Raju Weds Rambai: ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాకు అవార్డుల పంట.. డైరెక్టర్ సాయిలు కంపాటి బ్యాక్‌గ్రౌండ్ తెలిస్తే ..!

‘రాజు వెడ్స్ రాంబాయి’ చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయాన్ని సాధించింది. దర్శకుడు సాయిలు కంపాటి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.10 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్‌లో ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు అవార్డులు కూడా గెలుచుకుంది.

New Update
Raju Weds Rambai

Raju Weds Rambai

Raju Weds Rambai: చిన్న సినిమాగా విడుదలైన ‘రాజు వెడ్స్ రాంబాయి’ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. కొత్త దర్శకుడు సాయిలు కంపాటి తెరకెక్కించిన ఈ చిత్రంలో అఖిల్ రాజ్, తేజస్విని హీరో హీరోయిన్లుగా నటించారు. నవంబర్ 21న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు సాధించి సూపర్ హిట్‌గా నిలిచింది. చాలా తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం కేవలం కొన్ని రోజుల్లోనే రూ.10 కోట్లకు పైగా వసూళ్లు సాధించి నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టింది.

నిజ సంఘటన ఆధారంగా సినిమా

ఈ సినిమా కథ ఖమ్మం జిల్లా ఇల్లెందులో 2004లో జరిగిన ఒక నిజ సంఘటన ఆధారంగా రూపొందిందని దర్శకుడు సాయిలు తెలిపారు. ఆ సమయంలో తాను చిన్నవాడినని, కానీ ఆ కథ గురించి తన కుటుంబంలో పెద్దలు మాట్లాడుకునేవారని చెప్పారు. ముఖ్యంగా తన పెదనాన్న నక్సలైట్‌గా ఉండటంతో ఆ వాతావరణం తనపై ప్రభావం చూపిందని తెలిపారు. ఆ కథను బయటకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ సినిమాను తెరకెక్కించినట్టు చెప్పారు.

గ్రామీణ కథలపై ఆసక్తి

సాయిలు తనకు గ్రామాల్లో జరిగే నిజ జీవిత కథలంటే చాలా ఇష్టమని అన్నారు. రైతులు, ఆటో డ్రైవర్లు, కాలేజీ యువత మధ్య జరిగే సాధారణ ప్రేమ కథలు తనకు దగ్గరగా ఉంటాయని చెప్పారు. పెద్ద పెద్ద యాక్షన్ సీన్ల కథల కంటే గ్రామీణ జీవితం గురించి చెప్పడం తనకు ఈజీగా ఉంటుందని అన్నారు.

నెగిటివ్ టాక్ వస్తే అమీర్‌పేట్‌లో అర్ధనగ్నంగా తిరుగుతా 

అప్పట్లో సినిమా విడుదలకు ముందు సాయిలు చేసిన ఒక కామెంట్ కూడా వైరల్ అయ్యింది. “ఈ సినిమాకు నెగిటివ్ టాక్ వస్తే అమీర్‌పేట్ సెంటర్‌లో అర్ధనగ్నంగా తిరుగుతా” అని ఆయన సరదాగా చెప్పారు. అయితే సినిమా మంచి హిట్ కావడంతో ఆయన అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు.

అమీర్‌పేట్‌లో డప్పు వాయించిన దర్శకుడు

సినిమా విజయం తర్వాత దర్శకుడు సాయిలు హైదరాబాద్ అమీర్‌పేట్‌లో సందడి చేశారు. ఏషియన్ సత్యం మాల్ ఎదుట డప్పు వాయిస్తూ ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. “హిట్ అడిగితే మీరు బ్లాక్‌బస్టర్ ఇచ్చారు. మీకు ధన్యవాదాలు” అంటూ ఆయన ఆనందం వ్యక్తం చేశారు. అక్కడ యువకులు కూడా ఆయనతో కలిసి డ్యాన్స్ చేయడంతో థియేటర్ దగ్గర వాతావరణం ఒక్కసారిగా ఉత్సాహంగా మారింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్‌లో సత్తా

ఇవాళ తాజాగా ప్రకటించిన తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ లో కూడా ఈ సినిమాకు మంచి గుర్తింపు లభించింది. ఈ చిత్రానికి ఉత్తమ చిత్రం అవార్డు లభించింది. అలాగే దర్శకుడు సాయిలు కంపాటి ఉత్తమ దర్శకుడు అవార్డు అందుకున్నారు. ఈ సినిమా పాటకు అనురాగ్ ఉత్తమ గాయకుడిగా ఎంపికయ్యారు.

ఈ అవార్డుల్లో నాగచైతన్య ఉత్తమ నటుడిగా, రష్మిక మందన్న ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. ఎన్టీఆర్ నేషనల్ అవార్డు చిరంజీవికి ఇవ్వగా, సినారె అవార్డు సుద్దాల అశోక్ తేజకు లభించింది. పైడి జయరాజ్ అవార్డు కమల్ హాసన్‌కు అందింది.

మొత్తంగా చిన్న సినిమాగా వచ్చిన ‘రాజు వెడ్స్ రాంబాయి’ ప్రేక్షకుల ప్రేమతో పెద్ద విజయాన్ని సాధించింది. దర్శకుడు సాయిలు కంపాటి తన ప్రత్యేకమైన కథతో టాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు సంపాదించారు.

Advertisment
తాజా కథనాలు