/rtv/media/media_files/2026/01/26/padmasri-2026-01-26-08-38-56.jpg)
ప్రెస్టీజ్ ప్రెషర్ కుక్కర్‌ను ఇంటింటి పేరుగా మార్చిన టీటీకే (TTK) గ్రూప్ మాజీ ఛైర్మన్, దివంగత టీటీ జగన్నాథన్ ను కేంద్ర ప్రభుత్వం సమున్నత గౌరవంతో సత్కరించింది. వాణిజ్య, పారిశ్రామిక రంగంలో ఆయన చేసిన విశేష కృషికి గుర్తింపుగా మరణానంతరం ఆయనకు పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది.
గతేడాది అక్టోబర్‌లో 77 ఏళ్ల వయసులో ఆయన కన్నుమూశారు. దాదాపు ఐదు దశాబ్దాల పాటు టీటీకే ప్రెస్టీజ్ గ్రూప్‌లో కీలక బాధ్యతలు నిర్వహించిన ఆయనను దేశం కిచెన్ మోఘల్ అని గౌరవంగా పిలుచుకుంటుంది.
జగన్నాథన్ కేవలం వ్యాపారవేత్తగానే కాకుండా ఒక గొప్ప ఆవిష్కర్తగా గుర్తింపు పొందారు. ప్రెషర్ కుక్కర్లలో భద్రత కోసం ఆయన కనిపెట్టిన 'జీఆర్ఎస్ (GRS) సేఫ్టీ మెకానిజం' వంటగదిలో ప్రమాదాలను తగ్గించడంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. ఒకప్పుడు కేవలం కుక్కర్ల తయారీకే పరిమితమైన ప్రెస్టీజ్ సంస్థను, ఆయన నాయకత్వంలో ఎలక్ట్రికల్ ఉపకరణాలు, ఇతర వంటగది పరికరాలను అందించే పూర్తిస్థాయి కిచెన్ సొల్యూషన్స్ బ్రాండ్‌గా విస్తరించారు. అంతేకాకుండా, అప్పుల్లో ఉన్న టీటీకే గ్రూప్‌ను లాభాల్లోకి మళ్లించి, అప్పులు లేని సంస్థగా తీర్చిదిద్దడంలో ఆయన కృషి అనన్యం.
వంటగదిలోనే ప్రారంభం
ఐఐటీ మద్రాస్ నుంచి గోల్డ్ మెడల్ విజేత అయిన ఈయన అమెరికాలోని కార్నెల్ విశ్వవిద్యాలయం నుంచి ఆపరేషన్స్‌లో పీహెచ్‌డీ చేశారు. ఈయనకు వంట చేయడం అంటే చాలా ఇష్టం. తనకు కొత్త ఆవిష్కరణలు చేయాల్సిన అవసరం ఎల్లప్పుడూ వంటగదిలోనే ప్రారంభమవుతుందని ఆయన చెప్పేవారు. దేశీయ మార్కెట్‌లోనే కాకుండా ప్రెస్టీజ్ ఆయన పర్యవేక్షణలో అమెరికా, యుకె వంటి ప్రపంచ మార్కెట్లలో కూడా విస్తరించింది.
టిటి జగన్నాథన్ డిస్రప్ట్ అండ్ కాంక్వెర్ - హౌ టిటికె ప్రెస్టీజ్ బికేమ్ ఎ బిలియన్ డాలర్ కంపెనీ అనే ప్రసిద్ధ పుస్తకాన్ని కూడా రచించారు.
Follow Us