Toxic Teaser: బోల్డ్ సీన్స్‌తో షాక్ ఇచ్చిన 'టాక్సిక్' బ్యూటీ ఎవరో తెలుసా ..?

యష్ నటించిన పాన్ ఇండియా సినిమా ‘టాక్సిక్’ టీజర్ దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. టీజర్‌లోని బోల్డ్ సీన్‌తో హాలీవుడ్ నటి నటాలీ బర్న్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సీన్‌పై విమర్శలు రావడంతో దర్శకురాలు గీతూ మోహన్ దాస్ సోషల్ మీడియాలో స్పందించారు.

New Update
Toxic Teaser

Toxic Teaser

Toxic Teaser: కన్నడ సూపర్ స్టార్ యష్(Yash) నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా సినిమా ‘టాక్సిక్’ టీజర్ ఇటీవల విడుదలై దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారి తీసింది. దాదాపు నాలుగేళ్ల గ్యాప్ తర్వాత యష్ నుంచి వస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. టీజర్‌లో యష్‌ను ‘రాయ్’ అనే పాత్రలో చూపించారు. ఈ పాత్ర పూర్తిగా డార్క్ షేడ్‌తో, ఊరమాస్ స్టైల్‌లో ఉండటంతో ఫ్యాన్స్ చాలా ఎగ్జైట్ అవుతున్నారు.

టీజర్ మొత్తం యష్ క్యారెక్టర్, అతని బాడీ లాంగ్వేజ్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకునేలా ఉన్నప్పటికీ, ఒక సీన్ మాత్రం ఎక్కువగా హైలైట్ అయింది. అదే యష్‌తో కలిసి వచ్చిన బోల్డ్ ఇంటిమేట్ సీన్. ఆ సీన్‌లో యష్‌తో కలిసి నటించిన విదేశీ హీరోయిన్ ఎవరు అనే విషయం సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది. నెట్టింట అభిమానులు, ప్రేక్షకులు ఈ భామ గురించి వెతకడం మొదలుపెట్టారు.

Hollywood Actress Natalie

ఆ విదేశీ నటి మరెవరో కాదు… హాలీవుడ్ నటి, మార్షల్ ఆర్ట్స్ నిపుణురాలు నటాలీ బర్న్. ఉక్రెయిన్ మూలాలు ఉన్న నటాలీ బర్న్ ఇప్పటికే హాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ‘ది ఎక్స్‌పెండబుల్స్ 3’, ‘మెకానిక్: రిసరెక్షన్’ లాంటి యాక్షన్ సినిమాల్లో నటించి పేరు సంపాదించింది. కేవలం నటిగానే కాకుండా మోడల్‌గా, స్క్రీన్ రైటర్‌గా, నిర్మాతగా కూడా ఆమెకు అనుభవం ఉంది. ‘టాక్సిక్’ సినిమాతో ఆమె తొలిసారి ఇండియన్ సినిమాల్లో అడుగు పెట్టడం విశేషం. అంతేకాదు, ఈ చిత్రానికి నిర్మాతల్లో ఒకరిగా కూడా ఆమె వ్యవహరిస్తుండటం మరింత ఆసక్తికరంగా మారింది.

ఈ సినిమాకు గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆమె డైరెక్షన్‌లో యష్‌ను ఇప్పటివరకు చూడని కొత్త కోణంలో చూపిస్తున్నారని టీజర్ చూస్తే అర్థమవుతుంది. సినిమాలో కియారా అద్వానీ, నయనతార వంటి స్టార్ హీరోయిన్లు కూడా నటిస్తున్నప్పటికీ, టీజర్‌లో మాత్రం నటాలీ బర్న్ చేసిన బోల్డ్ నటన అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో ఆమె ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.

అయితే టీజర్‌లో ఉన్న ఆ బోల్డ్ సీన్‌పై సోషల్ మీడియాలో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఈ సీన్ మహిళలను తక్కువగా చూపించేలా ఉందని విమర్శిస్తున్నారు. మరోవైపు, మరికొందరు ఇది కేవలం టీజర్‌లో భాగం మాత్రమేనని, సినిమాలో దానికి అర్థం ఉంటుందని అంటున్నారు. ఈ విమర్శలపై స్పందించిన దర్శకురాలు గీతూ మోహన్ దాస్, తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఓ పోస్టు షేర్ చేశారు. మహిళల భావాలు, సమ్మతి, మహిళలు వ్యవస్థల్లో ఎలా పోరాడతారన్న అంశాలపై ప్రజలు ఇంకా అర్థం చేసుకునే ప్రయత్నంలో ఉన్నారని ఆమె రాసుకొచ్చారు. ఈ పోస్ట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది.

దీనిపై నెటిజన్లు మళ్లీ చర్చ మొదలుపెట్టారు. కొందరు దర్శకురాలికి మద్దతుగా నిలవగా, మరికొందరు ఆ సీన్ అవసరమా కాదా అన్నదానిపై ప్రశ్నలు వేస్తున్నారు. ఏదేమైనా, ‘టాక్సిక్’ టీజర్ మాత్రం సినిమా మీద ఆసక్తిని బాగా పెంచింది. ఈ సినిమా మార్చి 19న విడుదల కానున్నట్టు సమాచారం. యష్ కెరీర్‌లో మరో సంచలనంగా ఈ సినిమా నిలుస్తుందా లేదా అన్నది చూడాలి.

Advertisment
తాజా కథనాలు