Jagadeka Veerudu Athiloka Sundari Re Release Collections:
తెలుగు సినీ ఇండస్ట్రీలో గత కొంతకాలంగా రీ-రిలీజ్ ట్రెండ్ బాగా పుంజుకుంది. పాత క్లాసికల్ హిట్లను మళ్లీ తెరపైకి తీసుకురావడం ద్వారా క్యాష్ చేసుకోవాలని నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ ప్రయత్నాలు అన్నీ విజయవంతమవుతాయా అంటే, పరిస్థితి అంత సానుకూలంగా లేదు. భారీ అంచనాల మధ్య మళ్లీ విడుదలైన కొన్ని సినిమాలు ఆశించినంత ఆదరణ అందుకోలేక డిసాపాయింట్ చేశాయి.
ఈ క్రమంలో తెలుగు ఫాంటసీ సినిమాల్లో ఒక మైలురాయిగా నిలిచిన "జగదేక వీరుడు అతిలోక సుందరి" ఇటీవల రీ-రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. చిరంజీవి - శ్రీదేవి జంటగా నటించిన ఈ మూవీకి కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించగా, వైజయంతి మూవీస్ అధినేత సి. అశ్వినీదత్ నిర్మించారు. 1990లో విడుదలైన ఈ చిత్రం ట్రెండ్ సెట్ చేసిన బ్లాక్‌బస్టర్.
అయితే, తాజా రీ-రిలీజ్ కోసం నిర్మాతలు చేసిన ఖర్చు అసలు చిత్ర బడ్జెట్ కంటే బాగా ఎక్కువైంది. అప్పట్లో 2 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ సినిమాకు రీ-రిలీజ్ కి దాదాపు 9 కోట్లు ఖర్చైనట్లు అశ్వినీదత్ స్వయంగా వెల్లడించారు. కొత్త టెక్నాలజీతో విజువల్స్ మెరుగుపరచడం, ప్రమోషన్, థియేట్రికల్ ఎక్సపాన్షన్ అన్ని కలిపి భారీగా ఖర్చయ్యింది.
మొదటి రోజు మాత్రం ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. మొదటి రోజు దాదాపు రూ. 1.5 కోట్లు వసూలు చేసింది. కానీ, ఆ ఉత్సాహం కొనసాగకపోవడం బాధాకరం. రెండో రోజు నుంచే కలెక్షన్లు తగ్గుముఖం పట్టాయి. ఐదు రోజుల్లో మొత్తంగా ఈ సినిమా రూ. 2.84 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఇందులో తెలుగు రాష్ట్రాల్లో రూ. 2.3 కోట్లు, మిగతా ప్రాంతాల్లో 54 లక్షలు వచ్చాయి.
రెండో వారానికి కలెక్షన్లు మరింత పడిపోతాయని మేకర్స్ కూడా అంచనా వేశారు. ఇది ఒకప్పుడు రూ. 10 కోట్లకు పైగా వసూలు చేసి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.
మొత్తానికి, "జగదేక వీరుడు అతిలోక సుందరి" రీ-రిలీజ్ ప్రేక్షకుల్లో నాస్టాల్జియాను కలిగించినా, కమర్షియల్‌గా మాత్రం నిలదొక్కుకోలేకపోయింది. రీ-రిలీజ్ ప్లాన్ చేయాలంటే కంటెంట్‌తో పాటు మార్కెట్ ట్రెండ్‌ను కూడా బాగా విశ్లేషించాల్సిన అవసరం ఉందనటానికి ఇది ఒక ఉదాహరణ.