/rtv/media/media_files/2025/10/29/baahubali-trailer-2025-10-29-07-34-16.jpg)
Baahubali Trailer
Baahubali Trailer: ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ సృష్టించిన ‘బాహుబలి’ మళ్లీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. “బాహుబలి: ది ఎపిక్” పేరుతో ఈ సినిమా అక్టోబర్ 31, 2025న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. బాహుబలి 1, బాహుబలి 2 చిత్రాలను కలిపి ఒకే సినిమా రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్లు ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి రేకెత్తించాయి. అయితే కొత్తగా రిలీజ్ ట్రైలర్ 2 పేరుతో మరో ట్రైలర్ కట్ ను రిలీజ్ చేసారు మేకర్స్.. అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఈ ట్రైలర్ ఆడియన్స్ ను ఆకట్టుకొంటుంది.
సినిమా రిలీజ్‌కు ఇంకా ఒక్కరోజే ఉన్న తరుణంలో ఇప్పటికే ఫ్యాన్స్‌లో ఉత్సాహం ఉరకలు వేస్తోంది. హైదరాబాద్, బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లో టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేసిన 24 గంటల్లోనే 61 వేల టికెట్లు అమ్ముడవడం రికార్డ్ గా నిలిచింది.
అమెరికాలోను భారీ క్రేజ్..
భారతదేశంతో పాటు అమెరికాలో కూడా ఈ సినిమాపై విపరీతమైన హైప్ నెలకొంది. అక్కడ ప్రీమియర్ షోల ద్వారానే ఒక మిలియన్ డాలర్లకు పైగా కలెక్షన్ వచ్చే అవకాశం ఉందని అంచనా. తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, ఉత్తర రాష్ట్రాల్లో కూడా టికెట్ బుకింగ్స్ వేగంగా జరుగుతున్నాయి. అనేక చోట్ల టికెట్లు దొరకడం కష్టమవుతున్నట్లు అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
ఈ ప్రత్యేక వెర్షన్‌లో ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి, తమన్నా భాటియా మరోసారి తమ పాత్రల్లో కనిపించనున్నారు. బాహుబలి కథ, యుద్ధ సన్నివేశాలు, విజువల్ ఎఫెక్ట్స్ మళ్లీ థియేటర్ అనుభూతిని కొత్త స్థాయికి తీసుకెళ్తాయని అంచనా. సంగీతం అందించిన ఎం.ఎం. కీరవాణి స్వరాలు థియేటర్లను మళ్లీ మార్మోగించనున్నాయి. ఈ ప్రత్యేక వెర్షన్ రన్‌టైమ్ సుమారు 3 గంటల 45 నిమిషాలుగా ఉంటుంది.
బాహుబలి 3 వస్తుందా?
బాహుబలి సిరీస్ సినిమాలు తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి చేర్చిన ప్రాజెక్టులుగా నిలిచాయి. దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన ఈ రెండు భాగాలు భారతదేశంలోనే కాదు, విదేశాల్లో కూడా అద్భుత రికార్డులు సృష్టించాయి. అభిమానులు ఇప్పుడు మూడో భాగం వస్తుందా అనే ప్రశ్నతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే రాజమౌళి ఇప్పటివరకు దీనిపై ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు.
మొత్తానికి, “బాహుబలి: ది ఎపిక్” మరోసారి ప్రేక్షకులకు ఆ విజువల్ మేజిక్‌ను చూపించడానికి సిద్ధమైంది. దాదాపు 10 ఏళ్ల తర్వాత బాహుబలి థియేటర్లలో మళ్లీ సందడి చేయడం సినిమా అభిమానులకు పండగలా మారింది.
Follow Us