Cheetah in Vanasthalipuram: నగరశివారు వనస్థలిపురంలో చిరుత సంచరించిందన్న పుకార్లు స్థానికంగా తీవ్ర కలకలాన్ని రేపుతున్నాయి. వనస్థలిపురం సాగర్ కాంప్లెక్స్ దగ్గర గురువారం రాత్రి చిరుత కనిపించిందని కొందరు స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. దీంతో సమాచారం అందుకున్న సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకొని పరిసర ప్రాంతాలను పరిశీలించారు.
స్థానికులు చెబుతున్న సమాచారం ప్రకారంగా.. అక్కడ చిరుత సంచారం జరిగిందనడానికి ఆనవాళ్లను వెతుకుతున్నారు అటవీశాఖ అధికారులు. అయితే రాత్రి ఇంకా ఉదయం నుంచి కూడా ఆనవాళ్ల కోసం వెతుకుతున్నామని ఎక్కడా చిరుత అడుగు జాడలు దొరకలేదని ఫారెస్ట్ ఆఫీసర్ విష్ణువర్థన్ రెడ్డి అన్నారు.
కాగా, సాధారణంగా చిరుత 24 గంటల్లో 50 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుందని.. దీని ప్రకారంగా చిరుత ఇబ్రహీంపట్నం వరకు వెళ్లే అవకాశముంటుందని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. ఇక కాలనీ వాసులు భయాందోళనకు గురి కావద్దన్న అధికారులు..సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. మరో వైపు బోన్లను కూడా సిద్ధంగా ఉంచామన్నారు. చిరుత కదలికలు కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలన్నారు. ప్రజలకు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటామన్నారు.
రాచకొండ పోలీసుల సహాయంతో చిరుత జాడను తెలుసుకునే పనిలో ఉన్నామని అటవీ శాఖ అధికారులు తెలిపారు. మరోవైపు చిరుత వనస్థలిపురంలోని కాలనీలోని సాగర్ ఎన్ క్లేవ్ దగ్గర సంచరిస్తుండగా చూశామని స్థానికులు చెబుతున్నారు. దీంతో అది పరిసరాల్లోనే ఉండొచ్చని వారు తీవ్ర భయాందోళనకు గురి అవుతున్నారు. తలుపులు వేసుకొనే ఉంటున్నారు.
Also Read: అదరగొట్టిన ఉప్పెన.. ఉత్తమ తెలుగు సినిమా కేటగిరీలో నేషనల్ ఫిల్మ్ అవార్డు