారు.

1972లో ప్రముఖ దర్శకుడు అదూర్ గోపాలకృష్ణన్ తెరకెక్కించిన ‘స్వయంవరం’ సినిమాకు గానూ మరోసారి జాతీయ ఉత్తమ నటి అవార్డు దక్కింది. అంతేకాదు, తెలుగు సినిమా ‘నిమజ్జనం’ (1977) ద్వారా మూడోసారి జాతీయ ఉత్తమ నటి అవార్డు పొందిన తొలి నటిగా చరిత్ర సృష్టించారు.

తెలుగు, మలయాళ, తమిళం, కన్నడ భాషల్లో అనేక సినిమాల్లో నటించిన శారద, తన సహజ నటనతో ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించారు. ఇప్పుడు జేసీ డేనియల్ అవార్డు రావడం ఆమె సినీ జీవితానికి మరో గొప్ప గుర్తింపుగా నిలిచింది.

Advertisment
తాజా కథనాలు