/rtv/media/media_files/2026/01/06/rajasaab-ticket-bookings-2026-01-06-16-24-08.jpg)
Rajasaab Ticket Bookings
Rajasaab Ticket Bookings: ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా పెద్ద హీరోల సినిమాలు ఎక్కువ నిడివితోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ విషయంలో రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) ఎప్పటినుంచో ముందంజలో ఉన్నారు. ‘బాహుబలి’ తర్వాత ఆయన చేసిన సినిమాలన్నీ దాదాపు మూడు గంటల నిడివితోనే విడుదలయ్యాయి. ఇప్పుడు అదే బాటలో ఆయన కొత్త సినిమా ‘ది రాజాసాబ్’ కూడా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.
యువ దర్శకుడు మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హారర్- ఫాంటసీ థ్రిల్లర్ సినిమా జనవరి 9, 2026న సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే ఈ సినిమా సెన్సార్ ప్రక్రియను పూర్తిచేసుకుంది. తాజాగా బయటకు వచ్చిన సమాచారం ప్రకారం, ఈ సినిమా మొత్తం నిడివి 3 గంటల 9 నిమిషాలుగా ఖరారు చేశారు. ప్రేక్షకులను పూర్తిగా కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లేలా కథను రూపొందించారని చిత్ర బృందం చెబుతోంది. అయితే సినిమాలో ఉన్న ఒక తల నరికే సన్నివేశానికి సెన్సార్ బోర్డు కట్ సూచించినట్లు సమాచారం.
సినిమా విడుదలకు ముందే ప్రత్యేక ప్రీమియర్ షోలకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. జనవరి 9న సినిమా రిలీజ్ కాగా, జనవరి 8న రాత్రి స్పెషల్ ప్రీమియర్స్ నిర్వహించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలకు అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణలో ఉదయం 4 గంటల షోకు కూడా అనుమతి ఇవ్వాలని కోరారు. అలాగే టికెట్ ధరలు పెంచుకునేందుకు కూడా అనుమతి కోరారు.
స్పెషల్ ప్రీమియర్ షోలకు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.800, మల్టీప్లెక్స్‌లలో రూ.1000 వరకు టికెట్ ధరలు నిర్ణయించేందుకు అనుమతి అడిగారు. అలాగే జనవరి 9 నుంచి 11 వరకు, తరువాతి రోజుల్లో కూడా వేర్వేరు తేదీలకు టికెట్ ధరలు పెంచుకునేలా విజ్ఞప్తి చేశారు. దీనిపై సినిమాటోగ్రఫీ శాఖ అధికారులు త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు. అధికారిక ప్రకటన వచ్చిన వెంటనే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.
ఈ సినిమాలో ప్రభాస్‌కు జంటలుగా మాళవిక మోహనన్, రిద్ధి కుమార్, నిధి అగర్వాల్ నటిస్తున్నారు. ప్రధాన ప్రతినాయకుడి పాత్రలో సంజయ్ దత్ కనిపించనున్నారు. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. సంగీత దర్శకుడు తమన్ అందించిన పాటలు ఇప్పటికే యువతలో మంచి క్రేజ్‌ను తెచ్చుకున్నాయి.
ఇటీవల సెన్సార్ బోర్డ్ ఈ సినిమాకు U/A సర్టిఫికెట్ జారీ చేసింది. కొన్ని సన్నివేశాలు, డైలాగ్స్‌లో చిన్న మార్పులు సూచించగా, చిత్ర బృందం వెంటనే వాటిని పూర్తి చేసింది. దింతో ఎలాంటి అభ్యంతరాలు లేకుండా ఈ సినిమాకు UA16+ సర్టిఫికెట్ జారీ చేశారు. అంటే 16 ఏళ్లు పైబడినవారు చూడవచ్చు. 16 ఏళ్లలోపు వారు మాత్రం తల్లిదండ్రుల పర్యవేక్షణలో చూడాల్సి ఉంటుంది.
మొత్తానికి, భారీ నిడివి, హారర్- ఫాంటసీ అంశాలు, ప్రభాస్ కొత్త లుక్‌తో ‘ది రాజాసాబ్’ ఈ సంక్రాంతికి ప్రేక్షకులకు ఒక ప్రత్యేక అనుభూతిని ఇవ్వబోతున్న సినిమా గా నిలవనుంది.
Follow Us