టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి(Chandrababu)కి మరోసారి కోర్టుల్లో ఎదురుదెబ్బ తగిలింది. ఏసీబీ కోర్టు సోమవారం నాడు చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై తీర్పును వెలువరించింది. రెండు పిటిషన్లను కొట్టివేసింది. అలాగే ఏపీ ఫైబర్ నెట్(AP fiber net), అంగళ్లు అల్లర్లు, ఇన్నర్ రింగ్ రోడ్ కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లపై తీర్పు వెలువడింది. మూడు పిటిషన్లనూ కొట్టివేస్తూ న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది. వీటితో పాటు తనపై పెట్టిన కేసును కొట్టివేయాలంటూ సుప్రీంకోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై సోమవారం నాడు విచారణ జరిగింది. చంద్రబాబు తరపున హరీష్ సాల్వే, ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. ఈ కేసు విచారణను జస్టిస్ అనిరుద్ధబోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేదిలతో కూడిన ధర్మాసనం నేటికి వాయిదా వేసింది.
సుప్రీంకోర్టుపైనే ఆశలు..
చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై ఈ నెల 3నే ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు.. హైకోర్టు ముందు దాఖలు చేసిన పత్రాలను తమకు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను సోమవారానికి వాయిదా వేసింది. దీంతో సోమవారం మళ్లీ వాదనలు కొనసాగాయి. 2018లోనే విచారణ ప్రారంభమైందంటూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముకుల్ రోహత్గీ చేసిన వాదనలను ఈ సందర్భంగా జస్టిస్ బేలా ఎం.త్రివేది ప్రస్తావించారు. అనంతరం హరీశ్ సాల్వే వాదిస్తూ రోహత్గీ వాదనే సహేతుకం కాదని.. ఎఫ్‌ఐఆర్‌కు దారితీసిన విచారణ అదికాదని చెప్పారు. గతంలో ఏదో విచారణ జరిగిందని.. దాన్ని మూసేశారని చెప్పారు. ఆ తర్వాత కొత్త విచారణ ప్రారంభించారని తెలిపారు. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఎక్కడున్నాయి? హైకోర్టు వాటిని పరిశీలించిందా అని జస్టిస్ బేలా ఎం.త్రివేది ప్రశ్నించగా.. అసలు సమస్యంతా అక్కడే ప్రారంభమైందని సాల్వే చెప్పారు.
17ఏ గురించే చర్చ:
17ఏ అనేది డేట్ ఆఫ్ ఎఫ్‌ఐఆర్ వర్తిస్తుందా? లేదా? డేట్ ఆఫ్ అఫెన్స్ కింద వర్తిస్తుందా? అనేది కోర్టు ముందుంచామని, నేరుగా నగదు తీసుకుంటూ పట్టుబడితే తప్ప మిగిలిన అన్నింటికి 17ఏ వర్తిస్తుందన్నారు. అవినీతి నిరోధక శాఖ చట్టం ప్రకారం కేసు పెడితే ఈ పాటికే మాకు ఉపశమనం లభించేదని సాల్వే వాదించారు. ఈ కేసులో అందరికీ బెయిల్ వచ్చిందని, అరెస్ట్ చట్టవిరుద్ధమని సాల్వే వాదించారు. దీనిపై మంగళవారం ఉదయం 10.30 గంటలకు మళ్లీ వాదనలు వినిపించేందుకు అనుమతి ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం తరఫున ముకుల్ రోహత్గీ కోరారు. దీంతో రోహత్గీ అభ్యర్థనకు సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం విచారణను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్టు వెల్లడించింది.
ALSO READ: చంద్రబాబుకు బిగ్ షాక్.. తాజా అప్టేట్స్ ఇవే!