Rajasaab Piracy: 'రాజాసాబ్'ను వెంటాడుతున్న సమస్యలు.. ఆన్‌లైన్‌లో HD ప్రింట్ లీక్..

ప్రభాస్ ‘ది రాజాసాబ్‌’ సినిమాను వరుస సమస్యలు వెంటాడుతున్నాయి. టికెట్ ధరల పెంపు మెమోను హైకోర్టు రద్దు చేయగా, మరో వైపు 24 గంటల్లోనే సినిమా HD ప్రింట్ ఆన్‌లైన్‌లో లీక్ అయింది. దీంతో నిర్మాతలు ఆందోళన చెందుతున్నారు.

New Update
Rajasaab Piracy

Rajasaab Piracy

Rajasaab Piracy: డార్లింగ్ ప్రభాస్‌(Prabhas) నటించిన ‘ది రాజాసాబ్‌’ సినిమాకు విడుదలైన వెంటనే వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా, 24 గంటలు గడవకముందే ఆన్‌లైన్‌లో HD ప్రింట్‌గా లీక్ కావడం చిత్రబృందాన్ని తీవ్రంగా కలవరపెడుతోంది. ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో సహా మంచి క్వాలిటీ ప్రింట్ ఇంటర్నెట్‌లో అందుబాటులోకి రావడం వల్ల థియేటర్ల కలెక్షన్లపై ప్రభావం పడే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

సినిమా విడుదలకు ముందు నుంచే టికెట్ ధరల పెంపు అంశం వివాదంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం టికెట్ ధరలు పెంచేందుకు అనుమతి ఇస్తూ హోంశాఖ ద్వారా మెమో విడుదల చేసింది. దీనిపై న్యాయవాది విజయ్ గోపాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా టికెట్ ధరలు పెంచేందుకు అనుమతి ఇచ్చారని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. జిల్లా స్థాయిలో కలెక్టర్లు, హైదరాబాద్‌లో సీపీ మాత్రమే టికెట్ ధరల పెంపు లేదా బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వాల్సి ఉంటుందని వివరించారు.

ఈ పిటిషన్‌పై విచారణ చేసిన హైకోర్టు, టికెట్ ధరల పెంపునకు అనుమతిస్తూ హోంశాఖ జారీ చేసిన మెమోను కొట్టేసింది. ఈ సందర్భంగా కోర్టు అధికార యంత్రాంగంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇప్పటికే టికెట్ ధరలు పెంచబోమని సంబంధిత మంత్రి ప్రకటించారని, అయినా ఎందుకు ఇలాంటి మెమోలు జారీ చేస్తున్నారని ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది. ఎన్నిసార్లు చెప్పినా ప్రభుత్వ ఆలోచన ఎందుకు మారడం లేదంటూ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. చివరకు మెమోను రద్దు చేస్తూ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.

HD ప్రింట్‌ లీక్.. (Rajasaab HD Print Leaked Online)

ఈ వ్యవహారంతో సినిమా టీమ్ ఒక్క దెబ్బ తేరుకోకముందే, ఇప్పుడు పైరసీ రూపంలో మరో పెద్ద సమస్య ఎదురైంది. థియేటర్లలో సినిమా చూస్తున్న సమయంలోనే, ఆన్‌లైన్ సైట్లలో పూర్తి సినిమా HD ప్రింట్‌గా లభించడంతో నిర్మాతలకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని భావిస్తున్నారు. పైరసీ కారణంగా ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లకుండా ఇంట్లోనే సినిమా చూసే పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తమవుతోంది.

ఈ ఘటనపై మూవీ టీమ్ తీవ్రంగా స్పందిస్తోంది. పైరసీని అరికట్టాలని, సంబంధిత వెబ్‌సైట్లపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతోంది. మరోవైపు ప్రభాస్ అభిమానులు కూడా పోలీసులకు ఫిర్యాదులు చేస్తూ, సినిమా లింక్‌లను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా పైరసీకి వ్యతిరేకంగా పోస్టులు పెడుతూ అవగాహన కల్పిస్తున్నారు.

‘ది రాజాసాబ్‌’ సినిమా విడుదలైన తొలి రోజుల్లోనే టికెట్ ధరల వివాదం, కోర్టు తీర్పు, ఆన్‌లైన్ లీక్ వంటి సమస్యలు ఎదుర్కొంటోంది. అయినా కూడా సినిమా మంచి కలెక్షన్లతో ముందుకు సాగాలని, పైరసీ ప్రభావం తగ్గాలని చిత్రబృందం ఆశిస్తోంది. ప్రేక్షకులు థియేటర్లలోనే సినిమా చూడాలని నిర్మాతలు విజ్ఞప్తి చేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు