China Manjha: మాంజా మర్డర్స్.. చైనా దారంతో దారుణాలు.. తప్పెవరిది?

పతంగులు ఎగరేయడానికి యథేచ్ఛగా చైనా మాంజా వాడేస్తున్నారు ప్రజలు. ఆ మాంజా కారణంగా నిండు ప్రాణాలు బలి అయిపోతున్నాయి. హైదరాబద్ లో ఒక ఆర్మీ ఆఫీసర్ సంక్రాంతి రోజు మాంజా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. చైనా మాంజా కట్టడికి పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. 

China Manjha: మాంజా మర్డర్స్.. చైనా దారంతో దారుణాలు.. తప్పెవరిది?
New Update

China Manjha: పండగ అంటే అందరికీ సంతోషాన్ని ఇవ్వాలి. మనకు సంబరాలను తెచ్చి.. వేరొకరికి చావును తీసుకువచ్చే విధంగా పండగ ఉండకూడదు. అది తెలిసి జరిగినా.. తెలియక జరిగినా.. మనం చేసిన తప్పుకు మరొకరు బలైపోవడం అంటే అటువంటి పండగ సంబరాలను పక్కన పెట్టడమే మంచిది. మీడియాలో వార్తలు చూస్తున్నాం.. అరచేతిలో ఏది మంచిదో ఏది చెడు  చేస్తుందో చెప్పే కథనాలు కనపడుతున్నాయి. ఇది మంచిది కాదు అని చెబుతున్నా.. ప్రమాదం అని చెబుతున్నా.. గాలిపటం సరదాతో.. చేస్తున్న తప్పు ప్రాణాలు తీసేస్తోంది. ఇదంతా ఎందుకంటే.. హైదరాబాద్ లో పండగ పూట ఆర్మీ అధికారి ప్రాణాలను చైనా మాంజా తీసేసింది. అంటే మాంజాతో మర్డర్ జరిగిపోయింది. 

అందరికీ తెలుసు.. అయినా..
చైనా మాంజా  ప్రమాదకరం అని దానిని అమ్ముతున్న వారికి తెలుసు.. అక్రమంగా దానిని అమ్ముతున్నారన్న విషయం మన పోలీసు వర్గాలకూ తెలుసు. ప్రతి సంవత్సరం చైనా మాంజా ప్రాణాలు తీయడమో.. ఆసుపత్రి పాలు చేయడమో ఏదో రకమైన ప్రమాదాల్ని చాలా తీసుకువస్తోందనీ తెలుసు. కానీ.. చైనా మాంజా విచ్చలవిడిగా బహిరంగంగా మార్కెట్లో దొరికేస్తోంది. పిల్లలు.. వాళ్ళ సరదా వారిది. ఆ దారం ప్రాణం తీస్తుందనే అవగాహన వారికీ ఉండకపోవచ్చు.. ఇంత ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో  నియంత్రించాల్సిన వ్యవస్థలు నిద్రపోతున్నాయి. పిల్లలను హెచ్చరించాల్సిన పెద్దలు ఉదాశీనంగా ఉండిపోతున్నారు. దీంతో మాంజా మర్డర్స్ జరిగిపోతున్నాయి. నిజానికి వీటిని ప్రమాదం అని అంటారు.. కానీ మర్డర్ అని ఎందుకు అంటున్నామంటే ప్రమాదకరమైన వస్తువు అని తెలిసి కూడా దానితో సరదా తీర్చుకుంటున్నారు. ఆ సరదా వలెనే ఈరోజు ఒక నిండు ప్రాణం బలి అయిపోయింది. 

వ్యాపారులూ.. మానవత్వం లేదా..
ఒక గాలిపటం కోసం చైనా మాంజా(China Manjha) అమ్మితే వ్యాపారికి వచ్చే లాభం మహా అయితే ఓ 20 రూపాయలు ఉంటుంది. అలా వారు సీజన్ అంతా అమ్మిన చైనా మాంజాతో వారికి ఒరిగేది ఓ పదివేల రూపాయలు ఉండొచ్చు. ఎందుకంటే దాని మార్కెట్ ఎంత పెద్దదైనా.. రిటైల్ గా అమ్మే వ్యాపారులకు చివరకు మిగిలేది అంతే.. అక్రమంగా చైనా నుంచి మాంజా తెచ్చే వారికి లక్షల్లో మిగలవచ్చు. ఇక్కడ చివరలో కస్టమర్ కి అందిస్తున్న వారే ముఖ్యం కదా.. చైనా మాంజా ప్రమాదం అని తెలిసీ.. కేవలం డిమాండ్ ఉంది అనే కారణంతో.. మిగిలే వేల రూపాయల కోసం దానిని అమ్ముతూ వస్తున్నారు. ప్రాణాలు తీస్తుంది లేదా ప్రమాదాలు తెస్తుంది అని తెలిసిన తరువాత కూడా ఈ వ్యాపారులు ఇలాంటి వ్యాపారం చేస్తున్నారంటే.. వారిలో మానవత్వాన్ని లాభాల రూపాయలు మింగేస్తున్నాయి అనుకోక తప్పదు. 

