ప్రపంచ నంబర్ వన్ నార్వేకు చెందిన మాగ్నస్ కార్ల్‌సెన్‌తో జరిగిన ఫైనల్‌లో భారత్‌కు చెందిన ఆర్ ప్రజ్ఞానంద రెండో టై బ్రేక్‌లో ఓడిపోయాడు. ఈ ఓటమితో భారత్‌కు చెందిన ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించే అవకాశాన్ని కోల్పోయాడు. ప్రజ్ఞానంద మొదటి టై బ్రేకర్ వరకు కార్ల్‌సెన్‌తో గట్టిగా పోరాడాడు. కానీ రెండవ టై-బ్రేకర్‌లో, కార్ల్‌సెన్ తన ఆట శైలిని మార్చుకున్నాడు. కార్ల్‌సెన్ మూవ్స్‌ని ఛేదించేసమయంలో ఒక్కొ మూవ్‌కి ప్రజ్ఞానంద ఎక్కువ టైమ్ కేటాయించాడు. అందుకే ఓటమిని అంగీకరించాల్సి వచ్చింది.
ఇది ఓటమి కాదు..గెలుపే:
ఫిడే చెస్ వరల్డ్ కప్ ఫైనల్‌లో ప్రజ్ఞానందకు నిరాశే ఎదురైనా ఇది ఓటమి కింద భావించకూడదు.. ఎందుకంటే 18ఏళ్ల కుర్రాడు.. టీనెజ్ కూడ దాటని వయసులో ప్రపంచ నంబర్ వన్ మాగ్నస్ కార్ల్‌సెన్‌ని గట్టి పోటినిచ్చాడంటే అది చిన్నవిషయం కాదు. పదేళ్ల వయసులోనే ఈ చెస్ ప్రాడిజీని ప్రపంచం గుర్తించింది. పదేళ్ల వయసులో అంతర్జాతీయ మాస్టర్‌గా మారాడు ప్రజ్ఞానంద. విమెన్ గ్రాండ్ మాస్టర్, ఇంటర్నేషనల్ మాస్టర్ అయిన ఆర్.వైశాలికి తమ్ముడు ప్రజ్ఙానంద. 2016లో పదేళ్ల, పది నెలల, పంతొమ్మిది రోజుల వయసులో యంగెస్ట్ ఇంటర్నేషనల్ మాస్టర్‌గా కిరీటాన్ని పొందాడు ప్రజ్ఞానంద.
16ఏళ్ల వయస్సులో ఫిబ్రవరి 2022లో జరిగిన ఎయిర్‌థింగ్స్ మాస్టర్స్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్‌లో ర్యాపిడ్ గేమ్‌లో అప్పటి ప్రపంచ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్‌సెన్‌ను ఓడించిన అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా నిలిచాడు. ప్రజ్ఞానంద ఆగస్టు 10, 2005న తమిళనాడులోని చెన్నైలో జన్మించాడు. అతని తండ్రి, రమేష్‌బాబు, TNSC బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్, అతని తల్లి నాగలక్ష్మి గృహిణి, తరచుగా జాతీయ, అంతర్జాతీయ టోర్నమెంట్‌లకు అతనితో పాటు వచ్చేవారు. చెన్నైలోని వేలమ్మాళ్ మెయిన్ క్యాంపస్‌కు హాజరయ్యారు.
ప్రజ్ఞానంద కెరీర్
తన సోదరి ఆటను చూసిన తర్వాత ఆటపై ఆసక్తి కనబరిచిన ప్రజ్ఞానంద.. ఏడు సంవత్సరాల వయస్సులో 2013లో అండర్-8 ప్రపంచ యూత్ చెస్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్నప్పుడు తన మొదటి విజయాన్ని సాధించాడు. అతని విజయం ఫలితంగా అతను FIDE మాస్టర్ బిరుదును సంపాదించాడు. 2015లో రెండోసారి అండర్-10 టైటిల్‌ను గెలుచుకున్నాడు. ప్రజ్ఞానంద 2016లో పదేళ్ల, పది నెలల, పంతొమ్మిది రోజుల వయసులో యంగెస్ట్ ఇంటర్నేషనల్ మాస్టర్‌గా కిరీటాన్ని పొందాడు. మరుసటి సంవత్సరం, ప్రపంచ జూనియర్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో, అతను తన మొదటి గ్రాండ్‌మాస్టర్ నార్మ్‌ని సంపాదించాడు.
ప్రజ్ఞానంద 2018 సంవత్సరంలో 12 సంవత్సరాల 10 నెలల 13 రోజుల వయస్సులో రెండవ అతి పిన్న వయస్కుడైన గ్రాండ్ మాస్టర్ అయ్యాడు. ఇటలీలో జరిగిన గ్రెడిన్ ఓపెన్‌లో లుకో మొరోనిని ఓడించడం ద్వారా అతను అసాధారణ విజయాన్ని సాధించాడు. 2022లో ఆన్‌లైన్ ఎయిర్‌థింగ్స్ మాస్టర్స్‌లో ప్రపంచ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్‌సెన్‌ను ఓడించిన విశ్వనాథన్ ఆనంద్, హరికృష్ణ తర్వాత ప్రజ్ఞానానంద మూడో భారతీయుడు. ప్రపంచ ఛాంపియన్‌ను ఓడించిన అతి పిన్న వయస్కుడు. కేవలం 18 ఏళ్ల వయసున్న ప్రగ్నానంద, ప్రపంచ మూడో ర్యాంకర్ ఫాబియానో కరువానాను టై బ్రేకర్‌లో ఓడించి FIDE వరల్డ్ కప్ ఫైనల్‌కు చేరుకున్నాడు. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారతీయుడు ప్రజ్ఞానంద.. అయితే ఫైనల్‌లో ఓడిపోవడం కాస్త నిరాశ కలిగించింది.. ఇటు ట్విట్టర్‌లో ప్రజ్ఙానందని అభినందిస్తూ ట్వీట్లు పోటేత్తుతున్నాయి. అటు ప్రజ్ఞానంద సిల్వర్ మెడల్ సాధించడంతో అతని తండ్రి ఆనందం వ్యక్తం చేశారు.