Suhas Hey Balawanth: 'నువ్వు కూడా హీరోవా..?' ‘హే బలవంత్’ ప్రమోషన్‌లో హీరో సుహాస్ ఎమోషనల్..!

సుహాస్ ‘హే బలవంత్’ ప్రమోషన్‌లో “నువ్వు హీరోవా?” అన్న ప్రశ్న బాధపెట్టిందని చెప్పారు. రూపం కంటే నటనే ముఖ్యమని తన ప్రయాణంతో నిరూపించాలనేదే లక్ష్యమన్నారు. ఫిబ్రవరి 20న రానున్న ‘హే బలవంత్’తో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు.

author-image
By Lok Prakash
New Update
Suhas Hey Balawanth

Suhas Hey Balawanth

Suhas Hey Balawanth: టాలీవుడ్‌లో సహజ నటనతో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సుహాస్ ఇటీవల ఒక ఆసక్తికర సంఘటనను గుర్తు చేసుకున్నారు. తన కొత్త సినిమా ‘హే బలవంత్’ ప్రమోషన్ సందర్భంగా జరిగిన ఇంటర్వ్యూలో, ఒకసారి తనను “నువ్వు కూడా హీరోవా?” అని అడిగారని చెప్పారు. ఆ ప్రశ్న మొదట తనను బాధపెట్టిందని, కానీ ఇప్పుడు అలాంటి వ్యాఖ్యలకు అలవాటైపోయానని తెలిపారు.

సత్యం రాజేష్‌తో మాట్లాడినప్పుడు సుహాస్ తన మనసులోని భావాలను బయటపెట్టారు. సాధారణంగా హీరో అంటే ఒక ప్రత్యేకమైన లుక్ ఉండాలనే అభిప్రాయం ఇంకా చాలా మందిలో ఉందని అన్నారు. తాను కూడా అలాంటి కామెంట్లు ఎదుర్కొన్నానని, మొదట్లో బాధ వేసిందని చెప్పారు. “సరేలే, అందరినీ ఒకేలా అడగలేరు కదా” అని తనను తాను ధైర్యం చెప్పుకున్నానని వెల్లడించారు.

యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్‌తో ప్రారంభమైన సుహాస్ ప్రయాణం చిన్న పాత్రలతో సినిమాల్లోకి వచ్చారు. ‘కలర్ ఫోటో’తో హీరోగా గుర్తింపు పొందిన ఆయన, ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. సహాయపాత్రలు మాత్రమే కాదు, ‘హిట్ 2’లో విలన్‌గా కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రూపం కంటే నటన ముఖ్యమని తన కెరీర్‌తోనే నిరూపించాలని తాను భావిస్తున్నానని తెలిపారు.

ప్రస్తుతం సుహాస్ నటిస్తున్న ‘హే బలవంత్’ సినిమా ఫిబ్రవరి 20న విడుదల కానుంది. ఒక కొత్త బిజినెస్ ఆలోచన చుట్టూ తిరిగే ఈ కథలో కామెడీ, ఎమోషన్, ట్విస్టులు ఉంటాయని చిత్రబృందం తెలిపింది. సినిమా కాన్సెప్ట్‌ను సరిగ్గా అంచనా వేసిన వారికి నగదు బహుమతి కూడా ప్రకటించారు.

విమర్శలను పట్టించుకోకుండా, తన ప్రతిభపై నమ్మకంతో ముందుకు సాగుతున్న సుహాస్ ఈ తరం నటుల్లో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించారు. ప్రేక్షకుల ఆదరణే తనకు పెద్ద బలం అని ఆయన అన్నారు. ‘హే బలవంత్’తో మరోసారి తన నటనతో మెప్పించేందుకు సిద్ధంగా ఉన్నారు.

Advertisment
తాజా కథనాలు