Also Read: జవాన్ ప్రాణం తీసిన మాయదారి మాంజా.. రాష్ట్రంలోనూ పలు ఘటనలు

ప్రమాదాలు ఇలా..
ఎక్కడో ఒక చోట ఇలా జరిగింది అని ప్రమాదాలు అంటూ గోల చేస్తున్నారు అని అనుకోవద్దు. ఈ సీజన్ లోనే గత రెండు మూడు రోజుల్లోనే చాలామంది ఈ చైనా మాంజా(China Manjha) బారిన పడి దెబ్బలు తగిలించుకున్నారు. రోడ్డుపై బైక్ నడుపుతున్నప్పుడు సడెన్ గా మాంజా మీద పడటంతో దానిని తప్పించుకోబోయి కిందపడి కాళ్ళూ చేతులూ విరగ్గొట్టుకున్న కేసులు చాలా వెలుగులోకి వచ్చాయి. నగరంలోని ఫ్లై ఓవర్ల పైన చైనా మాంజా చేస్తున్న ప్రమాదం ఎక్కువగా ఉంది. సాధారణంగా ఇప్పుడు రోడ్లపై ట్రాఫిక్ చాలా తక్కువగా ఉంటుంది. దీంతో వాహనాలు కాస్త వేగంగానే వెళతాయి. అంత వేగంగా వెళ్లే వాహనాలకు మాంజా అడ్డు తగిలితే.. వాహనం నడిపే వారు ప్రమాదాల్లో పడటం ఖాయం కాదా? ఇక ఈ మాంజా కారణంగా చనిపోతున్న పక్షుల గురించి చెప్పక్కర్లేదు. గాలిలో ఎగురుతున్న పక్షులు మాంజా తగలడంతో కిందపడి చచ్చిపోతున్నాయి. 

చర్యలు ఉన్నాయా?
ఈ చైనా మాంజా  కట్టడికోసం ప్రభుత్వం, పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ, అవి సరిపోవు. మాంజా అక్రమ అమ్మకాలపై చర్యలు తీసుకోవడం ఒక్కటే దీనికి పరిష్కారం కాదు. చైనా మాంజా తీసుకువచ్చే ప్రమాదాల గురించి అవగాహన కల్పించడం చాలా ముఖ్యం. పతంగుల పండుగ జరుగుతున్న ప్రాంతంలో దీని గురించి అవగాహనా కార్యక్రమాలు ఏర్పాటు చేయవచ్చు. అలానే.. పతంగుల సీజన్ ప్రారంభం అయిన దగ్గర నుంచి చైనా మాంజా ప్రమాదకరం అని చెబుతూనే.. దానిని ఉపయోగిస్తూ దొరికితే కఠిన చర్యలు ఉంటాయని చెప్పాలి. మద్యం తాగడం ప్రమాదకరం అని ప్రచారం చేస్తున్నారు.. దొరికితే జైలు పాలు చేస్తున్నారు. నిజానికి మద్యం, సిగరెట్ ప్రమాదకరమైనా..  అది సరదా తీర్చుకోవడం కోసం తీసుకునేవారికే  హాని చేస్తాయి. వారి సరదాకి వారు చావును కొని తెచ్చుకుంటారు. కానీ, చైనా మాంజా  అలాకాదు.. ఎవరి సరదా కోసమో.. ఎవరో బలైపోతారు. ఇంకో విషయం ఏమిటంటే ఈ మాంజా మర్డర్ జరిగినపుడు ఆ దారాన్ని కట్టిన గాలిపటం ఏదో.. ఎవరు ఎగరేశారో కూడా ఎవరికీ తెలియదు. అంటే.. కనీసం చనిపోయిన వారి కుటుంబానికి తమకు ఈ శిక్ష వేసిన వారు ఎవరో తెలిసే అవకాశమే ఉండదు. 

Watch this interesting Video:

#kite-festival #makarasankranthi
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe