/rtv/media/media_files/2025/11/24/rebel-saab-song-2025-11-24-11-21-54.jpg)
Rebel Saab Song
Rebel Saab Song: ప్రభాస్(Prabhas) ‘ది రాజా సాబ్’(Raja Saab) నుండి ఫస్ట్ సింగిల్ ‘రెబల్ సాబ్’ ఆదివారం విడుదలైంది. ఈ పాట రిలీజ్ కోసం హైదరాబాద్‌లోని విమల్ థియేటర్‌లో ప్రత్యేక ఫ్యాన్ ఈవెంట్ కూడా నిర్వహించారు. చాలా కాలం తర్వాత ప్రభాస్ మళ్లీ మాస్ డ్యాన్స్ చేస్తూ కనిపించడం అభిమానులకు పెద్ద పండగలా మారింది.
విమల్ థియేటర్‌లో జరిగిన ఈ కార్యక్రమం ఒక వేడుకలా మారింది. బిగ్ స్క్రీన్‌పై పాట వీడియో రాగానే ఫ్యాన్స్ అందరూ ప్రభాస్ ఫ్లాగ్లు ఊపుతూ, “రెబల్ స్టార్ ప్రభాస్” అంటూ నినాదాలు చేయడంతో థియేటర్ అంతా సందడి వాతావరణం నెలకొంది. థియేటర్ బయట కూడా ప్రభాస్ అభిమానులు డాన్సులతో సందడి చేసారు.
ఈ ఈవెంట్‌కు చిత్ర దర్శకుడు మారుతి, నిర్మాతలు టీ.జీ. విశ్వ ప్రసాద్, వివేక్ కుచిబొట్ల, ఇషాన్ సక్సేనా, సినిమాటోగ్రాఫర్ కూడా హాజరయ్యారు. తమన్ ఎస్ కంపోజ్ చేసిన ఈ పాటలో మాస్ బీట్స్, ఎనర్జిటిక్ మ్యూజిక్ రంగు, రంగుల విజువల్స్ ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచాయి. తమన్ మాట్లాడుతూ, ఈ పాటను ప్రభాస్‌కు అంకితం చేసినట్టు చెప్పారు.
‘రెబల్ సాబ్’ అనేది ప్రభాస్ గారికి మా గౌరవం. ఆయన స్క్రీన్‌పై కనిపించిన ప్రతిసారీ ఉండే ఆ స్టైల్, ఆ స్వాగ్ ఈ పాటలో చూపాలని అనుకున్నాం. ఇది సాధారణ పాట కాదు, ప్రభాస్ అభిమానులకు ఒక బెస్ట్ మెమరీ లాంటి పాట కావాలి. ‘ది రాజా సాబ్’ కథలో ఉన్న ఆ రాజసంతోపాటు అభిమానులు ఇష్టపడే మాస్ ఫీల్ రెండింటినీ కలపడానికి ప్రయత్నించాం” అని అన్నారు.
పాటలో ప్రభాస్ పాత సినిమాలకు సంబంధించిన కొన్ని ఫొటోస్ ఉండటంతో, చాలామంది అభిమానులు పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. ఆయన డాన్స్, ఎక్స్ప్రెషన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ ఈ పాటను మరింత ప్రత్యేకంగా మార్చాయి.
పాట విడుదలతో సినిమాపై ఉన్న ఆసక్తి కూడా మరింత పెరిగింది. సోషల్ మీడియాలో ఈ సింగిల్‌కు భారీ స్పందన వస్తోంది. ఇప్పటికే వీడియోకు లక్షలాది వ్యూస్ వస్తుండగా, అభిమానులు ఇది ప్రభాస్‌కు మరో భారీ హిట్ అవుతుందని అంటున్నారు.
‘ది రాజా సాబ్’ సినిమాను మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఐవై ఎంటర్టైన్‌మెంట్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్‌తో పాటు మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, సంజయ్ దత్, బోమన్ ఇరానీ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
ఈ చిత్రం జనవరి 9న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది. హారర్ మాస్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా ప్రభాస్ అభిమానులకు కొత్త సంవత్సరం సంక్రాంతి కానుకలా ఉండబోతోంది.
Follow Us