O Torture Prema: హీరోగా ఎంట్రీ ఇస్తున్న ఎర్రన్న వారసుడు.. ‘ఓ టార్చర్ ప్రేమ’ టైటిల్ పోస్టర్ రిలీజ్

మాదాల రంగారావు మనవడు, మాదాల రవి కుమారుడు సన్నీ మాదాల హీరోగా పరిచయం అవుతున్న సినిమా ‘ఓ టార్చర్ ప్రేమ’. శ్రీకర్ కృష్ణ దర్శకత్వం వహిస్తూ నిర్మించిన ఈ ప్రేమకథ టైటిల్ పోస్టర్‌ను పరుచూరి గోపాలకృష్ణ విడుదల చేశారు.

New Update
O Torture Prema

O Torture Prema

O Torture Prema: టాలీవుడ్‌లోకి మరో కొత్త హీరో అడుగుపెడుతున్నాడు. విప్లవ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న మాదాల రంగారావు(Madala Ranga Rao) మనవడు, నటుడు మాదాల రవి(Madala Ravi) కుమారుడు సన్నీ మాదాల(Sunny Madala) హీరోగా పరిచయం అవుతున్న సినిమా ‘ఓ టార్చర్ ప్రేమ’. ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ పోస్టర్‌ను ప్రముఖ రచయిత, దర్శకుడు పరుచూరి గోపాలకృష్ణ తాజాగా విడుదల చేశారు.

ఈ సినిమాను శ్రీకరం ప్రొడక్షన్స్ బ్యానర్‌పై శ్రీకర్ కృష్ణ దర్శకత్వం వహిస్తూ స్వయంగా నిర్మిస్తున్నారు. టైటిల్ పోస్టర్ లాంచ్ సందర్భంగా పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ, మాదాల కుటుంబం నుంచి మూడో తరం హీరోగా సన్నీ రావడం ఆనందంగా ఉందన్నారు. తాత, తండ్రి ఇద్దరూ విప్లవ కథలతో గుర్తింపు పొందితే, సన్నీ మాత్రం ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు రావడం ఆసక్తికరంగా ఉందని చెప్పారు. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరారు.

దర్శకుడు శ్రీకర్ కృష్ణ మాట్లాడుతూ, ‘ఓ టార్చర్ ప్రేమ’ ఒక స్వచ్ఛమైన ప్రేమకథ అని తెలిపారు. సినిమాలో వినోదంతో పాటు ఎమోషనల్ సన్నివేశాలు కూడా ఉంటాయని చెప్పారు. ప్రేమలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ కథ కనెక్ట్ అవుతుందని ఆయన అన్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయ్యిందని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని వెల్లడించారు.

ఈ సినిమాలో మౌనిక డాకోజు హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. అలాగే రాజీవ్ కనకాల, వడ్లమాని సాయి శ్రీనివాస్, శ్రీవాణి, జబర్దస్త్ రోహిణి, నాగి, సిద్ధార్థ్ వర్మ, విష్ణు ప్రియ, యాదమ్మ రాజు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఇషాక్ వలి సంగీతం అందిస్తున్నారు.

విప్లవ చిత్రాలతో తెలుగు సినిమాకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన మాదాల రంగారావు వారసత్వాన్ని కొనసాగిస్తూ, ఇప్పుడు ఆయన మనవడు సన్నీ మాదాల ప్రేమకథతో హీరోగా ఎంట్రీ ఇవ్వడం సినీ వర్గాల్లో ఆసక్తిని కలిగిస్తోంది. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisment
తాజా కథనాలు