Karthika Deepam DJ Song: "ఆరనీకుమా ఈ దీపం.. కార్తీక దీపం" రవితేజ స్టెప్పులతో దద్దరిల్లిన థియేటర్లు!

ఒకప్పుడు టీవీ సీరియల్ పాటగా ఫేమస్ అయిన ‘ఆరనీకుమా ఈ దీపం కార్తీకదీపం’ ఇప్పుడు సినిమాల్లో మాస్ పాటగా మారింది. చిరంజీవి, రవితేజ సినిమాల్లో వినిపిస్తూ థియేటర్లలో హంగామా చేస్తోంది. అసలు ఇది శోభన్ బాబు 1979 సినిమా పాట అనే విషయం చాలా మందికి తెలియదు.

New Update
Karthika Deepam DJ Song

Karthika Deepam DJ Song

Karthika Deepam DJ Song: ఒకప్పుడు టీవీ సీరియల్స్ అంటే చాలా మంది తేలిగ్గా తీసుకునేవారు. సినిమాల్లో కూడా సీరియల్స్‌ని కామెడీగా చూపిస్తూ పేరడీలు చేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. సీరియల్స్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా మహిళా ప్రేక్షకులు సీరియల్స్‌తో బాగా కనెక్ట్ అయిపోయారు. ఆ ప్రభావం ఇప్పుడు సినిమాల మీద కూడా స్పష్టంగా కనిపిస్తోంది. తాజాగా థియేటర్లలో వినిపిస్తున్న ఒక పాట దీనికి మంచి ఉదాహరణ.

‘ఆరనీకుమా ఈ దీపం… కార్తీకదీపం’. ఈ పాట వినగానే చాలా మందికి వెంటనే గుర్తొచ్చేది టీవీ సీరియల్ ‘కార్తీకదీపం’. 2017 అక్టోబర్ 16న మొదలైన ఈ సీరియల్, ఇప్పటికీ స్టార్ మా ఛానల్‌లో కొనసాగుతూనే ఉంది. ప్రతి ఎపిసోడ్ మొదలయ్యే ముందు వచ్చే ఈ పాట తెలుగు ఇళ్లలో రోజూ వినిపిస్తూనే ఉంది. ఎంతగా అంటే, ఈ పాట వింటే చాలు “వంటలక్క”, “కార్తీక్ బాబు” గుర్తుకు వస్తారు.

ఇటీవల సంక్రాంతికి విడుదలైన చిరంజీవి సినిమా ‘మన శంకర వరప్రసాద్ గారు’లో దర్శకుడు అనిల్ రావిపూడి సీరియల్స్‌పై ఓ ఫన్నీ సీన్ పెట్టారు. చిరంజీవి సీరియల్ చూస్తూ ఎమోషన్ అవడం, ప్రతి ఎపిసోడ్‌ను ఫాలో అవడం చూపించి థియేటర్లలో నవ్వులు పూయించారు. సీరియల్స్‌కు మహిళలు ఎంతగా కనెక్ట్ అయ్యారో ఈ సీన్ బాగా చూపించింది. ఆ సీన్ లో ‘కార్తీకదీపం’ పాట వినిపించడంతో ప్రేక్షకులకు ఇంకా బాగా కనెక్ట్ అయింది.

ఇక మాస్ రాజా రవితేజ నటించిన ‘భక్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమాలో అయితే ఈ పాటకు అసలు మాస్ టచ్ ఇచ్చారు. ‘ఆరనీకుమా ఈ దీపం… కార్తీకదీపం’ పాటకు రవితేజ మాస్ స్టెప్పులు వేయడంతో థియేటర్లు దద్దరిల్లాయి. పాట వచ్చినప్పుడల్లా ప్రేక్షకులు చప్పట్లు కొడుతూ, డ్యాన్సులు వేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. సినిమాలో వేరే పాటలు ఉన్నా, ఈ పాటకు వచ్చిన రెస్పాన్స్ మాత్రం ప్రత్యేకం.

ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, చాలా మందికి ఈ పాట అసలు ఒక పాత సినిమాదని కూడా తెలియదు. నిజానికి ఈ పాట 1979లో విడుదలైన ‘కార్తీకదీపం’ అనే సినిమాలోది. శోభన్ బాబు హీరోగా నటించిన ఈ సినిమాలో శ్రీదేవి, శారద హీరోయిన్లు. సత్యం సంగీతం అందించిన ఈ పాటను పి. సుశీల, ఎస్. జానకి పాడారు. ఆ సినిమాలో ఈ పాట చాలా సింపుల్‌గా ఉంటుంది. శారద, శ్రీదేవి కొలనులో దీపాలు వదులుతూ, హావభావాలతో మాత్రమే నటించారు. డ్యాన్స్ స్టెప్పులు లేకుండానే పాటకు ప్రాణం పోశారు.

అదే పాట ఇప్పుడు రీమిక్స్ అయ్యి, మాస్ సినిమాల్లో ఊపు తెచ్చింది. భీమ్స్ సంగీతంతో ఈ పాటకు కొత్త ఎనర్జీ వచ్చింది. ఒకప్పుడు బుల్లితెరలో వినిపించిన పాట ఇప్పుడు థియేటర్లలో ప్రేక్షకులను ఉత్సాహపరుస్తోంది. మొత్తానికి, సీరియల్ పాటగా ఫేమస్ అయిన ‘కార్తీకదీపం’ ఇప్పుడు సినిమాల్లోనూ రీ సౌండ్ చేస్తూ మళ్లీ ట్రెండ్ అవుతోంది.

Advertisment
తాజా కథనాలు